ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా టీజేఎస్‌ 

Kodandaram comments on Rythu Bandhu - Sakshi

‘పంచాయతీ’కి సిద్ధం: కోదండరాం  

నెలాఖరున ‘సడక్‌ బంద్‌’ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన కోసమే టీజేఎస్‌ ఆవిర్భవించిందని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.

కరీంనగర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల టీజేఎస్‌ ముఖ్యకార్యకర్తలకు జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాజకీయ శిక్షణా తరగతులను కోదండరాం ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి హాజరైన కార్యకర్తలకు వ్యవసాయం, విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, సామాజిక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకుని, సమాజంలో ప్రాధాన్యతను గుర్తించి ప్రజలకు తెలియజేయాలని కోరారు.

అందుకోసమే కరీంనగర్‌ నుంచే రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్‌ తరఫున పోటీ చేసే వారిని గుర్తించి, పంచాయతీలను బలోపేతం చేసే దిశగా పనిచేయాలన్నారు. ప్రస్తుత రాజకీయాలు కంపుకొట్టేలా ఉన్నాయని ఏ పార్టీలో గెలిచాడో, ఏ పార్టీలో ఉంటున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందని.. అలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేలా రాజకీయ ప్రక్షా ళన జరగాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు.

కౌలు రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి ఇవ్వాలని, భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి కరీంనగర్‌ వరకు ‘సడక్‌ బంద్‌’ నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు. కర్ణాటక రాజకీయాలు గలీజుగా ఉన్నాయని, రాజకీయ విలువలను దిగజార్చేలా ఉన్న  రాజకీయాలను టీజేఎస్‌ వ్యతిరేకిస్తోందని చెప్పా రు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి గాదె ఇన్నయ్య, ముక్కెర రాజు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top