నిద్రపోతున్న ప్రభుత్వమిది

kishan reddy commented over kcr - Sakshi

బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని గొప్పలకు పోతున్న కేసీఆర్‌ ప్రభుత్వం దాన్ని దండుగలా మారుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. రైతులు సంతోషంగా ఉంటే సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో కేసీఆర్‌ చెప్పాలని మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. రైతులకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి ఇస్తామంటూ ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఏం చేసిందో చెప్పాలన్నారు.

రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, గడచిన నాలుగేళ్లలో డీఎస్సీ ద్వారా ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకలు, జిల్లా కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసిందని, నిధులు విడుదల కాక ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది నిద్రపోతున్న ప్రభుత్వమన్న అనుమానం కలుగుతోందన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పొద్దున అపాయింట్‌మెంట్‌ అడిగితే సాయంత్రానికి ఇచ్చేవారని, ఇప్పుడు కేసీఆర్‌ అసలు అపాయింట్‌మెంట్లే ఇవ్వటం లేదన్నారు.

ఎన్నికలు జరిగితే హంగ్‌ తథ్యం
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇకపై తరచూ తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు నటనకూడా సరిగా రాదని, ఆయన హావభావాలు చూస్తే నవ్వొస్తుందని విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తే బాగుండేదా అన్న ప్రశ్నకు, బీజేపీ క్రమశిక్షణతో ఉండే పార్టీ అని, ఆయనకు బీజేపీలో మనగలిగే మనస్తత్వం లేదని తేల్చిచెప్పారు. నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీ ఎంతో ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఏపీలో బీజేపీతో తెంచుకుంటే నష్టపోయేది చంద్రబాబే అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top