మన సైనికులను అవమానించడమే 

JP Nadda Criticizes Telangana Government Over Covid 19 Tests - Sakshi

‘గల్వాన్‌ ’అంశంలో కాంగ్రెస్‌ అనుమానాలపై బీజేపీ ధ్వజం

కరోనా సహా ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్‌ది ఇదే తీరు

రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, అసమర్థ పాలన

హిమాచల్‌ప్రదేశ్‌ కంటే తక్కువగా ఇక్కడ కరోనా టెస్టులు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా విమర్శ

ఎంఐఎం ఒత్తిడితోనే ఇక్కడ కరోనా పరీక్షల్లేవు: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందని, గల్వాన్‌పై ఆ పార్టీ అనుమానాలు లేవనెత్తడం మన సైనికులను తీవ్రంగా అవమానించడమేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా స్పష్టం చేశారు. గల్వాన్‌ అంశంలో కాంగ్రెస్‌ తీరును బీజేపీ తీవ్రంగా ఖండించారు. ఓవైపు ప్రపంచమంతా ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతుంటే కాంగ్రెస్‌ మాత్రం రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆన్‌లైన్‌ ద్వారా శనివారం నిర్వహించిన జన్‌సంవాద్‌ సభలో (వర్చువల్‌ ర్యాలీ) జేపీ నడ్డా ప్రసంగించారు. దేశంలో 60 ఏళ్ల పాలన ఒక ఎత్తు అయితే ఆరేళ్ల మోదీ పాలన మరొక ఎత్తన్నారు.

ఆర్టికల్‌ 370ని ఎత్తివేశారని, సీఏఏ తీసుకొచ్చారని, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశారని, అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం బీజేపీ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు. లాక్‌డౌన్‌తో కరోనాను ఎదుర్కొనేందుకు దేశం యావత్తును సిద్ధం చేస్తే..లాక్‌డౌన్‌ ఎందుకు పెట్టారని, ఎందుకు పొడిగించారని, ఎందుకు ఎత్తేశారని కాంగ్రెస్‌ మాట్లాడుతూ వచ్చిందన్నారు. రాజస్తాన్, పంజాబ్‌ సీఎంలు లాక్‌డౌన్‌ ముందే పెట్టారన్నారు. 2014 నాటికి దేశవ్యాప్తంగా అవినీతి పెరిగిపోయి ప్రపంచంలో అప్రతిష్టపాలు అయ్యామని, అలాంటి సమయంలో మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఆరేళ్లలో పరిస్థితిని ఎలా మార్పు చేశారో చూడాలన్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో కరోనాను ఎదుర్కొనేలా వైద్య సేవలు మెరుగుపర్చుకోగలిగామన్నారు.

దేశమంతా ప్రధాని వెంటే..  
దేశమంతా ప్రధాని వెంట నడిచిందని, పీఎం రాష్ట్రాల సీఎంలతో ఆరుసార్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారని జేపీ నడ్డా గుర్తు చేశారు. కరోనాకి వ్యతిరేకంగా మోదీ జీ20 దేశాల సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచ సంస్థలు మోదీ కార్యక్రమాల్ని పొగుడుతుంటే కాంగ్రెస్‌ మాత్రం విమర్శలు చేస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో ‘ఫీడ్‌ ద నీడీ’ కార్యక్రమం ద్వారా 8 లక్షల కార్యకర్తలు 19 కోట్ల మందికి భోజనం అందించారన్నారు. 5 కోట్ల మందికి మోదీ కిట్‌ పేరుతో రేషన్, 5 కోట్ల మందికి ఫేస్‌ మాస్క్‌లు అందించామన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా మన నేతలు కార్యకర్తలతో మాట్లాడే అవకాశం లభించిందన్నారు.

తెలంగాణలోనూ ఉజ్వల, జన్‌ధన్, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల వల్ల లక్షల మంది లాభం పొందారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరకపోవడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. చిన్న రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌ కన్నా తక్కువ టెస్ట్‌లు తెలంగాణలో చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కరోనా విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఒక జర్నలిస్ట్‌ మృతి తెలుపుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో తప్ప దేనిలోనూ ముందు లేదన్నారు. ఒకవైపు అవినీతి మరోవైపు అసమర్థత రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రాజెక్టులు ప్రజల కోసం కాకుండా ఎందులో ఎక్కువ అవినీతి చేయొచ్చు అనే దానిపైనే దృష్టిపెట్టి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మోదీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.

హైదరాబాద్‌ ప్రమాదకరంగా మారింది
కరోనా కట్టడికి సంబంధించి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌ ప్రమాదకరంగా మారిందని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మజ్లిస్‌ వద్దన్నందునే తెలంగాణలో కరోనా టెస్ట్‌లు చేయలేదన్నారు. ఢిల్లీలో కేంద్రం జోక్యం చేసుకుని 6 లక్షల పరీక్షలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. తెలంగాణలోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని, అందుకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. బీజేపీ తెలంగాణలో బలపడాల్సి ఉందని, రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ..కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేదా ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చాలన్నారు. ఎంఐఎం కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లిని తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణ తల్లిని కేసీఆర్‌ కబంధ హస్తాల నుండి విముక్తి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ, ఎన్‌.రామచంద్రరావు, ఎంపీ అరవింద్‌; మాజీ మంత్రులు డీకే అరుణ,మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top