హైదరాబాద్‌ అందరిదీ

Hyderabad is a Mini Bharat Says KTR - Sakshi

     ఇదో మినీ భారత్‌: మంత్రి కేటీఆర్‌ 

     టీఆర్‌ఎస్‌లో చేరిన గుజరాతీలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మినీభారత్‌ అని, ఇది అందరిదని, ఇక్కడ అన్నివర్గాల ప్రజలు ప్రశాంతంగా నివసిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో పలువురు గుజరాత్‌ సమాజ్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సెలవు దినమైన ఆదివారం పూట ఇంతమంది గుజరాతీయులు తెలంగాణ భవన్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే గుజరాతీయు లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఏపీలో తెలంగాణ వస్తే.. ఏదో జరుగుతుందని పలురకాలుగా దుష్ప్రచారాలు చేశారని, స్థానికేతరులను తరిమేస్తారని బెదిరించారని గుర్తుచేశారు. అలాంటిది హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఏనాడూ విఘాతం కలగలేదన్నారు. నాలుగేళ్లలో హైదరాబాద్‌లో నాలుగు నిమిషాలు కూడా కర్ఫ్యూ విధించకపోవడమే మా పరిపాలనకు నిదర్శనమన్నారు.  నగరం లో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు పూనుకున్నామని, 5 లక్షలు అమర్చామన్నారు. ఇక్కడ ఏర్పాటుచేయబోయే కమాండ్‌ కంట్రోల్‌ దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఇది అందుబాటులోకి రాగానే నేరాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందించిన ఘనత తెలంగాణదేనని కితాబిచ్చారు. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు.  

డ్రైవర్‌ను మార్చకండి.. 
హైదరాబాద్‌లో రెండు భారీ రిజర్వాయర్లు కడుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ విధానం గుజరాత్‌ కన్నా మెరుగ్గా ఉందని, కారు అభివృద్ధిలో దూసుకుపోతోందని, డ్రైవర్‌ని మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే గుజరాతీయుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని తమ ఉద్యోగులకు చెప్పాలని గుజరాతీ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత పక్కాగా ఏర్పడేది కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top