నియంతృత్వం రెట్టింపు

Kishan Reddy comments on KCR and TRS Party - Sakshi

     టీఆర్‌ఎస్‌ గెలుపుపై ‘మీట్‌ ది ప్రెస్‌’లో కిషన్‌రెడ్డి

     కేసీఆర్‌ వ్యక్తిగత కారణాల వల్లే ముందస్తు ఎన్నికలు

     నిజాంపాలనలో భాగంగానే ధర్నాచౌక్‌ ఎత్తివేత

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే నయానిజాం పాలన వస్తుందని, నియంతృత్వం రెట్టింపు అవుతుందని బీజేపీ తాజా మాజీ శాసనసభాపక్షనేత, ఆ పార్టీ అంబర్‌పేట అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తాను నిజాం తరహా పాలన అందిస్తానని గతంలో కేసీఆర్‌ అన్నారని, అందులో భాగంగానే ధర్నాచౌక్‌ను ఎత్తేశారని విమర్శించారు. శుక్రవారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌యూజే) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ వ్యక్తిగత కారణాల వల్లే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చాయని, దీనివల్ల రూ.500 కోట్లకుపైగా ప్రజాధనం వృ«థా అవుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. అవినీతి ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, దానితో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గతంలో అనేక రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ, వాటికి రాజ్యాంగపరమైన కారణాలున్నాయన్నారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తాము త్యాగాలు చేసింది ఈ కుటుం బం కోసమేనా.. అని బాధపడుతున్నారన్నారు.  

హామీలు విస్మరించిన టీఆర్‌ఎస్‌.. 
దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేశారని, మంత్రివర్గంలోకి ఒక్క మహిళను కూడా తీసుకోలేదని, గిరిజనులకు రావాల్సిన 12 శాతం రిజర్వేషన్లకు ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే లక్షా 7 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్క ఉద్యోగఖాళీని కూడా నింపలేదని విమర్శించారు. ఇప్పుడే ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరముందా.. అని కేసీఆర్‌ అంటున్నారని, అసలు ఆయన మళ్లీ సీఎంగా రావాల్సిన అవసరముందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ పార్టీ చేతిలో ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌కు సహకరించేది లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ తరఫున అభ్యర్థులు గెలిచినా, మళ్లీ వారు పార్టీ ఫిరాయిస్తారని, అలాంటివారికి ఓటు వేయవద్దని అన్నారు. ‘కాంగ్రెస్‌ 50, టీడీపీకి 15, టీఆర్‌ఎస్‌ 4 ఏళ్లు పాలించాయి. ఇప్పుడు మాకు అవకాశం కల్పించాలి’అని కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. ‘తెలంగాణలో బీజేపీయే కింగ్‌ అవుతుంది, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది’పేర్కొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, రాష్ట్ర నాయకుడు వెంకట్, హెచ్‌యూజే నాయకులు నవీన్, నాగవాణి, సలీమా తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top