మీరొస్తేనే న్యాయం..

Huge Public Response to the YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

జోరు వానలోనూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు జన నీరాజనం

బాబు పాలనలో నాలుగేళ్ల నరకం

ఇక తెగించి పోరాడతాం..మీ అడుగు జాడలో కదులుతాం 

జగన్‌తో కష్టాలు చెప్పుకున్న జనం

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మా కోసం మావూరొచ్చిన రాజన్న బిడ్డను తనివి తీరా చూడ్డానికెళ్లా.. ఆప్యాయంగా పలకరిస్తుంటే నన్ను నేనే మరచిపోయా.. నా కష్టాలడుగుతుంటే ఏడొపు తన్నుకొచ్చింది. నాలుగేళ్ల టీడీపీ పాలనలో మా బాధలు అన్నా.. ఇన్నా.. ఇసుక మాఫియా అరాచకాలు.. లంచాల కోసం వేధించే జన్మభూమి కమిటీలు.. ప్రాణాలు పో తున్నా ఆదుకోని ఆరోగ్యశ్రీ.. ఫీజుల మోతతో పిల్లలను చదివించుకోలేని దైన్య స్థితి.. పుట్లు పండించినా అప్పులకే చెల్లయి, పట్టెడన్నం తినలేని దౌర్భాగ్యం.. ఇలా ఎన్నో చెప్పుకున్నాం. నువ్వొస్తేనే మా కష్టాలు తొలుగుతాయని చెప్పాం’ అంటూ కోట నందూరు మండలం బొద్దవరం గ్రామంలోని అక్కచెల్లెమ్మలు జగన్‌ను కలిసిన తర్వాత చెప్పారు. జోరున కురుస్తున్న వానలోనే తడిసి ముద్దవుతూ వచ్చారు వాళ్లు.

తెలుగుదేశం నేతలు కట్టడి చేసినా ఎదిరించి మరీ జగన్‌ సంకల్పానికి మద్దతిచ్చామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 236వ రోజు సోమవారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం డి.పోలవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్, బొడ్డువరం క్రాస్, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకూ సాగిన యాత్రలో జననేతకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. చెక్క కోలాటాల మధ్య మహిళలు హారతులిచ్చారు. అడుగులో అడుగులేసేందుకు పోటీ పడ్డారు. దారిపొడవునా పూలపాన్పులు పరిచారు. ఊళ్లల్లో పండుగ వాతావరణం కనిపించింది. మరోవైపు కష్టాలు చెప్పుకుంటూ అర్జీలిచ్చారు.  
 
కుట్రలు.. కుయుక్తులు.. 
తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని విశాఖ జిల్లాలో అడుగుపెట్టనున్న తరుణంలో జననేతను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో పాదయాత్ర కోలాహలంగా మారింది. ‘పాదయాత్ర ప్రభంజనమై ముందుకెళ్తుంటే టీడీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.. కుట్రలు చేస్తున్నారు.. కుయుక్తులు పన్నుతున్నారు.. ఊళ్లల్లో ప్రజలను బెదిరిస్తున్నారు.. వేధిస్తున్నారు..’ అంటూ జననేతకు వివరించినట్టు కోట నందూరులో శీను, శివ, రాజబాబు, రవళి, మల్లీశ్వరిలు చెప్పారు.

నాలుగేళ్ల పాలనపై జనాగ్రహం పెల్లుబికిందని, జగన్‌ వెంటే జనం వెళ్లాలని నిర్ణయించుకున్నారని, ఇది భరించలేక ఆయన కుటుంబాన్నే కాదు.. ఆయనను వెన్నంటి ఉన్న వారిపైనా కుట్రలు చేస్తున్నారని కోటనందూరు గ్రామస్తులు అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా జనం జగన్‌ వెంట నడవడం ఖాయం అన్నారు. ‘ఇంకెన్నాళ్లు భరించాలన్నా.. ఓపిక నశించింది. ఇసుక మాఫియా అరాచకాలకు బలవ్వని వాళ్లే లేరు’ అంటూ బొద్దవరం గ్రామస్తులు జగన్‌ వద్ద ఆవేశంగా అన్నారు. మంచినీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లే మహిళలకూ భద్రత లేదన్నారు. ‘70 ఏళ్ల ముసలాడినయ్యా.. కనికరం కూడా చూపలేదు. వైఎస్‌ కుటుంబాన్ని ఆదరించానని పెన్షన్‌ తీసేశారు’ అంటూ బిళ్లనందూరు వద్ద మేడికొండ చందర్‌రావు జగన్‌ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు.  
 
