ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం

Kadapa DIG Order For Surrender WIth Weapons - Sakshi

స్వచ్ఛందంగా ఆయుధాలను అప్పగిస్తే చర్యలుండవు

లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ కూడా సరెండర్‌ చేయండి

డీఐజీ నాగేంద్రకుమార్‌ వెల్లడి

మీడియాతో మాట్లాడుతున్న డీఐజీ నాగేంద్ర కుమార్‌

కడప అర్బన్‌: జిల్లాలో 1987 నుంచి 2009 వరకు వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న 1219 పాత ఆయుధాలను కడపలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ ఎదురుగా ఉన్న రోడ్డు మార్గంలో శుక్రవారం డీఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మల పర్యవేక్షణలో తమ సిబ్బందితో కలిసి నిర్వీర్యం చేశారు. మొదట కర్నూలు–కడప రేంజ్‌ డీఐజీ డి. నాగేంద్రకుమార్‌ కడప నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పాత ఆయుధాలను రోడ్డుపై ప్రదర్శింపచేశారు. వాటిలో ప్రతి ఆయుధానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రోడ్డు రోలర్‌తో వాటిని తొక్కించి నిర్వీర్యం చేశారు.

ఈ సందర్భంగా డీఐజీ నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 1987 నుంచి 1994 వరకు 706 పాత ఆయుధాలను, 1994 నుంచి 1997 వరకు 180 ఆయుధాలను, 2002 నుంచి 2009 వరకు 333 మొత్తం 1219 పాత ఆయుధాలను వివిధ కేసుల్లో  స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆయా కేసులకు సంబంధించిన విచారణ పూర్తి కాబడిందన్నారు. వాటిని మాత్రమే రోడ్డు రోలర్‌తో 2–3 సార్లు తొక్కించి నిర్వీర్యం చేశామన్నారు. వీటిని మరలా ఎవరికి అందుబాటులోకి రాకుండా పోలీసు ఏఆర్‌ క్వార్టర్స్‌ సమీపంలో పకడ్బందీగా లోతైన గుంత తీసి వాటిని పాతి పెట్టిస్తామన్నారు. మరళా ఎవరికీ ఉపయోగపడకుండా చేస్తామన్నారు. కాగా సీజ్‌ చేసిన పాత ఆయుధాల్లో ఎస్‌బిబిఎల్‌ గన్స్‌–198, ఎస్‌ఎంఎల్‌ గన్స్‌– 606, షార్ట్‌ గన్స్‌–252, రివాల్వర్స్‌–106, రైఫిల్స్‌–17, డిబిబిఎల్‌ గన్స్‌– 27 ఉన్నాయన్నారు.

ఎన్నికల్లో పూర్వపు పరిస్థితి జిల్లాలో లేదన్నారు. అయినప్పటికీ ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రా మాల్లో నిఘాను ఏర్పా టు చేస్తామన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.  ఎప్పటికపుడు గ్రామాల్లో ఆయా పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కళాజాగృతి బృందం ఆధ్వర్యంలో పర్యటిస్తారన్నారు.  ఎవరి వద్దనైనా అక్రమంగా ఆయుధాలు వుంటే వాటిని వెంటనే ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు తీసుకుని వచ్చి స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. అలాంటి వారిపై ఎలాంటి కేసులను నమోదు చేయడంగానీ, చర్యలు గానీ ఉండవన్నారు.  అలా కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరి వద్దనైనా అక్రమంగా ఆయుధాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నాకాబందీలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించినపుడు పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్‌డ్‌ ఆయుధాలను కూడా వెంటనే ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిల్లో డిపాజిట్‌ చేయాలన్నారు. ఎవరికైనా సమస్య వుంటే తమ దృష్టికి తీసుకుని వస్తే  పోలీసులే రక్షణ కల్పిస్తారన్నారు.
భద్రత అవసరమైన బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రధానమైన ప్రాంతాల్లో తప్ప ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నున్న లైసెన్స్‌ ఆయుధాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామన్నారు.

ప్రతి రౌడీషీటర్‌ను బైండోవర్‌ చేస్తామనీ, వారి వద్ద నుంచి రూ. లక్ష మేరకు బాండ్‌ను తమ పరిధిలో ఉంచుకుంటామన్నారు.  నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల విషయంలో 200 పెండింగ్‌లో ఉన్నాయనీ, ఎర్రచందనం కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు దాదాపు 500 ఉన్నాయనీ, వాటన్నింటినీ సున్నాకు తీసుకురావాలనీ ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఆదేశాలను జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఏ. శ్రీనివాసరెడ్డి, కడప డిఎస్పీ షేక్‌ మాసుంబాష పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top