నా చర్మంతో చెప్పులు కుట్టించినా తక్కువే 

Harish rao comments with Siddipet People - Sakshi

     సిద్దిపేట ప్రజలు చరిత్రను తిరగరాసే తీర్పునిచ్చారు: హరీశ్‌ 

     ఈ జన్మంతా మీ కోసమే... కార్యకర్తల కృషి వెలకట్టలేనిది

సాక్షి, సిద్దిపేట: ‘చరిత్రను తిరగరాశారు. పోలైన ఓట్లలో 80 శాతం ఓట్లు రికార్డు స్థాయిలో నాకు వచ్చాయి. మీరిచ్చిన తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టించినా తక్కువే. ఈ జన్మంతా మీ కోసమే పని చేస్తా’అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట ప్రజలపై తనకున్న ప్రేమను పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో బుధవారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ, బాలవికాస ఆధ్వర్యంలో అనాథ పిల్లల జన్మదిన వేడుకలు, నంగునూరు మండలంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిచోటా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ తనను లక్షకుపైగా ఓట్ల రికార్డు మెజార్టీతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల అశీస్సులతో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిందని ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తన విజయంకోసం పనిచేసిన కార్యకర్తల శ్రమ వెలకట్టలేనిదని అన్నారు.  

సిద్దిపేట.. నా కుటుంబం  
తన మీద నమ్మకం ఉంచి టీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తామన్నారు. ‘సిద్దిపేట నా కుటుంబం లాంటిది, మీకు కష్టమొచ్చినా, ఆపదొచ్చినా మీ ఇంటి మనిషిలా తోడుగా ఉంటా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా.. రాష్ట్రం మొత్తం తిరిగినా మీ ప్రేమకు దాసుడిని’అని పేర్కొన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడంలో మీ వంతు పాత్ర ఉందన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో ముందు ఉన్నట్టే ఎన్నికల ఫలితాల్లో కూడా నంబర్‌ 1 మెజార్టీతో అగ్రగామిగా నిలిచామన్నారు. ‘లక్ష’లక్ష్యం ఫలించిందని.. ఇక ప్రజాసేవే తన ముందున్న కర్తవ్యమని అన్నారు. సిద్దిపేట ప్రజలు తల ఎత్తుకుని నిలిచేలా అభివృద్ధిలో మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుపుతానన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక పెద్ద కొడుకులా పేదలకు అండగా నిలుస్తున్నారని, హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్‌ రోజు, క్రైస్తవులకు క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా కొత్త వస్త్రాలు అందించి కొత్త సంస్కృతికి నాందిపలికారన్నారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top