రసవత్తర పోరు.. రెడ్డీల ఢీ!

Interesting Poll Battle in Vikarabad District - Sakshi

పరిగిలో రామ్మోహన్‌రెడ్డి వర్సెస్‌ మహేశ్‌రెడ్డి

కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ప్రత్యర్థిగా నరేందర్‌రెడ్డి

తాండూరులో మహేందర్‌రెడ్డిపై పోటీకి సై అంటున్న రోహిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి  

బషీరాబాద్‌(తాండూరు) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు.. తమ అభ్యర్థులుగా బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని రంగంలోకి దించుతున్నాయి. జిల్లాలోని మూడు జనరల్‌ స్థానాల్లో.. అధికార పార్టీ టికెట్లను రెడ్డీలకే ఖరారు చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో ఒక్కటైన విపక్షాల మహాకూటమి తరఫున కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దించబోతున్నారు. ఇందులో పరిగి నుంచి టి.రామ్మోహన్‌రెడ్డి, కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. తాండూరు అభ్యర్థి విçషయంలో కొంత ఉత్కంఠ సాగుతున్నప్పటికీ ఈ స్థానాన్ని కూడా రెడ్డి వర్గానికే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పైలెట్‌ రోహిత్‌రెడ్డికి అవకాశం దక్కుతుందని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థులందరూ ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న బీసీలను మచ్చికచేసుకునే పనిలో పడ్డారు.

నువ్వా.. నేనా..
జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష మహాకూటమి తరఫున రెడ్డీ సామాజిక వర్గం నేతలు తలపడనున్నారు. గెలుపే ఎజెండాగా పార్టీలన్నీ అగ్రవర్ణాలకే పెద్ద పీట వేశాయి. దీంతో రాబోయే ముందస్తు పోరు నువ్వా నేనా అనే రీతిలో రసవత్తరంగా సాగనుంది. జిల్లాలో జరిగే ఎన్నికలను ‘పట్నం’ సోదరులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఎలాగైన ఓడించి కొడంగల్‌లో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీసీలను చేరదీసే పనిలో పడింది. ఇప్పటికే ఆ వర్గం నాయకులకు గులాబీ కండువాలు కప్పుతోంది.

అయితే రేవంత్‌రెడ్డి కూడా అదేస్థాయిలో అధికార పార్టీ నేతలపై మాటల దాడి చేస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. తనను ఓడించేందుకే కేసీఆర్‌ పాతకేసులు తోడుతూ, ఐటీ దాడుల పేరుతో కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పరిగిలోనూ రెడ్డీల మధ్యే ప్రధాన పోటీ జరగబోతోంది. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తన రాజకీయ వారసుడిగా మహేశ్‌రెడ్డిని బరిలోకి దింపారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టి.రామ్మోహన్‌రెడ్డితో తలపడనున్నారు. వీరుద్దరూ కూడా తమదైన శైలిలో బీసీ ఓటు బ్యాంకుపై కన్నేశారు. బీసీలను తమవైపు తిప్పుకునే వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇక జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తాండూరులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని సామాజిక వర్గాల సంఘాలతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన మహేందర్‌రెడ్డి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు, కుమ్ములాటలే తమకు కలిసి వచ్చే అంశమని టీఆర్‌ఎస్‌ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మంత్రిని ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గం నుంచి బలమైన నాయకున్ని బరిలోకి దించాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్న వారిలో రోహిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి మధ్య టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో రోహిత్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  

బీజేపీలో బీసీలకు పెద్దపీట...
ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ జిల్లాలోని రెండు స్థానాల్లో బీసీలను బరిలో దించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిగి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు (ఓసీ) ఒక్కరే పోటీలో ముందున్నారు. తాండూరు నుంచి ఇద్దరు బీసీ నాయకులు టిక్కెట్‌ రేసులో ఉన్నారు. విద్యార్థి దశనుంచి ఏబీవీపీలో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉప్పరి రమేష్‌కుమార్‌తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పటేల్‌ రవిశంకర్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరికి టిక్కెట్‌ వచ్చినా బీసీ సామాజిక ఓట్ల ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కొడంగల్‌లోనూ బీసీ సామాజిక వర్గం నుంచి నాగురావు నామోజీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు బీసీలకు అన్నీ పార్టీలు పెద్దపీట వేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య గురువారం తాండూరులో జరిగిన బీసీల యువగర్జనలో డిమాండ్‌ చేశారు. నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సూచించారు. మొత్తానికి జిల్లాలోని మూడు జనరల్‌ చోట్లా ప్రధాన అభ్యర్థులుగా రెడ్డీలు ఢీకొనబోతున్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top