మానుకోట మురవాలి 

KCR focus was on strategy and campaign for Lok Sabha Election - Sakshi

మంత్రి ఎర్రబెల్లితో కేసీఆర్‌ ప్రత్యేక సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గెలుపు వ్యూహం, ప్రచార సరళిపై దృష్టి సారించారు. స్వయంగా తాను పాల్గొనే బహిరంగ సభలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ నేతల ప్రచార వ్యూహంపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం మహబూబాబాద్, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వరంగల్‌ నుంచి పిలిపించుకొని మరీ శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ముఖ్యంగా సిట్టింగ్‌ ఎంపీకి టికెట్‌ నిరాకరించిన మహబూబాబాద్‌ స్థానంలో భారీ మెజారిటీతో విజయం సాధించాలని, మానుకోటపై మళ్లీ గులాబీ జెండా మురవాలని ఆయన మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతరం పార్టీ కొంత వెనుకబడి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లి భారీ మెజారిటీ సాధించేలా ప్రచార వ్యూహం రచించాలని ఎర్రబెల్లికి కేసీఆర్‌ సూచించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్‌లో ఏప్రిల్‌ 1న భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ఆ సభకు తాను హాజరవుతానని వెల్లడించారు.

మరో ఇద్దరు మంత్రులు, కేటీఆర్‌ కూడా
ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సమీక్షకు ఎర్రబెల్లితోపాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌ శివార్లలోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహిం చాల్సిన ప్రచార శైలి, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కేటీఆర్‌కు సూచించారు.

కేసీఆర్‌ ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌ సభల్లో ఈ నెల 17, 19 తేదీల్లో పాల్గొనగా ఏప్రిల్‌ 1న మహబూబాబాద్‌ సభ జరగనుంది. ఆ తర్వాత ప్రచారానికి మరో ఎనిమిది రోజులు గడువు ఉండటంతో వరుసగా పార్లమెంటు స్థానాలవారీగా సభలు నిర్వహించాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. వ్యూహం మారితే మాత్రం సోమవారం నుంచి రెండు రోజులకో లోక్‌సభ స్థానంలో సీఎం సభలుంటాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top