కొండకోనల్లో పోటెత్తిన జనం 

Grand welcome to the YS Jagan All Over the State - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వెల్లువెత్తిన సంఘీభావం 

అడుగడుగునా పూలు కురిపిస్తూ ఘన స్వాగతం 

టీడీపీ ప్రభావిత గ్రామాల్లో ప్రభంజనం 

తమకు అండగా ఉన్నది జగన్‌ ఒక్కరేనని కాపు నేతల కృతజ్ఞతలు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/పిఠాపురం: అడుగడుగునా హారతులు.. రోడ్లపై పూలు పరిచి ఆత్మీయ స్వాగతాలు.. జై జగన్‌ అంటూ యువకుల కేరింతలు.. పనులు పక్కన బెట్టి రోడ్డుపైకి పరుగులు తీసిన మహిళలు.. లేని ఓపిక తెచ్చుకుని ఊత కర్ర సాయంతో చిన్నగా నడుచుకుంటూ వచ్చిన అవ్వాతాతలు.. ఇవీ ఆదివారం నాటి ప్రజా సంకల్ప యాత్రలో కనిపించిన దృశ్యాలు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  235వ రోజు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు.

ఆద్యంతం భారీ సంఖ్యలో జనం ఆయన అడుగులో అడుగు వేశారు. తుని మొదలు రేఖావారిపాలెం, మరువాడ, నందివొంపు, గండి, డి.పోలవరం వరకు వివిధ వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. కొండ కోనల మధ్య నుంచి సాగిన యాత్రలో జననేతను కలుసుకుని సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన వారితో గ్రామాలన్నీ కిక్కిరిశాయి. ఆదివారం జగన్‌ యాత్ర సాగిన ప్రాంతాల్లో టీడీపీ ప్రభావం కొంత ఎక్కువ. అలాంటి గ్రామాల్లోనే జనం పెద్ద సంఖ్యలో ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. మహిళలైతే రెండు చేతుల నిండా పూలు తీసుకుని రోడ్లపై చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్‌ రాక కోసం గంటల తరబడి వేచి చూశారు. జగన్‌ అక్కడికి రాగానే ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.  

దారి పొడవునా వినతులు 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వ పథకాల వల్ల ఎలాంటి లబ్ధి పొందని వారు, టీడీపీ నేతల దౌర్జన్యానికి బలవుతున్న వారు తమ కష్టాలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో జగన్‌ వద్దకు వచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆయనకు వినతి పత్రాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆయన్ను కలిసి తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. మద్యం వల్ల తమ కుటుంబాలు ఎలా పాడవుతున్నాయో తెలుపుతూ.. మద్యానికి బానిసలైన తండ్రుల తీరును వారి బిడ్డలు వివరించారు. అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులు రద్దు చేయాలని వారు జగన్‌ను కోరారు. మాదిగ కళాకారులు, రజక సామాజిక వర్గాలకు చెందిన వారు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ తమకు భరోసా కల్పించారని డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్‌ పర్సన్స్‌ (ఆర్‌పీ)లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని జగన్‌ హామీ ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. తాము జగన్‌ వెంటే ఉంటామని, జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం అని కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్‌ పీవీ లక్ష్మి, డ్వాక్రా సంఘాల నేతలు అనంత, మేరీ, తులసి, త్రివేణి, రామలక్ష్మి తదితరులు స్పష్టీకరించారు. జగన్‌ సీఎం అయితేనే పేదలందరి కష్టాలు తీరతాయని ఆకాంక్షించారు. పింఛన్లు ఆపేశారని, రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వడం లేదని దారిపొడవునా వివిధ వర్గాల వారు జననేతకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనని వాపోయారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.    

