టీడీపీ జాబితా సిద్ధం!

Hopes in TDP Leaders with Alliances - Sakshi

పొత్తులకు అధినేత పచ్చజెండా ఊపడంతో తెలుగు తమ్ముళ్లలో ఆశలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ పార్టీ పనులు మొదలెట్టింది. కాంగ్రెస్‌తో పాటు భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆదివారం ఫోన్లు చేశారు. ఆయా పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకట్రెండు రోజుల్లో కలసి మాట్లాడుకుందామని కోరారు.  

25 స్థానాల కోసం పట్టు 
పొత్తు చర్చల్లో భాగంగా కనీసం 25 స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదనలివ్వాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో కొంత సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో నేడో, రేపో ఆ పార్టీతో జరిగే చర్చల్లో జాబితాను ఇవ్వనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 15 మంది ముఖ్య నేతల కోసం సీట్లు తీసుకోవాలని, ఆపైన వీలున్నంత మందికి అవకాశం కల్పించేలా చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  

జాబితా ఇదే.. 
సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఎల్‌. రమణ (కోరుట్ల), దేవేందర్‌గౌడ్‌ (మహేశ్వరం), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌రెడ్డి (దేవరకద్ర లేదా మక్తల్‌), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), మండవ వెంకటేశ్వరరావు (నిజామాబాద్‌ రూరల్‌), ఎర్ర శేఖర్‌ (జడ్చర్ల), అన్నపూర్ణమ్మ (ఆర్మూరు), వీరేందర్‌గౌడ్‌ (ఉప్పల్‌), బొల్లం మల్లయ్య యాదవ్‌ (కోదాడ), పెద్దిరెడ్డి (హుస్నాబాద్‌). ఆలేరు, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, అశ్వారావుపేట, నకిరేకల్, కొత్తగూడెం, సనత్‌నగర్, ముషీరాబాద్, ఖైర తాబాద్‌ నియోజకవర్గాలూ ఇవ్వాలని కోరనున్నారు.  

తెలుగు తమ్ముళ్లలో ఆశలు 
పొత్తులకు పార్టీ అధినేత గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం.. టీడీపీ తమతో కలసి రావాలని కాంగ్రెస్‌ కూడా ఆహ్వానించడం.. సీపీఐతో ఆదివారం జరిగిన చర్చలు సఫలమవడం.. టీజేఎస్‌తోనూ చర్చలు జరిపే అవకాశాలుండటంతో అనేక మంది ఆశావహులు మళ్లీ అసెంబ్లీలో అడుగెడతామని అనుకుంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు సామాజిక సమీకరణాల్లో భాగంగా మరికొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని, ఇతర పార్టీల సహకారంతో మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కుతామని, మళ్లీ అధ్యక్షా అనే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top