ఈ ఓటు ఏ సిరాతో...

History of Elections In India - Sakshi

ఎన్నికలంటే ఒకప్పుడు పల్లెల్లోనే సందడి వాతావరణం కనిపించేది. పట్టణాల్లో ప్రజలకి ఇల్లు కదిలి పోలింగ్‌ బూత్‌కి తరలిరావాలంటే నిలువునా బద్ధకమే ఆవహించేది.. కానీ క్రమంగా ఓటరు చైతన్యం పట్టణాలకు పాకింది. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటర్లలో ఆ ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలెందుకు ఓటెయ్యాలి అని టీనేజర్లని అడిగి చూడండి, ఇదేం ప్రశ్నయ్యా బాబూ అంటూ ముఖం పెడతారు. ఎందుకు ఓటు వెయ్యకూడదు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎడమ చెయ్యి చూపుడు వేలి మీద సిరా గుర్తుని చూపిస్తూ మా సత్తా ఇదీ అంటూ ఫోటోలు దిగుతారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తారు. ఈ సారి ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య దాదాపుగా కోటీ యాభై తొమ్మిది లక్షలు అని  అంచనా. ఓటు అంటే నోట్ల కట్టలు, మద్యం సీసాలు, ప్రలోభాలు అన్న విమర్శలకు తొలిసారి ఓటర్లు సరైన జవాబు ఇస్తున్నారు. వీరంతా స్వతంత్ర భావాలు కలిగిన వాళ్లు, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు. తండ్రి చెప్పాడనో, తల్లి ఒత్తిడి తెచ్చిందనో ఏదో రాజకీయ పార్టీ వైపు నిలబడరు. తమకు నచ్చినవారికే ఓటేస్తారు. అందుకే ఈ సారి ఎన్నికల్లో వీరు అత్యంత కీలకంగా మారారు.

మహిళా ఓటర్లలో పెరిగిన చైతన్యం 
తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ఓటింగ్‌పై అవగాహనే అంతగా లేకపోయింది.  పరాయి వ్యక్తులకు  పేర్లు చెప్పడానికి ఇష్టపడే వారు కాదు.  ఫలానా వారి భార్య అనో, ఫలానా వారి కుమార్తె అనో చెప్పారే తప్ప పేరు చెప్పకపోవడంతో ఏకంగా 28 లక్షల మంది ఓటు వేసే హక్కుని కోల్పోయారు. కానీ కాలంతోపాటు వీరిలోనూ చైతన్యం ఎక్కువైంది. 2009 తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయి.  కేవలం మహిళా ఓటర్లును ఆకర్షించడానికే పార్టీలు పథకాలు రూపొందించాల్సిన పరిస్థితి. ఈసారి మహిళా ఓటర్లు 43 కోట్ల వరకు ఉన్నారు. ఈ సారి వారే ఎక్కువగా ఓటు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. పురుషు ఓటర్ల కంటే 20 శాతం ఎక్కువగా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రణబ్‌ రాయ్‌ అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల తీరు తెన్నులపై దొరాబ్‌ సుపారీవాలాతో కలిసి ఆయన  ‘ది వర్డిక్ట్‌’ అనే కొత్త పుస్తకాన్ని తెస్తున్నారు. అందులో మహిళా ఓటర్ల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో  ఏకంగా రెండు కోట్ల మంది మహిళలకు ఎన్నికల జాబితాలో చోటు లభించకపోవడం దారుణమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సాంకేతిక కారణాలతో ఏకంగా రెండు కోట్ల మంది మహిళా ఓటర్లు ఈ సారి ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. అయినప్పటికీ మహిళల్లో నెలకొని ఉన్న చైతన్యం వారిని పోలింగ్‌ బూత్‌ల దగ్గర బారులు తీరేలా చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రణబ్‌ రాయ్‌ వ్యక్తం చేశారు. 

నోటా అమలు ఎప్పుడు 
నోటా అంటే నన్‌ ఆఫ్‌ ది ఎబౌ... ఈవీఎంలో ఇది చిట్ట చివర ఉంటుంది.  ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటరు నోటా ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఈ పద్ధతి 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు ముందు 2013లో జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. అయితే పోలింగ్‌ బూత్‌కి వచ్చి మరీ నోటా ఆప్షన్‌ని ఎంచుకోవడానికి ఓటర్లలో విముఖతే కనిపిస్తోంది. నోటాకి పడే సగటు ఓట్లు రెండు శాతం కూడా ఇప్పటివరకు దాటలేదు. నోటా అమలు చేసిన దేశాల్లో భారత్‌ పన్నెండవది.

