పేదరికాన్ని తరిమి కొడదాం

KCR Speech in Wide constituency activists meeting At Gajwel - Sakshi

ప్రతి ఇంటికీ తాగునీరు.. ప్రతి గుంటకు సాగునీరు లక్ష్యం 

డిమాండ్‌ ఉన్న పంటలు పండించుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా పంట కాలనీలు ఏర్పాటు  ఆర్థిక పరిపుష్టి కల్పించేలా ప్రణాళిక 

గజ్వేల్‌ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 

సాక్షి, సిద్దిపేట: ‘మనం వెయ్యి సంవత్సరాలు బతుక రాలేదు..బతికినన్నాళ్లు మంచిగా అందరికీ సేవ చేసేలా బతకాలి.. పదికాలాలపాటు ప్రజలు తలుచుకునేలా పనిచేయాలి. పరాయి పాలనలో రాష్ట్రం ఆదాయంలో లెక్కలు లేవు.. పత్రాలు లేవు.. అన్ని కులాలు, వర్గాల్లో పేదరికం ఉంది..దానిని రూపుమాపాలి.. ప్రతీ ఇంటిలో నాలుగు పైసలు ఉండేలా చేయాలి..అందుకు ఏ ఊరుకు ఆ ఊరు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి..ఇలా అయితే రాష్ట్రం నుండి పేదరికాన్ని తరిమి కొట్టొచ్చు’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సీఎం ఫాం హౌస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.

నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని కొంత మేర బాగుచేసుకున్నామని, ఇప్పుడు చేసింది చారాణ మందమేనని..ఇంకా బారాణ మందం అభివృద్ధి చేయాల్సి ఉందనిఅన్నారు. చేసిన పనులతో సంతృప్తి చెంది చంకలు కొట్టుకుంటే అభివృద్ధి అక్కడితోనే ఆగిపోతుందన్నారు. ప్రధానమైన కరెంట్‌ కష్టాలు తీర్చుకున్నామని.. ప్రతి ఇంటికీ తాగునీరు..ప్రతీ గుంటకు సాగునీరు అందించాలనే ఆలోచనతో చేపట్టిన పథకాలు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావొచ్చాయని, సాగునీటి ప్రాజెక్టుల పనులను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పూర్తి చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం ఉందని కేసీఆర్‌ చెప్పారు. పంటలకాలనీలు ఏర్పాటు చేసుకొని ఏ పంటలు పండిస్తే డిమాండ్‌ ఉంటుందో తెలుసుకొని ఆ పంటలు సాగుచేయాలని సూచించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ పాడిపరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. 

ప్రజల కష్టాలను చూసే సంక్షేమ పథకాల రూపకల్పన  
రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల కష్టాలు చూసి రూపొందించినవేనని తెలిపారు. ఎర్రవల్లి గ్రామంలో వైద్య పరీక్షలు చేయిస్తే చిన్న గ్రామంలోనే 227 మందికి కంటి సమస్య ఉందని తేలిందని, దీనిని చూసి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 70లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అద్దాలు అందజేశామని వివరించారు. ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల వారు అభినందించారన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఇలాగే వచ్చాయని చెప్పారు.  

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం 
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రతిపక్షాలు, పలువురు అధికారులు అసాధ్యమని చెప్పారని..వారి నోళ్లు మూయించేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశామని కేసీఆర్‌ వెల్లడించారు. రైతుబంధు, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా పథకం, మిషన్‌ భగీరథ పథకాలను గురించి ముందుగా ప్రతిపక్షాలు, కొంతమంది అధికారులు కూడా విమర్శించారని కానీ ఇప్పుడు ఆ పథకాల అమలు చూసి వారి నోళ్లు పెగలడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఇది గజ్వేల్‌ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు.  

ఉద్యమంలో చెప్పిన మాట నిజం చేశాం..  
తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, ఇక్కడి నిధులతోనే ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావచ్చని ఉద్యమంలో చెప్పిన మాటలు నిజం చేశామని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర వృద్ధిరేటు 17.17కు చేరిందన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలతోపాటు ఉన్నత కులాల్లో కూడా పేదలు ఉన్నారని, ఏ కులంలో ఉన్నా పేదలు పేదలే అని దానికి కులం లేదని చెప్పారు. ఈ పేదరికాన్ని నిర్మూలించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

నాలుగున్నరేళ్లలో 20 ఏళ్లు ముందుకెళ్లాం: హరీశ్‌రావు 
మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ..గజ్వేల్‌ ప్రాంతం నాలుగున్నరేళ్లలో 20 సంవత్సరాల ముందుకెళ్లిందన్నారు. ఇంకా బారాణ మందం అభివృద్ధి జరిగితే మరో 70 ఏళ్లు ముందుకు వెళ్లి దేశానికే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా గజ్వేల్‌ విరాజిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, వివిధ సంస్థల చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ గొర్రెలకు అర్థం కాలేదు
తెలంగాణలో గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కాంగ్రెస్‌ గొర్రెలకు అర్థం కాక విమర్శలు చేశారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కావాల్సిన మాంసం ఉత్పత్తులు ఇక్కడ నుంచి ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఇప్పటివరకూ 65లక్షల గొర్రెలను పంపిణీ చేశామని, ఏడాది కాలంలో అవి 40 లక్షల పిల్లలను పెట్టాయని, ఇప్పుడు రాష్ట్రంలో 1.05 కోట్ల గొర్రెలు అదనంగా పెరిగాయని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా పరిపుష్టిని సాధించేందుకు ఈ పథకం దోహదపడిందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top