కాపు నేతల సంఘీభావం 
కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని, తుని ఘటనలో అక్రమ కేసులు ఎత్తివేస్తానని జగన్‌ ఇచ్చిన హామీలపై పలువురు కాపు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాపు జాతికి అండగా ఉన్నది వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని, కాపు ఉద్యమంలోనూ ఆయన మద్దతుగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అమలాపురం కో ఆర్డినేటర్‌ విశ్వరూప్, కాపు నేతలు జొన్నాడ రామారావు (బాబీ), వాకా వీర్రాఘవులు, దంగేటి రాంబాబు, సోదా గణపతి, అడపా బాబూరావు తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుని రూరల్‌ మండలం గండిలో వారు జననేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్‌ మాట తప్పని నేత అన్నారు. ఏదైతే చేయగలుగుతారో అదే చెబుతారన్నారు. తుని రైలు దహనం కేసులను ఎత్తేస్తానని జగన్‌ చేసిన ప్రకటన కాపుల్లో మనోధైర్యం కల్పించిందన్నారు. జగన్‌ గట్టిగా మద్దతు ఇవ్వడం వల్లే కాపుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబును నిలదీయకుండా, వాస్తవాలు మాట్లాడిన నేతను దోషిగా నిలబెట్టాలనుకుంటే కాపులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.  

అంకుల్‌.. నాకు మాటలొచ్చాయి.. 
అంకుల్‌.. నేను మూగ, చెవిటి సమస్యలతో పుట్టానట. ఆ సమస్యలతో జీవితంలో ఇక మాట్లాడలేదని మా అమ్మా నాన్నలు సూర్యకళ, అబ్బిరెడ్డి నాగేశ్వరరెడ్డిలు తీవ్ర నిరాశతో కుమిలిపోయారట. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని దేవునిపై భారం వేసిన సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టారట. అప్పుడు నాకు మూడేళ్లు. రూ.7 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఈ పథకం కింద హైదరాబాద్‌లో 2008లో ఉచితంగా చేశారట. ఆ పథకం వల్లే నేను ఈ రోజు మాట్లాడగలుగుతున్నా. ఏడో తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మీరు పాదయాత్రగా వచ్చారని తెలిసి మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మా అమ్మానాన్నలతో కలిసి వచ్చాను. 
– వర్షిత లక్ష్మిరెడ్డి 

చేస్తామన్న సాయం చేయలేదయ్యా..  
నా మనవడు యర్రా గంగాధర్‌కు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌ చేయించలేక ప్రభుత్వాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ వర్తించదని, ఆపరేషన్‌ చేయలేమని చెప్పారు. అదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనితకు వివరించాము. రూ.1,50,000 ఇస్తామని, ఆపరేషన్‌ చేయించుకోండని హామీ ఇచ్చారు. 2017 డిసెంబర్‌లో వైజాగ్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించాము. తీరా చూస్తే సాయం చేస్తానన్న ఎమ్మెల్యే చేయలేదు. ఆపరేషన్, ఖర్చులతో కలిపి రూ.4 లక్షలు అయ్యింది. అప్పులపాలయ్యాము. బాబు పాలనలో పేదలకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడటం లేదు. 
– ఆకుల దుర్గ, పాయకరావుపేట, విశాఖ జిల్లా. 

జగనన్నపైనే ఆశలన్నీ....  
రోడ్డు పక్కన తాటాకు పాకలు వేసుకుని చాలా ఏళ్లుగా జీవిస్తున్నాం.  మూడేళ్లకోసారి తాటాకులు మార్చుకుంటూ అవస్థలు పడుతున్నాం. పక్కా ఇల్లు ఇవ్వమని అడుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. పాదయాత్రగా వచ్చిన జగన్‌కు ఇదే విషయం చెప్పాము. ఆయన మాకు ధైర్యం చెప్పారు. పేదలందరికీ ఇల్లు కట్టిస్తానన్నారు. ఆయన మాటలతో మాకు ధైర్యం వచ్చింది. ఆయన పైనే ఆశలు పెట్టుకున్నాం.  
– మామిడి ముసలమ్మ, ఇతర మహిళలు, రేఖవానిపాలెం  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top