ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నా..

Huge Public support to YS Jagan Prajasankalpayatra at Srikakulam - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు పోటెత్తిన జనం 

విద్యా వ్యవస్థను ఈ సర్కారు నాశనం చేస్తోందని ఉపాధ్యాయ సంఘం నేతల ఆవేదన  

దారిపొడవునా పాదయాత్రకు పోటెత్తిన జనం 

అడుగడుగునా ఘన స్వాగతం..మరో వైపు వినతుల వెల్లువ 

అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. ఏటా వేలాది మందిమి వ్యవసాయ డిగ్రీ చేత పట్టుకుని బయటకు వస్తున్నాం. ఎలాంటి ఉద్యోగావకాశాలు లేవు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడం లేదు. ఇలాగైతే మా గతేంటి?’ అని అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యార్థులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మా పొట్ట కొట్టాలని చూస్తోందని మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కార్మికులు మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు సర్కారు అన్ని వర్గాల వారిని ఇక్కట్లపాలు చేసిందని పలువురు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 321వ రోజు శనివారం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రారంభమై నరసన్నపేట నియోజకవర్గంలో ముగిసింది. నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార నది వంతెనపై పార్టీ సీనియర్‌ నేత ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దారిపొడవునా ఊరూరా జనం పోటెత్తారు. మహిళలు, విద్యార్థులు, యువకులు జగన్‌తో కలిసి నడిచేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వివిధ వర్గాల ప్రజలు సమస్యలూ చెప్పుకున్నారు. 
 
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు 
నైర సమీపంలో వైఎస్‌ జగన్‌కు వ్యవసాయ కళాశాల విద్యార్థులు వారి సమస్యలను వివరించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో ఐదు ప్రభుత్వ, ఆరు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇవ్వాలని చూస్తోందని విద్యార్థులు జగన్‌కు వివరించారు. ‘అన్నా.. ఇప్పుడున్న ప్రైవేట్‌ కళాశాలల్లో బోధనా సిబ్బంది లేరు. కనీస వసతులు లేవు. ఐసీఏఆర్‌ నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ కాలేజీలకు 110 ఎకరాల భూమి ఉండాలి. ఇప్పుడున్న వాటికి అటువంటి సౌకర్యం లేదు. మా ఆందోళన ఫలితంగా జీఓ నంబర్‌ 64ను రద్దు చేసినప్పటికీ కొత్తగా జీఓ 79ని తీసుకువచ్చారు. ఐసీఏఆర్‌ గుర్తింపు లేని కళాశాలల నుంచి దొడ్డిదారిన డిగ్రీలు తెచ్చుకుని పైరవీలతో ఉద్యోగాలు పొందిన ఏఈఓలకు పదోన్నతులు కల్పించారు. వీళ్లను వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా తొలగిస్తామని హామీ ఇచ్చి తుంగలోకి తొక్కారు. ఐసీఏఆర్‌ గుర్తింపు ఉన్న కళాశాలల విద్యార్థులకు మాత్రమే వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని, 385 ఏవో, ఏఈఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇవ్వాలని మేము నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని వివరించారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ విద్యార్థులకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థి ఉద్యమ నాయకులు లిఖిత, రాజశేఖర్, శ్రావణి తదితరులు తెలియచేశారు.   
 
వేధింపులు మితిమీరాయి.. 
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమనే సాకుతో తమను వేధిస్తున్నట్టు సింగుపురం, మామిడివలస గ్రామాలకు చెందిన పలువురు జగన్‌కు మొర పెట్టుకున్నారు. తాను వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేశాననే కక్షతో టీడీపీ నేతలు మామిడివలస ప్రాంతంలో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన క్రషర్‌ను మూసేయించారని సత్యనారాయణ జగన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ హయాంలో ఏర్పాటైన మోడల్‌ డిగ్రీ కాలేజీలు లేకుండా చేశారని, పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా పట్టించుకోవడం లేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది పాఠశాలల గ్రాంటు కూడా ఇవ్వలేదని శ్రీకాకుళం జిల్లా కేపీ కాలనీ, ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 వేతనం తమకు ఏ మూలకూ సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం నేతలు జగన్‌కు వివరించారు. 
శనివారం నరసన్న పేట నియోజకవర్గం వంశధార వంతెనపై జనవాహిని వెంటరాగా పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ 
 
గీత కార్మికులను ఆదుకోండి 

రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న తమను ఆదుకోవాలని, 40 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని కల్లుగీత కార్మికుల సంఘం నేతలు బూండి బారికవాడు, బోసు తదితరులు జగన్‌ను కోరారు. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువకులు వలస పోతున్నారని నిరుద్యోగుల సంఘం నేతలు జగన్‌ ఎదుట వాపోయారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడ అంటున్నా అవి క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న నిధులను తమ ప్రాంతానికే వినియోగించాలని వారు కోరారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకు వస్తామని జగన్‌ హామీ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడి ఉత్తరాంధ్రలో మాత్రమే ఉండే అరవ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చేలా చూడాలని ఆ సంఘం ప్రతినిధులు జగన్‌కు విన్నవించారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   

ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. 
సార్‌.. 2001లో ఏఎన్‌ఎం శిక్షణ పూర్తి చేశా. 42 ఏళ్లు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఇద్దరు ఆడపిల్లలు. పిల్లల చదువులు సాగటం లేదు. నాకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. మీ నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లల పథకం ద్వారా బాండ్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రచారం మినహాయిస్తే చెప్పిందేమీ చేయడం లేదు. మీరు సీఎం కాగానే మాలాంటోళ్లను ఆదుకోవాలి.       – టి.భూలక్ష్మి,
అలికాం కాలనీ, శ్రీకాకుళం  

ఈ సర్కార్‌ మా పొట్ట కొట్టాలని చూస్తోంది 
అయ్యా.. మీ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు సహకార పరపతి సంఘాలకు ప్రాణం పోశారు. జీవో నంబర్‌ 151 ద్వారా మమ్మల్ని సెక్రెటరీల నుంచి సీఈవోలుగా గుర్తింపు కల్పించారు. పేస్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏలను అందించారు. ఈ ప్రభుత్వం పదేళ్లగా మమల్ని వేధిస్తోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 49 పరపతి సంఘాల్లో 18 వేల మందిమి పని చేస్తున్నాం. జీవో నంబర్‌71తో ఈ ప్రభుత్వం మా కడుపు కొట్టాలని చూస్తోంది. సీ గ్రేడ్‌ సంఘాలుగా చూపించి పరపతి సంఘాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నింది. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మీరు సీఎం కాగానే మాకు పే రివిజన్‌ చేయాలి.  
– లోలుగు మోహనరావు, పరపతి సంఘాల సీఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం. 

టైమ్‌స్కేల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి 
అన్నా.. వ్యవసాయ కళాశాలలో మీనాన్న గారి హయాంలో టైమ్‌ స్కేల్‌ పద్ధతిన నియమించిన వ్యవసాయ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి. కనీస వేతనాలు రావడం లేదు. పనిభారంతో ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలకు వ్యవసాయ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీరు ముఖ్యమంత్రి కాగానే మాకు న్యాయం చేయాలి. 
 – నైర వ్యవసాయ కళాశాల కార్మికులు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top