కార్మిక సంఘం ఎన్నికల్లో సీఎం జోక్యమా?: కిషన్‌ రెడ్డి

Kishan Reddy slams Cm Kcr over  Singareni elections - Sakshi

బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక సంఘం ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవటం ఇదే మొదటిసారని, అంతేకాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, చెడు సంప్రదాయానికి తెర లేపినట్లయిందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తన మాటలతో కార్మికులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సోమవారం ఇక్కడ బీజేపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను చేర్చుకోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికల కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్‌ ప్రకటించటం బాధ్యతారాహిత్యమన్నారు. కార్మిక సంఘం ఎన్నికల కోసం ఇంతగా దిగజారుడు ఎందుకని ప్రశ్నించారు. ఐఎన్‌టీయూసీ పోటీలో లేదని, ఏఐటీయూసీ నాయకులు అమ్ముడుపోతున్నారని, టీఆర్‌ఎస్‌ను ఓడించటం ఎంత ముఖ్యమో, బీఎంఎస్‌ను గెలిపించటం కూడా అంతే ముఖ్యమన్నారు. చివరకు స్పీకర్‌ సైతం సింగరేణి ఎన్నికల్లో బిజీగా ఉండటం దారుణమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో బీఎంఎస్‌ అధ్యక్షుడు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top