ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టండి

Harish rao comments on kodandaram - Sakshi

     కాంగ్రెస్‌ను, కోదండరాంను నిలదీయండి

     ప్రజలు పచ్చగా బతకడం వారికి ఇష్టం లేదు

     భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ఇంతకాలం కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ జిల్లాల్లోని బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలు పారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంటే.. ప్రజలు పచ్చగా బతకడం ఇష్టంలేని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, వారికి మద్దతుగా జేఏసీ నేత కోదండరాం విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, కొమురవెల్లి, సిద్దిపేటలోని పలు కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నడం శోచనీయమన్నారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తయితే సిద్దిపేట, యాదాద్రి, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ జిల్లా వాసులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. రైతుల కష్టాలు తీరే రోజుకోసం ప్రభుత్వం ఎదురుచూస్తుంటే.. మరోవైపు అభివృద్ధిని అడ్డుకునేందుకు కోదండరాం మాట్లాడటం సరికాదన్నారు. మల్లన్నసాగర్‌ నిర్మాణంలో ముంపున కు గురవుతున్న ప్రజలతో మాట్లాడి.. చట్టప్రకారం వారికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు, వారికి మద్దతు పలుకుతున్న కోదండరాం ప్రజ లకు ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసేందుకు సహకరించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top