అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 

Goal of the government is to develop all areas - Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ 

చంద్రబాబు రాజధాని పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించారు 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ, బహిరంగ సభ 

మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన ప్రజలు

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అన్ని కమిటీల నివేదికలు సైతం ఇదే విషయం చెబుతున్నాయని గుర్తుచేశారు. కేవలం తన భూముల విలువ పెంచుకునేలా చంద్రబాబు అమరావతి పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్థులు, ప్రజలు, విద్యార్థులు భారీ ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. బహిరంగ సభలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రాంతం కాదని తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోలేదని ఆక్షేపించారు. రాజధాని పేరిట భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తూ చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. ఇప్పటిదాకా లెక్కలు తీస్తే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బినామీల పేరిట 4,060 ఎకరాలు కొనుగోలు చేయించినట్టు తేలిందన్నారు. వచ్చే ఏడాది నాటికి సమస్యలు లేకుండా రాష్ట్రమంతా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు.

చంద్రబాబు విష ప్రచారం: మంత్రి సుచరిత  
గత 31 రోజులుగా అమరావతిలో ఏదో జరుగుతోందని, రాజధానిని తరలిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. రాజధాని ఏర్పాటుకు అమరావతి ప్రాంతం అనుకూలం కాదని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పలు కమిటీలు నివేదికలు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆ నివేదికలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు.

అమరావతి ఎక్కడికీ పోలేదు: మంత్రి మోపిదేవి  
గత పరిస్థితులు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని పశు సంవర్థక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందని చంద్రబాబు కుటుంబంతో సహా రోడ్లపైకి వచ్చి నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ఎక్కడికీ పోలేదని, కేవలం పరిపాలన మాత్రమే వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top