ఊపిరున్నంత వరకూ పోరాడుతా.. 

i am the fight for special status in my last breath - ys jagan - Sakshi

ప్రత్యేక హోదాపై బోడగుడిపాడు సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటే టీడీపీ అడ్డుకుందని ధ్వజం

కేంద్రం గొప్పగా చేసింది.. రాష్ట్రానికి అన్నీ వచ్చేశాయన్నారు..

బాబు మోసాన్ని ప్రజలు గమనించారని ఇప్పుడు డ్రామా లేస్తున్నారు..

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం తాను ఊపిరున్నంత వరకూ పోరాడుతానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ అయిన హోదా కోసం నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటే అడుగడుగునా అడ్డుతగిలిన చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసే ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 83వ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోడగుడిపాడు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో గొప్పగా చేసిందని, రాష్ట్రానికి రావాల్సిన వన్నీ వచ్చేశాయని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేసిందని పలు సందర్భాల్లో చంద్రబాబు చేసిన ప్రకటనలను ఉదహరిస్తూ తూర్పారబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఏం సాధించావయ్యా బాబూ.. 
‘‘కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఐదారు రోజులుగా చంద్రబాబు కార్చిన మొసలి కన్నీరు మీ అందరికీ కనిపించే ఉంటుంది. టీడీపీ మంత్రులు భాగస్వాములుగా ఉన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెడతారు. వాళ్ల మంత్రులే ఆమోదించిన బడ్జెట్‌ గురించి చంద్రబాబుకు నిజంగా తెలియదా? అన్నీ తెలిసి ఇవాళ అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తారా? ఇదేమీ తొలి బడ్జెట్‌ కాదు.. ఎన్డీయే పాలనలో ఇది ఆఖరు బడ్జెట్‌. ఇప్పటికి ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత నాలుగేళ్ల బడ్జెట్‌లలో ఏమీ సాధించలేకపోగా.. ఆయన చేసిన మోసాలు, అన్యాయాల గురించి రాష్ట్ర ప్రజలందరూ తిడుతున్నారన్న సంగతి తెలుసుకుని ఆ నెపాన్ని ఇపుడు కేంద్రంపై ¯ðనెట్టేస్తున్నారు. కొంత కాలం క్రితం చంద్రబాబు.. కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని చెప్పిన పత్రికా ప్రకటనలను మీ దృష్టికి తెస్తున్నా. ఆయనకు అనుకూలమైన ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలనే ఇక్కడ చూపిస్తాను. (పత్రిక చూపుతూ) గత ఏడాది జనవరి 26 నాటి పత్రికలో.. ‘మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా?’అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో గొప్పగా చేసిందని ఇందులో చెప్పారు. పైగా ‘ఆధారాలుంటే రండి, చెప్పండి’అంటూ ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్‌ అని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రావాల్సినవన్నీ వచ్చేశాయని గత ఏడాది బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ముందు చంద్రబాబు ఈ విధంగా చెప్పారు. సాక్షిలో వచ్చిన వార్తలను నేను చూపించడం లేదు. ఇవన్నీ కూడా వారి అనుకూల పత్రికల్లో వచ్చినవే చూపుతున్నాను. ‘ప్రత్యేక హోదా అంటున్నారు.. అదనంగా వచ్చేది ఏంటో.. ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలేంటో..’అని చంద్రబాబు మనల్నే అప్పట్లో ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవని లాంటిది కనుక, పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు తెస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబే చెప్పారు కదా! పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలంటేనే మూడేళ్లు పడుతుందని కూడా ఆయనే చెప్పారు. హోదాయే సంజీవని అన్న పెద్దమనిషి ప్యాకేజీ కన్నా హోదా వల్ల సాధించేదేమిటి.. అని ప్రశ్నిస్తారా? గత ఏడాది జూన్‌ 6 ఈ మాటలు అన్నారు. ‘హోదా తెస్తామన్న వాళ్లే చెప్పాలి.. ప్యాకేజీకన్నా హోదా వల్ల జరిగే మేలేమిటో’అని కూడా చంద్రబాబు అన్నారు. పైగా ‘దేశంలోకల్లా నేనే సీనియర్‌’అని కూడా ఆరోజున చెప్పుకున్నారు.  

ఎన్నికలు వస్తున్నాయని ప్లేటు ఫిరాయింపు 
‘ప్రత్యేక హోదా వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ’(ఈనాడు) అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి 2016 సెప్టెంబర్‌ 12న ప్రకటన చేశారు. ‘మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ అవినీతిని కేంద్రం ప్రశ్నించకుండా ఉండటం కోసం, మీపై దర్యాప్తులు జరక్కుండా తప్పించుకునేందుకు కేంద్రం ముందు సాగిలపడిపోయి ఇలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ధర్మమేనా?’అని మేము చంద్రబాబును నిలదీసినపుడు ‘మూర్ఖంగా వెళితే నష్టపోతాం..’అని 2016 సెప్టెంబర్‌ 11న ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఉద్యోగాలు రాని పిల్లలకు అన్యాయం చేస్తున్నావు కదయ్యా? వారెక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోరాడాల్సిన వ్యక్తివి నువ్వే కదయ్యా? పోరాడవయ్యా..’అని ప్రశ్నిస్తూ.. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులకు బుద్ధి రావాలని చెప్పి మేం బంద్‌లు, ధర్నాలు, యువభేరి కార్యక్రమాలు చేస్తూ ఉంటే.. ‘దెబ్బలు తగిలిన చోట కారం చల్లుతారా! రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే మీరు బంద్‌కు పిలుపు నిస్తారా?’అని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి ఏ మేలూ జరక్కపోయినా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను అమ్మేయడం, అమ్మేసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఏదీ ఇవ్వక పోయినా కూడా.. ప్యాకేజీ ఏదో వచ్చిందన్నట్లుగా భ్రమలు (కలర్‌ ఇచ్చారు) కల్పించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిందేమిటంటే రానిది చూపించడం, ప్రత్యేక హోదాను అమ్మేయడం మాత్రమే.

ఇపుడు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయనేటప్పటికి ప్లేటు మారుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఎందుకింత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని నాకనిపిస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కన్నా ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి పోయి ఆనందంగా కూర్చోవడం మంచిది కాదా? చంద్రబాబు నోరు తెరిస్తే చాలు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? (లేరు.. లేరు.. అంటూ జనం చేతులూపారు) మన రాష్ట్రంలో పిల్లలకు కాస్తో, కూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది ప్రత్యేక హోదా వల్లనే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఆదాయపు పన్ను, జీఎస్టీ కట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఈ రాయితీలు ఉంటాయో అపుడే పారిశ్రామికవేత్తలు వచ్చి ఫ్యాక్టరీలు, హోటళ్లు, ఆసుపత్రులు కడతారు. అప్పుడే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలకు అమ్మేసి రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం, అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాను మేం ఎప్పటికీ వదలం.. ఊపిరున్నంత వరకూ పోరాడుతూనే ఉంటాం. ఇవాళ కాక పోయినా రేపైనా దానిని సాధిస్తాం. తెలంగాణ కోసం ఎన్ని ఏళ్లు పోరాడారో మీ అందరికీ తెలుసు. మనకు సంజీవని అయిన హోదా కోసం పోరు కొనసాగిస్తాం’’అని వైఎస్‌ జగన్‌ అన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top