పెయిడ్‌ ఆర్టిస్టులతో జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం

Gadikota Srikanth Reddy Open Challenge to Chandrababu - Sakshi

జగన్‌ను హత్య చేయించాలని చూసిన మీరు శాంతిభద్రతలపై మాట్లాడటమా?

ఎవరు అరాచకాలు చేశారో చర్చకు సిద్ధమా?

చంద్రబాబుకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌  

సాక్షి, అమరావతి: పెయిడ్‌ ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా పాలనను సాగించారన్నారు. ఎవరు ఏ రకమైన అరాచకాలు చేశారో ప్రజల వద్దే తేల్చుకోవడానికి చర్చకు రావాలని గడికోట సవాలు విసిరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో గడికోట మాట్లాడారు. జన్మభూమి కమిటీల అరాచకాలపై చర్చిద్దామని చంద్రబాబుకు దమ్మూ... ధైర్యం ఉంటే సిద్ధమా అంటూ సవాలు విసిరారు.

తన పాలనలో జగన్‌పై హత్యాయత్నం చేయించిన చంద్రబాబు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా చంపించారని ఆరోపించారు. వంగవీటి రంగాను చంద్రబాబే చంపించారనే విషయం స్వయంగా హరిరామజోగయ్య తన పుస్తకంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇలాంటి దుష్ట చరిత్ర ఉన్న చంద్రబాబు ఇంకా శిబిరాల పేరిట నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే...
అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివప్రసాదరావు తన ఇంటికి తరలించుకోవడం సహా టీడీపీ అరాచకాలు, అక్రమాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంటే దృష్టి మళ్లించేందుకే రాజధానిని మారుస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లూ తీవ్ర కరవు ఉందని, ఇవాళ ప్రాజెక్టులన్నీ నిండి పోయిన పరిస్థితి ఉంటే తన అక్రమ నివాసాన్ని ముంచడానికే పడవను అడ్డం పెట్టారని చంద్రబాబు దిగజారి మాట్లాడారన్నారు. ఎమ్మెల్యే యరపతినేని చేసిన మైనింగ్‌ మాఫియా చూసి కోర్టు కూడా ఆశ్చర్య పోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడదని, తమ పార్టీ వారు తప్పు చేసినా ఊరుకోవద్దని పోలీసులకు జగన్‌ ఆదేశాలిచ్చారన్నారు. ప్రజలు తనను చిత్తుగా ఓడించారు కనుక రాష్ట్రంలో అభివృద్ధి జరక్కూడదని చంద్రబాబు కక్షతో ఉన్నారని అనిపిస్తోందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top