కమీషన్లు అందనందుకే ఆరోగ్యశ్రీ బంద్‌ 

Gadikota Srikanth Reddy comments on Aarogyasri - Sakshi

ఇదంతా చినబాబు నిర్వాకమే

వైఎస్‌ హయాంలో శ్రీరామరక్ష.. ఇప్పుడు అవినీతిశ్రీగా మార్చారు

పొరుగు రాష్ట్రాల సంబరాలకు వెళ్లడానికి నిధులుంటాయి గానీ పేదవాడి ఆరోగ్యానికి లేవా? 

ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుంటే ఆందోళన 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌ : చినబాబు లోకేష్‌కు కమీషన్లు అందనందువల్లే నిరుపేదలకు ఉత్తమ వైద్య వసతి కల్పించే ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో బంద్‌ అయ్యాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు శ్రీరామరక్షగా ఉన్న ఈ పథకం ఇప్పుడు టీడీపీ నేతలు దోచుకునే పథకంగా తయారైందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ పాలనలో ఆరోగ్యశ్రీ ఉందన్న నమ్మకంతో రాష్ట్రంలో ప్రజలందరూ నిశ్చింతగా గుండెమీద చెయ్యేసుకుని ధైర్యంగా ఉండేవారన్నారు. అలాగే 108 వాహనాలు పది నిమిషాల్లో వచ్చి వాలేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను నిర్వీర్యం చేస్తోందని, ఈవిషయాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలోను, బహిరంగ సభల్లోనూ ప్రస్తావిస్తున్నాని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు చెల్లించనందున యాజమాన్యాలు వైద్య సదుపాయాలను నిలిపేశాయని తెలిపారు. రాష్ట్రంలోని  35 లక్షల మందికి వైద్య సదుపాయం బంద్‌ అయ్యిందని చెప్పారు.  

సీఎం వ్యక్తిగత ప్రచారాలకు ప్రజా సొమ్ము దుర్వినియోగం..  
సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల్లో సంబరాలకు, సభలకు ప్రత్యేక హెలీకాప్టర్లు, విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని  ఖర్చు చేస్తున్నారని, మరోవైపు తన వ్యక్తిగత ప్రచారానికి, ధర్మ పోరాటదీక్షల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఆరోగ్య శ్రీ ఎందుకు నిలిపి వేశారని ఆరా తీయగా చినబాబుకు (లోకేశ్‌) కమీషన్లు అందనందువల్లే దీనిపై శ్రద్ధ చూపడం లేదని అంటున్నారని చెప్పారు. తుపాను భయంకరంగా వస్తుంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం చెన్నై వెళ్లారని, తర్వాత రాజస్థాన్‌కు పయనమవుతున్నారని దుయ్యబట్టారు.  ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగులు హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని చంద్రబాబు తొలగించారని, అందుకే నవరత్నాల్లో రూ.1,000 పైబడిన వైద్యం ఖర్చు ఎదురైతే ఏ ప్రాంతంలోనైనా చికిత్స చేసుకోవచ్చన్న సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిరుపేద మధ్యతరగతి ప్రజలపై చంద్రబాబు పగబట్టారని ఆరోగ్యశ్రీని నిర్వీర్య పరిచి తన రాజకీయ ప్రయోజనాలకు సీఎం రిలీఫ్‌ పండ్‌ ద్వారా వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే చెక్కులతో ఫోటోలు తీసి ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.  ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు రూ.500 కోట్లు తక్షణమే చెల్లించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top