నన్ను టచ్‌ చేస్తే భస్మమే : కేసీఆర్‌

I Will Serve For Country : KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీని తాను ఏమీ అనలేదని, మోదీ గారికి అనే అన్నానే తప్ప గాడు అనలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒక వేళ తాను అలా అన్నాననుకొని బీజేపీ వాళ్లు అలా ఊహించుకుంటే వాళ్ల ఖర్మ అని కేసీఆర్‌ చెప్పారు. ప్రధానిని విమర్శించొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

'రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరాం. కేంద్రం తన పెత్తానాన్ని వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. పారిశ్రామిక రాయితీలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. కేంద్రం కంటితుడుపు చర్యలే చేసింది. చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలు కాలేదు. ప్రధానిని తూలనాడానని అనడం శుద్ధ తప్పు. లేనిపోనివి చేసి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి' అని కేసీఆర్‌ అన్నారు.

జైలుకు పంపిస్తామని కొందరు వెర్రి కూతలు కూస్తున్నారని, ఒకసారి తనను టచ్‌ చేసి చూస్తే భస్మం అయిపోతారని హెచ్చరించారు. విభజన చట్టంలోని హామీలు అమలుకాలేదని, ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని తమ ఎంపీలను కోరినట్లు కేసీఆర్‌ చెప్పారు. గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై కూడా కేంద్రం స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌, ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు పలు విభజన హామీలపై ఎంపీలు నిలదీస్తారని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తాను అందరితో పారదర్శకంగా వ్యవహరిస్తానని, తమ ఆస్తులు ఏమిటో ఐటీ రిటర్న్స్‌లో చూసుకోవచ్చని అన్నారు. జేబులో ఉన్న పెన్నుతో సహా తన దగ్గర లెక్కలున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర అంటూ చేపడితే పదివేలకు మించి జనాలు వస్తలేదని, గడ్డాలు పెంచుకుని సన్యాసం తీసుకుంటే ఓట్లు పడతాయా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానని, కొత్తగా ఏమీ మాట్లాడటం లేదని జోకులు కాకపోతే తెలంగాణలో అసలు బీజేపీ ఉందా అని ప్రశ్నించారు.

పథకాలు మార్చడం తప్పా ఏమన్నా చేశారా?
దేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని కేసీఆర్‌ అన్నారు. రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు అవసరం అని చెప్పారు. ఎవరి పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో పథకాల పేర్లు మార్చడం తప్ప ఏమీ చేయడం లేదని అన్నారు. అందుకే ప్రజలు మార్పును కోరుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు. కచ్చితంగా దేశంలో పెద్ద మార్పు వస్తుందని, ప్రజలు కీలక మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకు తన వంతు సేవలు అందిస్తానని అన్నారు. కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని, అందుకోసం అవసరమైన పార్టీలతో తాను చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై తేల్చాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రత్యేక హోదా హామీ ఇస్తే అది కచ్చితంగా ఇవ్వాలని, ఒక వేళ ఆ రోజు హామీ ఇవ్వకుంటే మాత్రం ఇవ్వం అని చెప్పాలన్నారు. ఏదీ చెప్పినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాలని, ప్రజలను, నాయకులను కేంద్రం ఆగం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఏ దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండదని, అందుకే ప్రస్తుత వ్యవస్థ మారాలని తాను డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top