టీడీపీ నేతలు బరితెగించారు

Janasana Party chief Pawan Kalyan fires on CM Chandrababu Govt - Sakshi

     జనసేన అవిర్భావ మహాసభలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం 

     చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది 

సాక్షి, అమరావతి: ‘మీరు చేస్తున్న దోపిడీని చూస్తూ ఉండటానికా మేం 2014లో మీకు మద్దతిచ్చింది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. జనసేన పార్టీ ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా కాజా వద్ద ఆవిర్భావ మహాసభ నిర్వహించారు. సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ చేస్తున్న అవినీతి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే పనులకు ఎన్టీఆర్‌ ఆత్మ పడే క్షోభ అంతా ఇంతా కాదని అన్నారు. ‘‘2019 ఎన్నికల్లో పవన్‌ మాతో కలిసి ఉంటారో లేదో తెలియదు, జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవాలి. అందుకు బాగా సంపాదించాలి అని మాట్లాడుతున్నారంటే అంతకుమించిన బరితెగింపు ఇంకేం ఉంటుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...

‘‘చంద్రబాబుపై ఎన్నో అభియోగాలు వచ్చాయి. పుండు మీద కారం చల్లడం ఎందుకని మౌనంగా ఉన్నా. కానీ, ఇప్పటికీ మీ బుద్ధి మారలేదు. టీడీపీ నేతలు 2019 ఎన్నికలకు ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు ఇప్పటికే పెట్టాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాం అని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానుభావుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఇన్ని తప్పులుంటే 29 సార్లు ఢిల్లీ వెళ్లాం, అక్కడ ప్రధానమంత్రి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రధాని ఎందుకు పట్టించుకుంటారు? మన బంగారం మంచిదై ఉండాలి కదా! శేఖర్‌రెడ్డి కేసులో నారా లోకేశ్‌ పేరు ఉందని, అందుకే చంద్రబాబును ప్రధానమంత్రి బెదిరిస్తున్నారన్న వాదన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఒక సంస్థ వెల్లడించింది. ఇదా టీడీపీ సాధించింది? ప్రస్తుత పాలన సరిగ్గా లేకపోతే ప్రజలకు సరికొత్త పార్టీని, సరికొత్త నాయకుడిని 2019లో కచ్చితంగా ఎన్నుకుంటారు. చంద్రబాబుకు 2019 ఎన్నికలు 2014 ఎన్నికలంత సుఖంగా ఉండవు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 

మూడు మాటలు.. ఆరు అబద్ధాలు
‘‘రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తోంటే.. కంచే చేను మేస్తుంటే కాపు ఏమి చేయగలడన్న సామెత గుర్తుకొస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు రాజు నీతి తప్పితే నేల సారం తప్పిందన్న సామెతలా ఉన్నాయి. మూడు మాటలు, ఆరు అబద్ధాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తయారైంది. నేను టీడీపీకి అండగా నిలిచించి ఏపీ పునర్నిర్మాణానికే తప్ప ఆ పార్టీ పునర్నిర్మాణానికి కాదు. టీడీపీ చెబుతున్న అభివృద్ధి కొందరికే పరిమితమా? అందరికీ కాదా? అభివృద్ధి మొత్తం రాజధాని చుట్టే కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు ఏమైపోవాలి? 2016లో రకరకాల చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఈ రోజు మళ్లీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు. ఈమాత్రం దానికి 2016లోనే చెప్పి ఉండవచ్చు కదా? ఎందుకు మోసం చేశారు? ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడారు. మా గుండెలకు బలమైన గాయాలు చేశారు’’ అని పవన్‌ ధ్వజమెత్తారు.
 

కులాల మధ్య గొడవలు పెట్టారు 
‘‘రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి ద్రోహం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయలేదు. కాలుష్యం గురించి ఒక మహిళ ప్రశ్నిస్తే ఆమెను జైలులో పెడతారా? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేను ఏమీ చేయరా? ఒక మహిళా అధికారిపై దాడి జరిగితే టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తారా? దీంతో మిగతా అధికారులు కూడా ఎందుకు దాడి చేయించుకోవడం సర్దుకుపోదాంలే అని మాట్లాడుతున్నారు. సింగపూర్‌ తరహా రాజధాని చేస్తామంటే కుదరదు సింగపూర్‌ తరహా పాలన చేయాలి. సింగపూర్‌లో ఒక మహిళా అధికారిపై దాడి జరిగి ఉంటే ఆ దాడి చేసిన వ్యక్తిని తోలు ఊడిపోయేలా కొట్టేవారు. కాపుల రిజర్వేషన్ల వ్యవహారం ప్రెసిడెంట్‌ ఆఫీసులో కోల్డ్‌స్టోరేజీలో ఉంది. అది బయటకు రాదు. దాని వల్ల కాపులు, బీసీలకు మధ్య గొడవలు పెట్టారు. ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు. అన్నీ తెలిసే చేశారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నేను చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నానని విమర్శిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నానా? విజయసాయిరెడ్డికి ప్రధానమంత్రి మోదీ ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారో? దాని వెనుక మర్మమేమిటి? మతలబు ఏంటి? ప్రజలకు తెలియాలి. విధివిధానాలతో ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టోను విడుదల చేస్తాం’’ అని పవన్‌ వెల్లడించారు. 

హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష 
‘‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. కేంద్రం నాపై సీబీఐ కేసులు, అవినీతి కేసులు పెడుతుందనే భయం లేదు. ప్రజల సెంటిమెంట్‌ ఆధారంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ అన్నారు. అలాగైతే ఏ సెంటిమెంట్‌ ఆధారంగా తెలంగాణ ఇచ్చారు? కేంద్రం చేసే చట్టాలు మాకేనా.. మీకు వర్తించవా? పొట్టి శ్రీరాములు అందించిన స్ఫూర్తి ఈ గడ్డపై ఇంకా ఉంది. హోదా ఉద్యమంపై సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరుపుతా ’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top