కూటమి వస్తే పథకాలుంటాయా?

Harish rao fires on mahakutami and congress - Sakshi

కృష్టా, గోదావరి జలాలు కిందికి వదులుతారా..

సిద్దిపేట బీడీ కార్మికుల సభలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కాకుం డా కుట్రలు చేసే ఆంధ్రాబాబు చంద్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్‌ మహాకూటమికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఉంటాయా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలు కిందికి తరలించకుండా మనకు వదులుతారా అని అన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిం చిన తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని, నాడు ఉద్యమంతో కుట్రలు ఛేదించినట్లే ఇప్పుడు ఓట్లతో తెలంగాణ ద్రోహులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేటలోని వివిధ కార్మిక సంఘాలకు చెందిన బీడీ కార్మికులు తెలంగాణ అనుబంధ టీఆర్‌ఎస్‌కేవీలో చేరారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘బీడీ కార్మికులు అధికంగా ఉన్నది తెలంగాణలోనే. గత పాలకుల నిర్లక్ష్యంతో వారిని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీడీ కార్మికులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకుంది. సాగునీరు లేక బోర్లు వేసి అప్పుల పాలై దుబాయ్, ముంబై, సౌదీ ప్రాంతాలకు మగవారు వలసలు వెళ్తే ఇంటి వద్ద బీడీలు చేసుకుంటూ మహిళలు కుటుం బాలను పోషించుకుంటున్నారు. బీడీలు చేయడం వల్ల వారు తరచూ అనారోగ్యానికి గురవుతున్నా నాటి పాలకులు పట్టించుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీడీ కార్మికులకు డబుల్‌ ఇళ్లు..
బీడీ కార్మికుల హక్కుల కోసం సీఎం కేసీఆర్‌ పలుమార్లు ఆంధ్ర పాలకులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీడీ కార్మికులకు అండగా ఉంటూ వారికి పెన్షన్‌ అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించామని తెలిపారు. రాష్ట్రంలోని బీడీ కార్మికుల్లో అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  

కోనసీమను తలదన్నేలా తెలంగాణ..
తలాపున ఉన్న గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీళ్లకు రాలేకపోయాయని హరీశ్‌ అన్నారు. వీటిని మళ్లించి ఎడారిగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ కంకణ బద్దులుగా నిలిచారని చెప్పారు. ఇందులో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామన్నారు. సీతారామ, డిండి, కల్వకుర్తి, బీమా, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసుకుంటే తెలంగాణ కోనసీమను తలదన్నేలా పచ్చటి పైరులతో తులతూగుతుందని చెప్పారు. సమావేశంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, బీడీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top