జగన్‌ వస్తేనే న్యాయం.. 
ప్రభుత్వం తమకు శాపంగా మారిందని తాటిపాకకు చెందిన అల్లు సత్యవతి వాపోయింది. ఆమె కడుపులో ఏడాది క్రితం కణితి ఏర్పడిందట. వైద్యానికి లక్షలు ఖర్చవుతాయట. ఆసుపత్రికెళ్తే ఆరోగ్య శ్రీ వర్తించదని చెప్పారట. రెండు సార్లు సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకున్నానంది. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, మీరొస్తేనే తనలాంటి వాళ్ల ఇబ్బందులు తొలుగుతాయని జననేత వద్ద ఆవేదన వెలిబుచ్చింది. బొద్దవరం గ్రామస్తుడు శ్రీరాములుదీ ఇదే తరహా బాధ. కంఠంపై కణితి ఓ పక్కన వేధిస్తుంటే.. వైద్యం అందలేదని బావురుమన్నాడు. కష్టాన్ని ధారపోస్తున్నా ఈ సర్కారుకు మేమంటే చులకనే అన్నా.. అంటూ తాటిపాకకు చెందిన ఆశా వర్కర్‌ మదపాక విజయ.. జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకుంది. నెలకు వెయ్యి రూపాయలిస్తే బతకడమెలా అని ప్రశ్నించింది.

ఇంటింటా వెలుగులు నింపే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రతి పేదవాడి బతుకు చిత్రం జగన్‌ మాటతో ఎలా మారబోతుందో చెబుతామని కోటనందూరు వద్ద పలువురు అభిమానులు అన్నారు. పెద్దిరెడ్డి సురేష్, దంతులూరి శివబాబు, దంతులూరి రాజబాబు, దంతులూరి విష్ణుబాబు, దంతులూరి శ్రీనుబాబులతో పాటు పలువురు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ప్రకటించిన నవరత్నాలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని వారు ఈ సందర్భంగా అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్‌ వారసత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని టీజేనగర్‌ వాసులు అభిప్రాయపడ్డారు.  

ఆ అభిమానమే పదివేలు.. 
పాదయాత్ర సాగిన ప్రాంతంలో ఓ పక్క వాహనాలు బారులు తీరాయి. బస్సులు, లారీలు, ఆటోల్లోంచి జనం జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. కరచాలనం కోసం ఆరాటపడ్డారు. తాటిపాక వైపు వెళ్తున్నప్పుడు బస్సులోంచి ఏడాది వయసున్న చిన్నారిని జగన్‌కు చూపిస్తూ మురిసిపోయాడో వ్యక్తి. ఇది గమనించి జగన్‌ నేరుగా వెళ్లి ఆ చిన్నారిని ముద్దాడాడు. ఆ క్షణంలో చిన్నారి తండ్రి ఉప్పలరపు రాజ శర్మేంద్ర ఆనందం అంతా ఇంతా కాదు. ‘ఆయన ఎత్తుకుని ముద్దాడాడు... మాకు అదే పదివేలు’ అని పట్టరాని ఆనందం వ్యక్తం చేశాడు. గుడివాడ సత్యవతి అనే మహిళ దూసుకుంటూ వచ్చి జగన్‌కు రాఖీ కట్టింది. ‘నాకు అన్నలు లేరు... ఈ రోజు నుంచి జగన్‌ అన్నే నాకు అన్న’ అంటూ ఆనందంతో అంది. నా చెయ్యి పనిచేయదని ఇప్పటి వరకూ బాధపడేదాన్ని... కానీ ఆ పనిచేయని చెయ్యిని అన్న పట్టుకున్నాడు.. నిజంగా నాకెంత ఆత్మస్థైర్యంగా ఉందో.. అంటూ కోటనందూరుకు చెందిన దివ్యాంగురాలు ఎస్‌.మంగ ఆనందపడింది.   

మైమరపించిన సన్నివేశం 
మధ్యాహ్న భోజనం తర్వాత కుండపోత వర్షం. కోటనందూరు నుంచి పాదయాత్ర సాగాలి. రహదారి మొత్తం బురదమయమైంది. అడుగు తీసి అడుగేస్తే జర్రున జారుతోంది. ఈ పరిస్థితిలో జగన్‌ ఎలా పాదయాత్ర చేస్తారంటూ ప్రజలు గొడుగులు పట్టుకుని ఆసక్తిగా చూశారు. వర్షాన్ని లెక్కచేయక.. తెల్లటి దుస్తుల్లో.. శిరస్సు నుంచి ముఖం మీదుగా పాదాలను తాకుతున్న వర్షపు నీటిలో తడిసి ముద్దయిన జగన్‌.. చిరునవ్వుతో ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ ముందుకు సాగడం చిన్నా పెద్దలను ఆకట్టుకుంది. ఆ సన్నివేశాన్ని తిలకించేందుకు జనం గొడుగులు పట్టుకుని మిద్దెలు, మేడలెక్కారు. వర్షంలో తడుస్తున్నా లెక్కచేయక చేతిలోని సెల్‌ఫోన్‌లో ఆ సన్నివేశాన్ని బంధించారు.   

నేడు విశాఖ జిల్లాలోకి పాదయాత్ర 
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారం విశాఖ జిల్లాలో అడుగుపెట్టనుంది. గతేడాది నవంబర్‌ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర 10 జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్టు వద్ద జననేత అడుగిడనున్నారు. సుమారు నెల రోజులకు పైగా ఈ జిల్లాలో పాదయాత్ర జరగనుందని పార్టీ పోగ్రాం కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top