ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తాయి!

Harish rao fires on bjp and congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీజేపీలు పచ్చి అవకాశవాద పార్టీలని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలోనే ప్రజలున్న సంగతి ఆ పార్టీలకు గుర్తుకు వస్తుందని, రాజకీయాలే చేయడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన వాటికి ఉండదన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో మెదక్‌ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం జాతీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని విమర్శించారు. అందుకే స్థానిక పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకుంటాయన్నారు.

నయాపైస నల్లధనం బయటికి రాలే..
ఎన్డీఏ హయాంలో దేశం సంక్షోభంలోకి నెట్టబడిందని హరీశ్‌ ఆరోపించారు. పెట్రోలు, డీజీల్‌ ధరలు ఆకాశన్నంటుతుంటే స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని విమర్శించారు. రూపాయి విలువ క్రమంగా పతనమై సామాన్యుడికి తీవ్ర సంకట పరిస్థితులు తెస్తున్నాయన్నారు.

నోట్ల రద్దుతో నయాపైస నల్లధనం బయటకు రాలేదని, కేవలం మహిళలు పోపుడబ్బాల్లో దాచుకున్న డబ్బులు మాత్రమే బయటకొచ్చాయని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో వచ్చిన మార్పేంటో బీజేపీ నేతలే స్పష్టం చేయాలన్నారు. తెలంగాణలో బయ్యారం ప్లాంటు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సంగతి గాలికొదిలేసి.. ఏపీలో పోలవరానికి మాత్రం జాతీయ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తెలంగాణకు చేసింది శూన్యం
బీజేపీ పాలిత రాష్ట్రాలకు వేల కోట్లు గ్రాంట్ల రూపంలో ఇచ్చిన మోదీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదని హరీశ్‌ విమర్శించారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వాలని కోరినప్పటికీ కరుణించలేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు ఢిల్లీకెళ్తే భాష్పవాయువు ప్రయోగించిన నైజం బీజేపీదని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రభుత్వం 4 వందల కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వాటిని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథతో తెలంగాణలో వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయిందని, ఎండాకాలంలోనూ నీళ్లు పారుతున్నాయని తెలిపారు.  

రాహుల్‌ సమాధానం చెప్పాలి
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటనలు చేస్తున్నారని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందని హరీశ్‌ చెప్పారు. దానిపై సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణలో ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఏపీకి తరలివెళ్లే ప్రమాదముందని.. దీంతో ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మహాకూటమి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారుతుందన్నారు. అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కోదండరాంను జేఏసీ చైర్మన్‌ చేసిన ఘనత కేసీఆర్‌దేనని.. కానీ ఇప్పుడు అడ్రస్‌ లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు. కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారని, టికెట్లు ప్రకటించాక ఎవరెవరు సిగలు పట్టుకుంటారో చూస్తామన్నారు. కేసీఆర్‌ను దూషిస్తే సహించబోమని హెచ్చరించారు.

జనరంజక మేనిఫెస్టో..
సిద్దిపేట జోన్‌: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జనరంజక మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు తీపి కబురు వినిపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరిచేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను ఆయనకు అందజేశారు.

అదేవిధంగా ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్, రెడ్డి సంక్షేమ భవన్‌లో జరిగిన మైనార్టీ వర్గాల సమావేశంలో, కొండ భూదేవి గార్డెన్‌లో ఆటో డ్రైవర్ల ఆశీర్వాద సభలో, అరుంధతి కళ్యాణ మండపంలో జరిగిన సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. స్థానిక కొండ భూదేవి గార్డెన్‌లో ఆటో డ్రైవర్లు ఏకగ్రీవ తీర్మాన ప్రతులను హరీశ్‌కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటోవాలా అభిమానం తనకు ఆనందాన్ని ఇచ్చిందని, వారి అభిమానం మరువలేనిదని, శక్తి మేరకు వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో ఎస్సీలకు తీపికబురు ఉండనుందని, గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా ప్రత్యేక ఎజెండా మీ ముందుకు రాబోతుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top