ఉత్తరాంధ్రలో జనకెరటం

Grand Welcome to YS Jagan At Visakhapatnam - Sakshi

థింసా నృత్యాలు, బంతిపూల బాటతో విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు అభిమాన స్వాగతం

జన సంద్రమైన గన్నవరం మెట్ట.. 

కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన జనం

మన్యం వీరుడి పౌరుషాన్నిగుర్తుచేసిన చిన్నారులు 

కష్టాలు చెప్పుకుంటూ అడుగులో అడుగేసిన జనం 

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ‘తూర్పు’న ఘనంగా వీడ్కోలు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  వెన్నంటి వీడ్కోలు పలికిన అభిమానం.. ఎదురేగి స్వాగతించిన అప్యాయత.. వెరసి జన ప్రభంజనానికి విశాఖ జిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్ట వేదికైంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 237వ రోజు మంగళవారం ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జననేత అడుగుల్లో అడుగులేసేందుకు ఎర్రవరం జంక్షన్‌ వరకూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. కిలోమీటర్ల కొద్దీ వాహన శ్రేణులు బారులు తీరాయి. అన్నా ఇక ఉంటాం.. సీఎంగా మళ్లీ రావాలంటూ తూర్పుగోదావరి జిల్లా వాసులు ఓ వైపు వీడ్కోలు పలుకగా, మీ సంకల్పానికి యావత్‌ ఉత్తరాంధ్ర మద్దతుపలుకుతోందన్నా.. అంటూ విశాఖ జిల్లా వాసులు స్వాగతం పలికారు. జననేతను చూడాలని వృద్ధులు, పిల్లలు, మహిళలు.. విద్యార్థులు.. రైతులు.. అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. యువత కేరింతలతో, చిన్నారులు గులాబీలతో వెల్‌కం చెప్పారు. అశేష అభిమాన జనం పూలవర్షం కురిపించారు. పూలపాన్పు పరిచి అక్కచెల్లెమ్మలు మంగళహారతులిచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. చింతపల్లి ఏజెన్సీ గిరిజన యువతులు థింసా నృత్యాలతో చిందేశారు. కట్టిపడేస్తున్న అభిమానం మధ్య జగన్‌ అడుగేయడం కూడా కష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి మొదలైన యాత్ర విశాఖ జిల్లా శరభవరం, శృంగవరం, గాంధీనగర్, వై దొండపేట జంక్షన్, ఎర్రవాలం వరకు సాగింది.  
 
అల్లూరి వేషధారణతో చిన్నారుల స్వాగతం 
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణతో చిన్నారులు జగన్‌కు స్వాగతం పలికారు. ఎక్కుపెట్టిన బాణాలతో అల్లూరి పౌరుషాన్ని ప్రదర్శించారు. తమ నేత సంకల్పాన్ని అల్లూరి వీరత్వంతో పోల్చేందుకే ఇలా వచ్చామని ఆ చిన్నారులు చెప్పారు. ‘మా జిల్లాకొచ్చే అన్నకు ప్రత్యేక నృత్యంతో స్వాగతం చెప్పాలని పాడేరు నుంచి వచ్చాం. నెల రోజులుగా ఈ డాన్స్‌ నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు యుద్ధం చేసినప్పుడు మా వాళ్లు ఈ తరహాలోనే నృత్యం చేశారట’ అని పాడేరుకు చెందిన గిరిజన యువతి సువర్చల తెలిపింది. ‘నాలుగేళ్లుగా మా బాధలేంటో మాకే తెలుసు. వాటన్నింటినీ ఆయనకు చెప్పడానికే వచ్చాం. మా వెంట తీసుకెళ్లి చూపించాలనుంది’ అని చింతపల్లికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు నర్సయ్య అన్నాడు. చంద్రబాబు గిమ్మిక్కులు, ఆ పార్టీ వాళ్ల అరాచకాలు ఎదిరించే శక్తి జగన్‌కే ఉందని నమ్ముతున్నామని మాడుగుల నుంచి వచ్చిన యువతులు పోలమ్మ, వీరమణి, దాసయ్య తెలిపారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి పాదయాత్ర సాగిన గ్రామాల మీదుగా జగన్‌కు ఎదురెళ్లింది. ఆయనొస్తే ఆదివాసీలకు అండ లభిస్తుందని చెప్పడానికే కాలిబాట పట్టామని పాడేరు, చింతపల్లి నుంచి వచ్చిన ఆదివాసీ నేతలు భూపేంద్ర, అక్కులయ్య, సాలమ్మ తెలిపారు.  
 