అభ్యర్థుల ఖర్చు 
2019 ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు 70 లక్షల వరకు, చిన్న రాష్ట్రాల్లో అభ్యర్థులుల రూ.54 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చునని ఎన్నికల సంఘం చెబుతోంది. గతంలో ఈ పరిమితి రూ.40 లక్షలు, రూ. 22 లక్షలుగా ఉండేది.  కానీ ఏ అభ్యర్థి పరిమితికి లోబడి ఖర్చు చేయడంలో లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటేనే మన ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. 

కరపత్రాల నుంచి ఆన్‌లైన్‌ వరకు 
ఒకప్పుడు ఎన్నికల్లో ప్రచారమంటే కరపత్రాల పంపిణీ, గోడల మీద నినాదాలు, ఫ్లెక్సీలు, గల్లీ గల్లీ తిరగడాలు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రచార శైలి ఆన్‌లైన్లోకి మారిపోయింది. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం దక్కించుకోవడానికి సోషల్‌ మీడియా ప్రచారమే ఒక కారణమన్న అభిప్రాయమూ ఉంది. ఎందుకంటే ఓటు హక్కు కలిగిన సగం ఓటర్లు సామాజిక మాధ్యమాల్ని వినియోగిస్తున్నారు. దీంతో ఈ ఐదేళ్లలో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా సోషల్‌ వార్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారం అత్యంత కీలకంగా మారింది. మన దేశంలో 30 కోట్ల మంది ఫేస్‌బుక్, 20 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగిస్తారని ఒక అంచనా. అందుకే ఈ సారి ఎన్నికల్ని ఆన్‌లైన్‌ యుద్ధం అని కూడా పిలుస్తున్నారు. 

సిరాకీ ఒక కథుంది
పోలింగ్‌ సిబ్బంది ఓటరు ఎడమ చేతి వేలిపై సిరాతో ఒక గుర్తు వేస్తారు. మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అదొక గుర్తు. మళ్లీ మళ్లీ ఎవరూ ఓటు వేయకుండా 1951–52లో జరిగిన తొలిసారి ఎన్నికల్లోనే ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. అప్పట్లో వేలిపై సిరాని బ్రిటన్‌ నుంచి దిగుమతి చేశారు.  1962లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా దేశీయంగా రూపొందించిన మైసూరు ఇంక్‌ని వాడారు. ఈ సిరా మన వేలిపై పడితే  మూడు నుంచి నాలుగు రోజుల వరకు చెరిగిపోదు. ఇది నేరేడు రంగులో ఉంటుంది. ఇందులో 7.25శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉండడం వల్ల అది వెంటనే చెరిగిపోదు. కర్ణాటకలోని మైసూరులో పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ కర్మాగారంలో ఉత్పత్తి చేస్తున్న ఇంకునే వాడుతున్నాం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ ఇంకే వాడతారు. ఈ సిరాకి అంతర్జాతీయంగా కూడా డిమాండ్‌ ఉంది. ఇప్పుడు మనం ఏకంగా 35 దేశాలకు ఎన్నికల సమయంలో మైసూరు ఇంక్‌ని ఎగుమతి చేస్తున్నాం.

ఎన్నికల వ్యయం ?
లోక్‌సభ ఎన్నికల ఖర్చుని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పోలింగ్‌ బూతులు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్‌ సిబ్బందికి ఇచ్చే టీఏ డీఏ, పోలింగ్‌ సామాగ్రికయ్యే ఖర్చు ... ఇలా ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నవి. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలకి 10 కోట్ల లోపు ఖర్చు అయింది. ఆ తర్వాత రాను రాను ఈ ఖర్చు తడిసిమోపెడైపోయింది. 1984–85 పదో లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు 100 కోట్లకి చేరుకుంది. 1996 ఎన్నికలకు వచ్చేసరికి అది 500 కోట్లు దాటిపోయింది. ఇక 2004నాటికి ఎన్నికల ఖర్చు వెయ్యి కోట్లు దాటేసింది. 2009 ఎన్నికల్లో 1,114 కోట్లు ఖర్చు అయితే  2014 వచ్చేసరికి ఖర్చు ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగిపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 3,870 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 1977లో ఒక్కో ఓటరుపై సగటున రూపాయి కంటే తక్కువ ఖర్చు అయితే 2014 ఎన్నికల్లో అది రూ.45 దాటేసింది.

