అర్ధరాత్రి నిర్బంధిస్తారా?

High Court was angry with police In Revanth Reddy Arrest - Sakshi

రేవంత్‌ అరెస్ట్‌లో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రేవంత్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో పోలీసుల తీరును హైకోర్టు మంగళవారం తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన్ను అర్ధరాత్రి నిర్బంధించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధానికి కారణాలు కూడా తెలియజేయకపోవడం ఏమిటని నిలదీసింది. నిఘా వర్గాల నివేదిక ఆధారంగా రేవంత్‌ను నిర్బంధించామంటున్న పోలీసులు ఆ నివేదికను తమ ముందు ఎందుకు ఉంచలేదని మండిపడింది. ఆ రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. రేవంత్‌ను విడిచిపెడతామన్న (మంగళవారం సాయంత్రం రేవంత్‌ను పోలీసులు విడిచిపెట్టారు) అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ హామీని నమోదు చేసుకొని తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం ఉదయం 10:15కి మొదటి కేసుగా ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిర్యాదు చేసినందుకే అరెస్టు: పిటిషనర్‌
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినందుకే పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్‌రెడ్డిని నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని, అందువల్ల ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రేవంత్‌ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసరంగా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి. మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసులు అర్ధరాత్రి 2.45 గంటలకు కొడంగల్‌లోని రేవంత్‌ ఇంటి గేటు తాళం పగలగొట్టి, తలుపులు బద్దలుకొట్టి ఆయన్ను వెంట తీసుకెళ్లారన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌. శరత్‌కుమార్‌ స్పందిస్తూ మంగళవారం కొడంగల్‌లో ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందని, ఈ సభను అడ్డుకోవడంతోపాటు బంద్‌ నిర్వహిస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు.

రెచ్చగొట్టేలా రేవంత్‌ ప్రసంగాలు చేస్తున్నారని వివరించారు. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, ఈసీ ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ జరిగిందన్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశామన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద ముందస్తు అరెస్ట్‌కు అధికారం ఉందన్నారు. రేవంత్‌ను జైల్లో కాకుండా జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఉంచామని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం నిఘా నివేదికను తమకు సమర్పించలేదేమిటని ప్రశ్నించగా వికారాబాద్‌ ఎస్పీ సీఎం సభ వద్ద ఉన్నారని ఎస్‌జీపీ పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటం ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రికి కూడా తెలుసు. కోర్టు నివేదిక కోరుతోందని సీఎంకు చెబితే ఆయనేమీ ఎస్పీని వెళ్లకుండా అడ్డుకోరు. అందువల్ల నివేదికను 15 నిమిషాల్లో మా ముందు ఉంచాల్సిందే’అని స్పష్టం చేసింది. విచారణ సోమవారానికి వాయిదా వేయాలని శరత్‌ కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు అదృశ్యమవుతున్నారని, మొన్న ఓ న్యాయవాది, నిన్న ఓ ట్రాన్స్‌జెండర్, నేడు రేవంత్‌రెడ్డి అని, అందువల్ల ఈ వ్యవహారం ఈరోజే తేలాలని స్పష్టం చేసింది. పోలీసులతో మాట్లాడి ఆ నివేదికను తమ ముందుంచాలంటూ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది.

ఏజీని రమ్మనండి
మధ్యాహ్నం 3 గంటలకు విచారణ తిరిగి ప్రారంభంకాగా శరత్‌కుమార్‌ స్పందిస్తూ పోలీసులు ఓ వీడియో క్లిప్‌ పంపారని చెప్పారు. సీఎం సభ వద్ద ఉండటంతో నివేదికను అందించేంత సౌకర్యం పోలీసులకు ప్రస్తుతం లేదన్నారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం ‘ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. కావాల్సిన కాగితాలను ఫ్యాక్‌ ద్వారా తెప్పించుకోవచ్చు. పోలీసుల వద్ద ఫ్యాక్స్‌ మెషీన్‌ ఉంటుంది. మీ కార్యాలయంలోనూ ఉంటుంది. లేకపోతే హైకోర్టులో ఫ్యాక్స్‌ మెషీన్‌ ఉంది. ఇవన్నీ కాదనుకుంటే స్కాన్‌ చేసి మెయిల్‌ చేయవచ్చు’అని సూచించింది. తమకు నివేదిక కావాల్సిందేనని తేల్చిచెప్పింది. సహచర న్యాయమూర్తి పదవీవిరమణ కార్యక్రమం ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లి 4 గంటలకు వస్తామని, ఆలోగా నివేదికను తెప్పించాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్‌ను 4.30 గంటలకు వదిలేస్తామని, విచారణను బుధవారానికి వాయిదా వేస్తే రికార్డులను సమర్పిస్తామని, అప్పుడు రేవంత్‌ నిర్బంధం సక్రమమా.. అక్రమమా? తేల్చవచ్చునని ఎస్‌జీపీ పేర్కొనగా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం తాము అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినాలనుకుంటున్నామని, ఆయన్ను హాజరుపరచాలని ఆదేశించింది.

రేవంత్‌ విషయంలోనూ అలానే...
ధర్మాసనం స్పందిస్తూ సీఎం సభ ప్రారంభమైందా? ఆ సభకు మీరు చెబుతున్న అల్లరి మూకలు వచ్చాయా? అని ప్రశ్నించింది. అల్లరి మూకలు రాకుండా ఏర్పాట్లు చేశామని శరత్‌ చెప్పగా రేవంత్‌ విషయంలోనూ అలాగే చేసి ఉండొచ్చునని అభిప్రాయపడింది. ఈ సమయంలో మోహన్‌రెడ్డి స్పందిస్తూ విచారణ వాయిదా వేస్తే రాత్రికి రాత్రే నివేదికను సృష్టిస్తారని, లేని నివేదికను తెచ్చేందుకు పోలీసులు కష్టపడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో శరత్‌ ఆవేశంగా మాట్లాడుతుంటే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సినిమా డైలాగ్స్‌ వల్లించవద్దని స్పష్టం చేసింది. రేవంత్‌ నిర్బంధానికి పోలీసులు చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవని పేర్కొంది. రేవంత్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలనగా సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తామని ఏజీ చెప్పారు. ఏజీ చెప్పిన ఈ విషయాన్ని రికార్డు చేసుకున్న ధర్మాసనం... రేవంత్‌ అరెస్ట్‌ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను అదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top