పేదోడి కన్నీళ్లు తుడిచేది జగనే.. 

ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ను జనం మనసారా పలకిరించారు. నిండైన మనసుతో ఆశీర్వదించారు. గుండెల్లోని బాధలన్నీ చెప్పుకున్నారు. ఊరూరా గుండెలను బరువెక్కించే కన్నీటి కథలకు జగన్‌ వస్తేనే ముగింపన్న భావన పాదయాత్రలో కలిసిన ప్రతీ వ్యక్తి నుంచి వ్యక్తమైంది. ‘నేను టీడీపీ కార్యకర్తనే. ఆ పార్టీకే ఓటేశాను. తప్పు చేశానని నాదాకా వస్తేగానీ తెలియలేద’ని శృంగవరం గ్రామానికి చెందిన గుండు స్వామి నాయుడు అన్నాడు.  ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడట. ఆపరేషన్‌ కోసం వెళ్తే ఎవరూ పటించుకోలేదట. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారట. జగన్‌ వస్తేనే బాగుంటుందన్న జనం మాట తనను కదిలించిందన్నాడు. అందుకే ఆయన్ను కలవాలని వచ్చినట్టు చెప్పాడు. ‘రాజకీయంగా పోరాడే సత్తా చంద్రబాబుకు లేదు.. అందుకే జగన్‌పై కేసులు పెట్టించి వేధిస్తున్నారు.. ప్రజల బాగు కోసం తపిస్తున్న నేత జగన్‌.. ఇవన్నీ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఏ పార్టీకి భక్తుడిని కాకపోయినా, ఈసారి జగన్‌కు నేను భక్తుడిని. అందుకే ఆయన కోసం వచ్చాను’ అని  బత్తిన అప్పల నర్స అన్నాడు. ‘పదిహేనేళ్ల క్రితం రాజన్న పాదయాత్రను చూశాను. ఈ బాబుదీ అదే వారసత్వం. ఇలాంటి వ్యక్తిని స్వాగతించాలనిపించింది. అందుకే వచ్చాను’ అని శరభవరం గ్రామస్తుడు చిన అప్పలకొండ అన్నాడు.

వృద్ధ దంపతులు పైల సీతమ్మ, చినబిల్లిలు... శృంగవరం గ్రామంలో జగన్‌ను కలిశారు. నిలబడలేని స్థితిలో ఉన్నా పెన్షన్‌ ఇవ్వడం లేదని వాపోయారు. ‘నేను అంధుడిని కానే కాను.. ఆ జగన్‌ బాబు చేతి స్పర్శ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం అంతగా పెరిగింది. కంటిచూపు మందగించడం, వయసు మీరడం వల్ల ఐరిష్, వేలిముద్రలు పడటం లేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పింఛన్‌ ఆపేశారు. నా బాధను జననేతకు చెప్పాను’ అని శృంగవరానికి చెందిన సుర్లంగి జోగునాయుడు తెలిపాడు. నాన్నగారి ఆరోగ్య శ్రీ పథకం తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టిందని నాగ అప్పారావు, రాజేశ్వరి తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏ సమస్య చెప్పినా ఈ సర్కారు పట్టించుకోదు. అందుకే జగన్‌కే విన్నవించాలనుకున్నాం’ అని అఖిల భారత బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వై రాంజీ తెలిపారు. సెప్టెంబర్‌ 15, 16న విశాఖలో నిర్వహించే బ్రాహ్మణ సంఘ ఆత్మీయ సమావేశానికి జగన్‌ను ఆహ్వానించారు. తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. సింహాచలం అర్చకులు మనంత యాగిలి.. దేవస్థానంలో ఏకపక్ష వ్యవహారాలు విపక్ష నేత దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత.. అందరికీ ధైర్యం చెబుతూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. 

 

నేడు పాదయాత్రకు విరామం
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్న జగన్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ జిల్లాలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొననున్నారు. ఉదయం 7.30 గంటలకు నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం ఎర్రవరం జంక్షన్‌ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. విశాఖ జిల్లా వాసులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా ప్రజా సంకల్ప యాత్రకు బుధవారం విరామం ప్రకటించినట్టు పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. తిరిగి గురువారం ఉదయం పాదయాత్ర య«థావిధిగా కొనసాగుతుందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top