సైనికులకు ఓటు ఎలా?
సరిహద్దుల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మన దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న సైనికులకు ఓటు హక్కు వేసే అవకాశం గత ఎన్నికల నుంచి వచ్చిందంటే నమ్మగలరా?  అవును. వారు విధుల నిర్వహించే చోటు నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్‌ 2014 ఎన్నికల్లో వీలు కల్పించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు, వారి కుటుంబాలు ఎక్కడా స్థిరనివాసం ఉండరు. ఎక్కడో మారుమూల సరిహద్దు గ్రామాల్లో తమ విధులు నిర్వర్తిస్తుంటారు. ఏడాదికేడాదికి వారికి బదిలీలు కూడా సర్వసాధారణం. దీంతో వారు తమ ఓటు ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీని గందరగోళ పరిస్థితి.  వారి స్వగ్రామం ఒకటైతే, ఎక్కడో మారు మూల సరిహద్దు గ్రామాల్లో ఉండేవారు. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా వారికి ఓటు వేసే అవకాశమే లేకుండా పోయింది.

ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వారు కానీ మిగిలిన వారి పరిస్థితి అలా ఉండేది కాదు. త్రివిధ  దళాల్లో పనిచేసేవారు తమ కుటుంబంతో కలిసి కనీసం ఒకే ప్రాంతంలో మూడేళ్లు ఉంటేనే వారికి ఓటు హక్కు కల్పించాలంటూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఉన్నాయి. ఏడాదికేడాది బదిలీలే అవుతూ ఉంటే మూడేళ్లు ఒకే చోట ఉండడం సాధ్యపడక ఓటు నమోదుపై కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి అంతగా ఆసక్తిగా ఉండేది కాదు. ప్రస్తుతం 15 లక్షల మందికి పైగా త్రివిధ దళాల్లో విధుల్లో ఉన్నారు. అంటే వారి సంఖ్య తక్కువేం కాదు. అందుకే వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని పోరాటాలు చేశారు. చివరికి సుప్రీం కోర్టు జోక్యంతో సైనికుల కల ఫలించింది. కుటుంబంతో కలిసి ఓకే చోట ఉం డాలన్న నిబంధనను ఈసీ తొలిగించింది. దీంతో గత ఎన్నికల నుంచి సైనికులు తాము నివాసం ఉండే నియోజకవర్గంలోనే ఓటు వినియోగించుకుంటున్నారు. 

బ్యాలెట్‌ పేపరా? పుస్తకమా?
ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ ఏకంగా 50 పేజీలు ఉందంటే నమ్మగలరా? అవును. అది బ్యాలెట్‌ పేపర్‌ కాదు. ఏకంగా ఒక పుస్తకమే. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఏకంగా 480 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఒక పుస్తకాన్నే రూపొందించాల్సి వచ్చింది.  ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికల్లో  ఈ స్థాయిలో పోటీ పడడం ఇదే రికార్డు. అదే ఏడాది కర్ణాటకలో బెల్గామ్‌ నుంచి 456 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

వింతలు విశేషాలు
- మొదటి ఎన్నికల్లో లోక్‌సభ సీట్లు 489 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 543కి చేరుకుంది. 
ఔటర్‌ ఢిల్లీ దేశంలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్న అతిపెద్ద నియోజకవర్గం, ఇక 27 ద్వీపాల సమూహమైన లక్షద్వీప్‌ ఓటర్ల సంఖ్యాపరంగా అతి చిన్నది. 
2014 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 66.38 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. ఇక 1967 సార్వత్రిక ఎన్నికల్లో అత్యల్పంగా 33 శాతం మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. 
అరుణాచల్‌ప్రదేశ్‌లో హొక్కాని పోలింగ్‌ స్టేషన్‌లో కేవలం 22 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎన్నికల సిబ్బంది 22 కి.మీ. నడవాల్సి ఉంటుంది. 
ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఓటు వేయడం కోసం ఎవరూ 2 కి.మీ. పరిధి మించి వెళ్లకూడదు. 
మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 21 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు ఉండేది. 1988లో ఓటు వేసే హక్కు వయసుని 21 నుంచి 18కి తగ్గించారు. రాజ్యాంగంలోని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ తగ్గింపు చేపట్టారు. 
మొదటి లోక్‌సభ ఎన్నికలు ఏకంగా నాలుగు నెలలపాటు కొనసాగాయి. 68 దశల్లో వాటిని నిర్వహించారు. ఈసారి 17వ సార్వత్రిక ఎన్నికల్ని ఏడు దశల్లో 39 రోజుల్లో ముగించేస్తున్నారు. 
విస్తీర్ణం పరంగా చూస్తే అతి పెద్ద నియోజకవర్గం కశ్మీర్‌లోని లదాఖ్‌ (1,73,266 చ.కి.మీ). అతి చిన్న నియోజకవర్గం చాందిని చౌక్‌ (కేవలం పది చదరపు కి.మీ.)
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2,354 రిజిస్టర్డ్‌ పార్టీలు ఉన్నాయి. ఈ సంఖ్య మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య (1,849) కంటే ఎక్కువ. 
గుర్తింపు లేని రాజకీయ పార్టీల సంఖ్య 2010 – 2018 మధ్య రెండింతలు పెరిగింది. 
2010లో ఇలాంటి పార్టీల సంఖ్య 1094. 2018 నాటికి ఈ సంఖ్య 2095కి చేరింది. ఎన్నికల సంవత్సరంలో ఈ తరహా పార్టీలు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. 2013 – 2014 మధ్య వీటి సంఖ్య  17 శాతం మేరకు పెరిగింది. 2017 – 2018 డిసెంబరు మధ్య ఇలాంటి పార్టీలు 11 ఏర్పడ్డాయి.
తొలి లోక్‌సభ ఎన్నికల్లో (1951)లో 53 రాజకీయ పార్టీలు బరిలోకి దిగాయి. 1957లో ఈ సంఖ్య 15కి పడిపోయింది.
1984 – 85 వరకు పోటీకి దిగిన పార్టీల సంఖ్య కాస్త అటూ ఇటుగా 50ని మించలేదు.
1989లో  బరిలోకి దిగిన పార్టీల సంఖ్య మొదటిసారిగా 100 దాటింది. ఆ తర్వాత నుంచి ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 
2009లో 363 రాజకీయ పార్టీలు బరిలోకి దిగాయి.  ఆ సంఖ్య 2014 నాటికి  465కి పెరిగింది.

