ముందస్తంటే కాంగ్రెస్‌లో వణుకు

Harish rao commented over congress - Sakshi

మంత్రి హరీశ్‌రావు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు మాకే...

సాక్షి, సిద్దిపేట: అధికారంలో ఉన్నంతకాలం ప్రజల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ముందస్తు ఎన్నికలంటేనే కాంగ్రెస్‌ నాయకులకు గుండెల్లో వణుకు పుడుతోందని విమర్శించారు. శనివారం సిద్దిపేటలో ప్రగతి నివేదన సభకు తరలివెళుతున్న 150 ట్రాక్టర్ల ర్యాలీకి మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ ప్రజల ముందు మాటలు చెప్పి కాలం గడపడమే కాంగ్రెస్‌కు తెలుసన్నారు. ప్రగతి నివేదన సభకు రైతులు, కులవృత్తులు, ఇతర వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు. సభకు రెండు రోజుల ముందుగానే ప్రభంజనంలా జనం కదలి రావడం చూసిన కాంగ్రెస్‌ అర్థం లేని విమర్శలు చేస్తోందన్నారు. మీపై కూడా ప్రజలకు నమ్మకం ఉంటే.. మీరూ సభలు పెట్టుకొని నిరూపించుకోవాలని హితవు పలికారు.

డెబ్బై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనకు.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి సరిపోల్చుకోవాలని సూచించారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం కూడా చేతకాలేదని విమర్శించారు. రైతన్న రాత మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ 100కు పైగా సీట్లు గెల్చుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తమ బలం నిరూపించుకోవాలని హరీశ్‌  కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. మంత్రి వెంట సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top