ఎస్సీలంటే చంద్రబాబుకు చులకన : జగన్‌

Jagan slams Chandrababu at Pallamala SC Athmiya Sammelanam - Sakshi

సాక్షి, చిత్తూరు :  ఎస్సీలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా చులకన అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పాలనలో ఎస్సీల అభివృద్ధి గురించి పట్టించుకోకపోగా.. నేతలు, అధికారులు దాడులకు తెగబడుతున్నారన‍్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీల బాగోగులను ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగిస్తూ వస్తున్నాడని జగన్‌ అన్నారు. ప్రతీకులాన్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని... సీఎం పదవి కోసం ఏ ఒక్క వర్గానికి కూడా ఆయన వదిలిపెట్టలేదని చెప్పారు. హామీలతో పెద్ద కొడుకునంటడు డొలుకొట్టే చంద్రబాబు... ఎన్నికలయ్యాక మాత్రం అత్తగారి సొత్తులా  రైతుల భూములను లాగేసుకుంటాడన్నారన్నారు. ఐదు కోట్ల వరకు ఎస్సీలకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పి.. ఆ హామీని కూడా నెరవేర్చలేదని జగన్‌ చెప్పారు.   

ఇది దుర్మార్గమైన పాలన... ‘పేద ప్రజలు నిన్నటి కంటే నేడు సంతోషంగా ఉంటేనే అది అభివృద్ధి’.. కానీ, చంద్రబాబు పాలనలో అది మచ్చుకైనా కనిపించటం లేదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దళితులు స్నానం చెయ్యరని.. చదివించినా చదువుకోరని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చెయ్యటం సిగ్గుచేటు. మరో మంత్రి ఎస్సీ మహిళా అధికారిణిని కాలితో తన్నాడు. ఇక ఎస్సీగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని స్వయంగా చంద్రబాబే మాట్లాడం దారుణం. ఇలాంటి పాలనలో దళితులకు మంచి రోజులు ఎక్కడుంటాయి?. పేద వాడి నుంచి భూములు తీసుకోవాల్సి వస్తే.. నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చి అయినా తీసుకోవాలనుకుంటారు. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం అక్రమంగా లాక్కుంటుంది. ఉపాధి హమీ నిధులను కూడా సక్రమంగా వినియోగించే ఆలోచన చంద్రబాబుకు లేనట్లుంది’’ అని జగన్‌ చెప్పారు. 

పెందుర్తి ఘటనలో దళిత మహిళపై జరిగిన దాష్టీకంపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని జగన్‌ ఆక్షేపించారు. దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి పాలనని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే... ఈ తెలుగుదేశ ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చాన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలంతా ఆలోచన చేయాలని వైఎస్‌ జగన్‌ కోరారు. 

ప్రజల అభివృద్ధి కోసమే నవరత్నాలు ప్రవేశపెట్టినట్లు చెప్పిన వైఎస్‌ జగన్‌ వాటి గురించి వివరించారు. పేద పిల్లల చదవుల కోసం ఏటా 20 వేల రూపాయలు కేటాయిస్తామని... వారి కోసం ఏ తల్లిదండ్రులు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి తీసుకురాబోనని హామీ ఇచ్చారు. చిన్నారులను బడులకు పంపే తల్లులకు ఏటా 15 వేల రూ. ఇస్తానని చెప్పారు. ఇక వృద్ధాప్య పింఛన్‌ కోసం ఆలోచన చెయ్యలేని చంద్రబాబు.. కాంట్రాక్టలకు మాత్రం కమీషన్లను అడ్డగోలుగా పెంచుతాడని జగన్‌ అన్నారు. అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు పింఛ‌న్ వ‌య‌స్సు 45 ఏళ్ల‌కే త‌గ్గిస్తామన్నారు.

ఎస్సీలకు వైఎస్‌ జగన్‌ భరోసా...  ప్రియతమ నేత వైఎస్సార్‌ స్ఫూర్తితో పేదలకు ఇళ్లను కట్టిస్తామన‍్న జగన్‌.. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. పేదలకు భూపంపిణీ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ ప్రజల నుంచే ప్రారంభిస్తానన్న ఆయన.. ఉచితంగా బోర్లు కూడా వేయిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ హయాంలో పంచిన భూముల కంటే(12లక్షల ఎకరాలు) లక్ష ఎకరాలు ఎక్కువగా పంచేందుకే ప్రయత్నిస్తానని చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు లోక‌ల్ వాళ్ల‌కే ఇవ్వాల‌ని చ‌ట్టం చేస్తామని.. పేద ఎస్సీలు అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top