నేషనల్‌ వర్సెస్‌ రీజనల్‌
1951 – 1991–92 మధ్య (మొదటి పది సాధారణ ఎన్నికలు) జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలు 80 శాతం పైగా సీట్లు కైవసం చేసుకున్నాయి. 
1992 తర్వాత ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుని, దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ 20 శాతానికి పైగా సీట్లు గెలుచుకున్నాయి. 
2014లో బీజేపీ మెజార్టీ సాధించినప్పటికీ, ప్రాంతీయ / రాష్ట్రీయ పార్టీలు మొత్తం స్థానాల్లో ఇంచుమించు 33 శాతం దక్కించుకోగలిగాయి. 
2014లో  జాతీయ పార్టీలు  342 సీట్లు, ప్రాంతీయ / రాష్ట్రీయ పార్టీలు 176 సీట్లు కైవసం చేసుకున్నాయి. 

2018 మే 16 కి, 16వ లోక్‌సభ సభ్యుల్లో ఏ వయస్సు వారు ఎంతమంది?
542 మందిలో 
80 ఏళ్ళ వయస్సుపైబడిన వాళ్ళు 8 మంది
71 నుంచి 80 ఏళ్ళ మధ్య వయస్సువారు 53 మంది
61 నుంచి 70 ఏళ్ళ మధ్య వయస్సు వాళ్లు 161
51 నుంచి 60 మధ్య వయస్సు వారు 164 మంది
41 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సువారు 103 మంది
40 ఏళ్ళు నిండని సభ్యులు 46 మంది. 

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చెంత?
1977 వరకు (6వ లోక్‌సభ) ఒక్కో ఓటరుపై వెచ్చించిన సగటు వ్యయం రూపాయి లోపే. 1996 నాటికి (11వ లోక్‌సభ) ఈ ఖర్చు పది రూపాయలు దాటింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో  ఇంచుమించు 15 రూపాయలకు చేరింది. 2014లో (16వ లోక్‌సభ) సగటున ఒక్కో ఓటరుపై వెచ్చించిన మొత్తం రూ 45 పై మాటే.  
1962 నుంచి 1989 వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారి శాతం ఒకసారి పెరుగుతూ, మరోసారి తరుగుతూ వచ్చింది. 
1991 – 92లో ఓటేసిన వారు 55.88 శాతం మంది మాత్రమే. అంతకు ముందరి పాతిక సంవత్సరాల్లో అదే కనిష్టం.
1957లో సగటున ఒక్కో నియోజకవర్గానికి పోటీ పడిన అభ్యర్థులు  ముగ్గురు.  
మొదటి ఆరు సాధారణ ఎన్నికల్లో (1977 వరకు) అభ్యర్థుల సంఖ్య సగటున  3 నుంచి 5కి మించలేదు. 7వ సాధారణ ఎన్నికల సమయానికి ఇది 8.8కి చేరింది. 
1980 తర్వాత ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల సగటు సంఖ్య పెరుగుతూ 1996 నాటికి  25.7కి చేరింది. 
1996 తర్వాత ఎన్నికల సంఘం సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ. 500 నుంచి రూ. 10,000కి పెంచింది. 2019 నాటికి ఈ మొత్తాన్ని రూ. 25,000 చేసింది. దీంతో, 1998లో అభ్యర్థుల సగటు సంఖ్య 8.75కి తగ్గింది. 1999 నుంచి ఆ సంఖ్య కాస్త పుంజుకుని, 2014 నాటికి 15.2కి చేరింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top