ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌

Free electricity for SC and ST colonies says YS Jagan - Sakshi

     వేంపల్లి రచ్చబండ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌

     పండుటాకులకు మండలానికో వృద్ధాశ్రమం 

     సంతృప్తస్థాయిలో అందరికీ ఇళ్లు మంజూరు

     ఖాళీగా ఉన్న 1.42లక్షల ఉద్యోగాల భర్తీ 

     ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అదనంగా మరో రూ.20వేలు

     ఫించను రూ.2వేలు... వీలైతే రూ.3 వేలు 

     మూడేళ్లలో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాన్న హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు కరెంటు బిల్లే వచ్చేది కాదు. మూడేళ్ల నుంచి ఇంటికి కరెంటు బిల్లులు వస్తున్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పూర్తిగా కరెంటు ఉచితంగా ఇస్తాను. అనాధలైన అవ్వా తాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం నిర్మిస్తాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థులు బాగా చదువుకునేందుకు భోజనానికి, వసతికోసం అదనంగా మరో రూ.20వేలు ఇచ్చి ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాను.

అదే విధంగా పింఛను రూ.2 వేలు ఇస్తా. వీలైతే రూ.3 వేలైనా ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాను. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ను మూడేళ్లలో పూర్తి చేసి 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను...’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆయన మంగళవారం వేంపల్లెకు చేరుకున్నారు. పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని మధ్య వేంపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

సలహాలివ్వండి.. ఆచరణలో పెడతా
మొట్టమొదటి రచ్చబండ కార్యక్రమం వేంపల్లెలో జరగడం చాలా ఆనందంగా ఉందని జగన్‌ చెప్పారు. ‘‘మన ప్రభుత్వం వస్తే మీరేం కోరుకుంటున్నారో, మీకేం చేయాలో సలహాలివ్వండి. మీరు చెప్పే ప్రతి సలహాను తీసుకుంటాను. ప్రతి కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నిస్తాను. నవరత్నాల్లో మార్పులు కావాలన్నా సూచనలివ్వండి. చంద్రబాబు ఇంత లావుగా రూపొందించిన టీడీపీ మేనిఫెస్టో ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు. అందులో అన్ని మోసాలు కాబట్టి, ఏ హామీనీ నెరవేర్చలేదు కాబట్టి మేనిఫెస్టోనే కనిపించకుండా చేశారు. మన మేనిఫెస్టో అలా కాకుండా కేవలం రెండే పేజీలతో ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చాక అందులోని హామీలన్నింటినీ అమలు చేద్దాం.

తలెత్తుకుని గర్వంగా మేనిఫెస్టో చూపిద్దాం. ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫొటో కూడా ఉండేలా పనిచేస్తాను. ప్రజలకు ఏం చేస్తే చిరస్థాయిగా నిలిచిపోతామో అటువంటి కార్యక్రమాలను చేపడతాను. అందుకే మీ ముందుకు వచ్చాను. మీరు మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. మీకు జరుగుతున్న అన్యాయాలేంటో చెప్పండి’’ అని అడిగారు. ప్రజలతో అన్ని విషయాలు చర్చించి, రచ్చబండ కార్యక్రమాన్ని ముగించి పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆవినాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండోరోజు 12.8 కిలోమీటర్లు నడిచిన వైఎస్‌ జగన్‌
సాక్షి, కడప: ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను వింటూ... వాటి పరిష్కారానికి హామీలిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రెండోరోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచారు. వేంపల్లె శివారులో మొదలైన పాదయాత్ర నేలతిమ్మాయపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ముగిసింది. రెండోరోజు మొత్తం 12.8 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు అడుగులో అడుగు వేస్తుండగా రాత్రి సమయంలో కూడా జగన్‌ ఉత్సాహంగా నడక సాగించారు. మంగళవారం సాయంత్రం 5.35 గంటల ప్రాంతంలో విరామ శిబిరంలోకి వెళ్లిన ఆయన మళ్లీ 5.45 గంటలకే బయటకు వచ్చి పాదయాత్ర చేపట్టారు. వైఎస్సార్‌ నగర్‌ నుంచి సర్వరాజుపేట, మర్రిపల్లె, ఓబుల్‌రెడ్డి క్రాస్‌ మీదుగా నేలతిమ్మాయపల్లెకు చేరుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top