టీడీపీకి ఓటమి గుబులు

Kolagatla Veerabadra Swamy Slams Chandrababu Naidu - Sakshi

ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైఎస్సార్‌ సీపీ భాగస్వామ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ

నవరత్నాల హామీలకు భయపడే ఎన్నికల వేళ పింఛన్‌ పెంపు

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల   

విజయనగరం మున్సిపాలిటీ:  నాలుగున్నరేళ్ల పాలనలో  ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార టీడీపీకి ఓటమి గుబులు పట్టుకుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి  అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా  సమావేశంలో చంద్రబాబు, కేసీఆర్‌ సన్నిహితంగా ఉన్న ఫోటోలను అలాగే కేసీఆర్‌ విజయవాడ వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు అతనికి స్వాగతం తెలిపిన రీతిన ఉన్న ఛాయాచిత్రాలను విడుదల చేశారు. అనంతరం కోలగట్ల మాట్లాడుతూ పూర్తిగా అవినీతి, అక్రమాలు, అరాచకాల ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు తాను చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఎదుటి వారిపై  అంభాడాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించేందుకు కేటీఆర్, జగన్‌ చర్చిస్తే ఏదో తప్పు చేసినట్టు దుష్ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు చేస్తే  ఒప్పు...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏ పార్టీకైనా  కేంద్రంలో తప్పకుండా మద్దతు ఇస్తామని ఇదివరకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలియజేసిందని ఈ సందర్భంగా కోలగట్ల గుర్తు చేశారు. కేటీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరవలసిందిగా ఆహ్వానించారని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే టీడీపీ నేతలు అభాండాలు వేయడం తగదన్నారు. ఇటీవల  జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్వయంగా చంద్రబాబు కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని చెప్పిన మాటలు వాస్తవం కాదా అంటూ  కోలగట్ల ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించి ఈ రోజు కేసీఆర్‌ ద్వారా ఆంధ్ర రాష్ట్రం  నష్టపోతున్నదనడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తే ఒప్పు ప్రతిపక్ష పార్టీ చేస్తే తప్పు అన్న చందంగా చంద్రబాబు వైఖరి ఉందని విమర్శించారు.  నవరత్నాల హమీలను ప్రజలు  ఆదరించటంతో ఓర్వలేని చంద్రబాబు  ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్‌ మొత్తాన్ని పెంచారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విజయనగరం నగర కన్వీనర్‌  ఆశపు వేణు , మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్లు యస్‌వి వి.రాజేష్, కేదారశెట్టి సీతారామమూర్తి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బొద్దాన అప్పారావు, విజయనగరం  పార్లమెంట్‌ పార్టీ జిల్లా ప్రధాన  కార్యదర్శి ముద్దాడ మధు, యవజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌ కౌషిక్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జివి.రంగారావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top