‘మహా కూటమా.. కాలకూట విషమా’

KCR Speech In Nalgonda public Meeting - Sakshi

సాక్షి, నల్గొండ : ‘చంద్రబాబూ.. నీకు సిగ్గు ఉందా.. నాలుగేళ్లలో నరేంద్రమోదీ సంకనాకింది నువ్వా నేనా.. మోదీని అడ్డంపెట్టుకోనే కదా మా 7మండలాలను గుంజుకుంది. బీజేపీతో కలిసే కదా హైకోర్టు విభజన అడ్డుకుంది. ఏపీలో నీ పరిస్థితి సక్కగా లేదు కానీ తెలంగాణలో దుకాణం తెరవడానికి వస్తావా? తెలంగాణతో పెట్టుకోవద్దు చంద్రబాబు.. నేను మూడో కన్ను తెరిస్తే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకో’ అని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రేపటి నుంచే రైతు బంధు చెక్కులను పంపిణీ చేపడతామన్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఎన్నికల తర్వాత చీరల పంపిణీ చేపడుతామన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించింది. సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు.

చంద్రబాబు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవుతుందా?
‘తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. సిగ్గులేకుండా మళ్లీ చంద్రబాబను తీసుకొస్తరట. బూటకపు ఎన్‌కౌంటర్ల పేర్లతో తెలంగాణ బిడ్డలను చంపిన చంద్రబాబను మళ్లీ మీరు ఆమోదిస్తారా? చిల్లర రాజకీయాల కోసం మళ్లీ ఆంధ్రోళ్లకి పెత్తనం ఇవ్వాలని చూస్తున్నారు. చంద్రబాబుకు 15 సీట్లు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవుతుందా?  డిండి ప్రాజెక్టుకు అడ్డుకట్ట వేయడా? అది మహా కూటమా.. కాలకూట విషమా? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్లీ పరాయి వాళ్లకి అప్పజెప్పుదామా? కాంగ్రెసోళ్ల నిర్ణయం ఇక్కడ ఏమైనా ఉంటుందా? అంతా ఢిల్లీలోనే. కూటమి వస్తే మళ్లీ మనం అమరావతికి పోవాలా? మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని చెబుతున్నా. నల్గొండ మేధావులు ఆలోచన చేసి టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి’  అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

కాంగ్రెస్‌ తెలంగాణకు పట్టిన శని
‘1952నుంచి నేటి వరకూ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రానికి శనిలా తయారయ్యారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఈ కాంగ్రెసొల్లే. అప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణ రెడ్డి మూతి ముడుచుకుని కూర్చున్నాడు. నెహ్రుకు భయపడ్డారు. అప్పటి నుంచి నేటి వరకూ డిల్లీ నాయకులను చూస్తే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులని లాగులు తడుస్తాయి. బారెడు మూరెడు మాటలు చెప్పె జానారెడ్డి తెలంగాణకోసం పోరాటం చేస్తానన్నారు. ఆయనతో కలిసి నన్ను రమ్మన్నారు. నీలాంటి దొంగతో రానని ఆయన మొఖం ముందే చెప్పా. మంత్రి పదవి ఇస్తే ఉద్యమం ఆపేస్తావని చెప్పా. నేను చెప్పిన 21రోజులకే మంత్రి పదవి తీసుకోని వెళ్లారు. ప్రాజెక్టులు ఒక్కటి కూడా పెట్టలేదు. పెడితే ఇతర రాష్ట్రాలతో లొల్లి. తెలంగాణకు అన్యాయం జరిగితే ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా ప్రశ్నించలేదు. 2002లో చంద్రబాబు హయంలో నాగార్జున సాగర్‌ కుడికాలువ మోటర్ల బిల్లు ప్రభుత్వమే చెల్లించింది. ఎడమ కాలువ బిల్లులు రైతులకు మోపింది. ఏ నాయకుడు అడుగలేదు. మేం వెళ్లి ధర్నా చేస్తే రద్దు చేశారు. అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఉత్తమ్‌ను చూస్తే జాలేస్తుంది
ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ఏమీ తెలియదు..  పాపం ఆయన్ను చూస్తుంటే జాలేస్తోంది. బొగ్గు పెల్ల కూడా దొరకని రాయలసీమలో థర్మల్‌ పవర్ ప్లాంట్ పెడుతుంటే అప్పట్లో మన కాంగ్రెస్ నాయకులు నోరుమెదపలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాయలసీమకి నిధులు తరలిస్తే ప్రశ్నించలేదు. పైగా జాగారెడ్డి మాట్లాడుతూ అందులో తప్పులేదన్నారు. 4వేల మెగావాట్ల ఆల్ట్రామెగా పవర్ ప్లాంట్ పూర్తికాబోతోంది. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానంటే పారీపోయారు’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లలో ఎంతో చేశాం
14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించాం. నోరు కట్టుకోని పనిచేశాం. కొత్త సంసారంలో  కరెంట్‌ బాధలు, వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడ్డాం. కుల వృత్తులను ఆదుకుంటున్నాం. కరెంట్‌కు అత్యంత ప్రాదాన్యత ఇచ్చి 6నెలల్లో 24గంటల కరెంట్‌ ఇచ్చాం.  చాలా విషయాలు పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీళ్లను అందిస్తున్నాం. రుణమాఫి చేశాం. గొల్ల కుర్మలకు 65లక్షల గొర్రెలను ఇచ్చాం. జిల్లాకి అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌ తెచ్చాం. శ్రీరాం ప్రాజెక్టు ద్వారా సూర్యపేటకి నీళ్లు తెచ్చాం. రైతు బంధు ద్వారా రైతును ఆదుకుంటుంన్నాం. కళ్యాణ లక్ష్మీ ద్వారా లక్షా నూట పదహారు రూపాయలను అందిస్తున్నాం.ఇలా అన్ని వర్గాలవారిని ఆదుకుంటున్నాం.  ఫించన్లు పెంచుతాం. ఉద్యోగులకు మళ్లీ జీతాలు పెంచుతాం. మరో సారి అవకాశం ఇస్తే ఇంతకు మించి అభివృద్ది చేస్తాం’అని కేసీఆర్‌ అన్నారు.

రేపటి నుంచే రైతు బంధు
రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన నల్గొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నిందని ఆరోపించారు. చెక్కులు పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌నేత మర్రి శశిథర్‌ కోర్టుకు పోతే చెంపలు వాయించి పంపింది. రైతుల పొట్ట కొట్టొందని మొట్టిచెంపలు వేసింది’  అని కేసీఆర్‌ సభలో పేర్కొన్నారు. రేపటి నుంచే చెక్కుల పంపిణీ చేపడతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top