దళితున్ని సీఎం చేస్తారా అన్న ప్రశ్నకు బదులేదీ?

Kishan reddy comments over kcr - Sakshi

పద్మిని వెళ్లిపోతే నష్టం లేదు: కిషన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ తర్వాత అయినా దళితున్ని సీఎం చేస్తారా? అన్న అమిత్‌ షా ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలని బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దళితున్ని సీఎం చేస్తానని చెప్పి దళితులనే కాకుండా ప్రజలనూ కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంఐఎం ఆస్తులు పెంచుకుంటోందని మండిపడ్డారు.

దమ్ముంటే 119 స్థానాలకు పోటీ చేయాలన్నారు. తనకు తెలిసినంతవరకు దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని బీజేపీ సానుభూతిపరురాలని, తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేకసార్లు ఆమె తనతో మాట్లాడారని అన్నారు. ఆమె పార్టీలోకి రావడం, వెళ్లిపోవడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. కోర్టులు, కేసులు, సంస్థల పేర్లు చెప్పి శాసనసభను రద్దు చేశానని కేసీఆర్‌ చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇన్నిసార్లు హైకోర్టులో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం మరొకటి లేదని పేర్కొన్నారు.

సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. అందుకే హైకోర్టు తప్పుపట్టిందని, పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. ఈ నెల 13 నుంచి అన్ని పంచాయతీల సర్పంచులను కలిసే కార్యక్రమం బీజేపీ చేపడుతుందన్నారు. అమిత్‌ షా పర్యటనపై టీపీసీసీ చీఫ్‌ఉత్తమ్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని తెలిపారు.  

బీజేపీ యువ సమ్మేళనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ యువ సమ్మేళనానికి హాజరయ్యే ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా తమ పేరు నమోదు చేసుకునేలా బీజేపీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాట్లను సమీక్షించేందుకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహాజన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఐటీ విభాగాలను ఆమె ప్రారంభించారు.

అనంతరం మారియట్‌ హోటల్‌లో జరిగిన కార్యనిర్వాహక సమావేశంలోనూ యువ సమ్మేళనానికి సంబంధించిన రవాణా, ఆహార ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమ్మేళానికి దేశవ్యాప్తంగా ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో మిస్డ్‌ కాల్‌ ద్వారా కూడా పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మధుకేశ్వర్‌ దేశాయ్, మురుగానందన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, మురళీధర్‌రావు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top