కేంద్ర కేబినెట్‌లోకి కిషన్‌రెడ్డి?

Kishan Reddy may get Union Cabinet berth - Sakshi

మొదటే అవకాశం ఇస్తారా.. తరువాత విస్తరణలో ఇస్తారా.

కేంద్ర మంత్రివర్గంపై మోదీ, అమిత్‌షా 3 గంటలపాటు భేటీ

రాష్ట్ర ప్రాతినిధ్యంపై పార్టీ శ్రేణుల్లో పెరిగిన ఆశలు 

అరవింద్, సంజయ్, బాపురావులకూ అవకాశం!

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ఎవరికి చోటు దక్కుతుందన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీగా సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందిన జి.కిషన్‌రెడ్డికి చోటు లభిస్తుందన్న అంచనాలు పెరిగాయి. రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలుపొందిన నలుగురిలో సీనియర్‌ ఆయనే అయినందునా మంత్రివర్గంలో తప్పకుండా చోటు దక్కే అవకాశం ఉంది. ఆయనతోపాటు ఎంపీలుగా నిజామాబాద్‌ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్, కరీంనగర్‌ నుంచి గెలుపొందిన బండి సంజయ్, ఆదిలాబాద్‌ నుంచి గెలుపొందిన సోయం బాపురావుల్లో మరొకరికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

అయితే రాష్ట్రానికి ఎన్ని కేంద్రమంత్రి పదవులు దక్కుతాయి? ఏ సమీకరణల ప్రతిపాదికన పదవులు కట్టబెడతారన్న ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై మోదీ బుధవారం అమిత్‌షాతో 3 గంటలకుపైగా చర్చించడంతో కేంద్ర కేబినెట్‌లో చోటుపై అంచనాలు పెరిగిపోయాయి. మోదీ మంత్రివర్గ కూర్పులో భాగంగా గురువారం తక్కువ మందితోనే ప్రమాణ స్వీకారం చేస్తారని, తరువాత విస్తరణలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించవచ్చని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.  

కిషన్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు..
కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి చాన్స్‌ దక్కుతుందా అన్న విషయాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ కిషన్‌రెడ్డికి ఉంది. పార్టీలో అనేక పదవులు అలంకరించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్‌కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కవితపై విజయం సాధించడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కేంద్ర మంత్రివర్గంలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం, జాతీయ పార్టీ పెద్దలతో సంబంధాలు కలిగి ఉండటం అరవింద్‌కు కలసి వస్తుందన్న చర్చ జరుగుతోంది. మరో బీసీ నేత బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడైన వినోద్‌ కుమార్‌ను ఓడించారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్‌ ఉంది. మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకూ మంత్రి పదవి దక్కే చాన్స్‌ ఉండొచ్చన్న వాదన కూడా ఉంది.

ఆదిలాబాద్‌ నుంచి గెలుపొందిన సోయం బాపురావు దక్షిణ భారత్‌లోనే బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దక్షిణాదిలో పాగావేయాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాబూరావుకు కేంద్రమంత్రి పదవి కట్టబెడుతుందా? అనేది ఆసక్తిగా మారింది. గతంలో సికింద్రాబాద్‌ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన బండారుకు దత్తాత్రేయకు కేబినెట్‌లో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా గెలిచిన నలుగురు అభ్యర్థుల్లో ఒకరిద్దరికి కచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి కేంద్ర కేబినెట్‌ చోటిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ పార్టీ అ«ధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు.

పట్టు నిరూపించుకున్న నేపథ్యంలో...
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదన్న విమర్శల నేపథ్యంలో వాటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ 4 స్థానాలను గెలుచుకొని క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టును నిరూపించుకుంది. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌పై బండి సంజయ్, నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కూతురు, టీఆర్‌ఎస్‌ మాజీ ఎంíపీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నగేష్‌పై సోయం బాపురావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలోనూ బీజేపీ స్పష్టమైన స్థానాలను సాధించి మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కనీసంగా ఒక్కరికైతే తçప్పకుండా చాన్స్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top