ఇక తుది ఉద్యమం​

 Former TDP Leader A Revanth Reddy Joins Congress - Sakshi

కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న టీటీడీపీ కీలక నేత

ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక

కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణకు ఇది నాంది

తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు

ప్రశ్నిస్తే పోలీసు ఉక్కుపాదాలతో అణచివేస్తున్నారు

ఈ నియంతృత్వం నుంచి విముక్తి కోసం పోరాడుతాం

అమరుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నడుం కడదాం

తమకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని రేవంత్‌ పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక తెలంగాణ నిర్మించుకునేందుకు తెలంగాణ తుది విడత ఉద్యమం జరగాలని.. కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని టీటీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాము పార్టీ మారడం రాజకీయ మార్పు కాదని.. తెలంగాణలో నియంతృత్వ పాలనను అంతం చేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పునరేకీకరణ అని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

అనంతరం కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం పార్టీ మారడాన్ని రాజకీయ పార్టీ మార్పుగా మీరు చూడొద్దు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షలు నెరవేర్చేలా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. కేసీఆర్‌ పాలనతో ఆ ఫలితం ఉండం లేదు. అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు సహా తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నారో అవి నెరవేరడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసే ప్రయత్నం చేస్తోంది. భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి పేదల భూములను గుంజుకుంటోంది.

నేరెళ్లలో దళితుల మీద దాడులు, ఖమ్మంలో రైతులకు బేడీలు, తాడ్వాయి అడవుల్లో గొత్తికోయ ఆడబిడ్డలను బట్టలు ఊడదీసి కొట్టడం, విద్యార్థులు శృతి, సాగర్‌లను నక్సలైట్ల పేరుతో ఎన్‌కౌంటర్‌ చేయడం వంటి దుర్మార్గాలెన్నో ఈ రోజు తెలంగాణలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు పక్కకు పోయి బర్రెలు, గొర్రెలు, చీరలు, చేపలు వచ్చినయి. నిరుద్యోగులకు ఉద్యోగాలుగానీ, దళితులకు మూడెకరాల భూమిగానీ, గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లుగానీ.. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీరుగారిపోయాయి. కేసీఆర్‌ తన కోసం, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలు, ఆస్తుల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని వినియోగించుకుంటున్నాడు..’’అని రేవంత్‌ ఆరోపించారు. 

సామాజిక తెలంగాణ కోసం.. 
తొలి, మలి ఉద్యమాల్లో వందలాది మంది అమరులై తెలంగాణ వచ్చినా.. ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని రేవంత్‌ పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధన, పేదలకు న్యాయం కోసం కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే తాము టీడీపీని వదిలేసి వచ్చామని.. కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌లో చేరామని చెప్పారు. తాము రాజకీయ అవసరాల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పేద ప్రజలకు కాంగ్రెస్‌ వేదికగా ఉందని, దేశ ప్రజలకు, యువతకు ఆదర్శంగా నిలబడి రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా కంటక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని.. తుది ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇది ఆఖరి పోరాటం కావాలన్నారు. 

బీజేపీ–టీఆర్‌ఎస్‌ దొందూ దొందే! 
తెలంగాణలో బీజేపీ టీఆర్‌ఎస్‌కు తొత్తుగా తయారైందని, అంతర్గతంగా కలిసే ఉండి బహిరంగంగా విమర్శించుకుంటారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అరాచకాలు, అవినీతిని చూస్తూ కేంద్రం మిన్నకుండిపోయిందంటే వారిద్దరి మధ్య అవగాహన ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ‘‘ఈ అవగాహనకు కారణం విద్యాసాగర్‌రావు కావొచ్చు, మురళీధర్‌రావు కావొచ్చు. వారంతా కేసీఆర్‌కు సమీప బంధువులు. బీజేపీలో ఉండి చక్రం తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చితే అది ప్రత్యక్షంగా కేసీఆర్‌కే లాభంగా మారుతుంది. అందుకే ఇష్టమైన పార్టీ టీడీపీని వదిలేసి.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌లో చేరినం. ఈ ఆఖరు పోరాటంలో 2019లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం. పేదల కోసం పోరాడుతున్న రాహుల్‌ గాంధీ 2019లో ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం’’అని పేర్కొన్నారు. 

అన్ని పదవులూ వారికేనా..? 
‘‘కేసీఆర్‌ ఉద్యమకారులను, అనుభవజ్ఞులను పక్కనపెట్టి కుటుంబ సభ్యులనే నియమించుకున్నారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రి. అల్లుడు మంత్రి. కీలక శాఖలన్నీ వారివే. అవార్డులన్నీ వారికే వస్తయి. ఈటల రాజేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్లకు రావు. ఆయన ఉండడానికి పెద్ద బంగళా, కుమారుడికి సచివాలయం వాస్తు సరిపోలేదని కొత్త సచివాలయం అంటున్నరు. అందుకే కుటుంబ పాలన అంటున్నం..’’ 

అందరికీ న్యాయం చేస్తాం 
♦ రాహుల్‌ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు: ఉత్తమ్‌ 
కాంగ్రెస్‌పై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీపై, రాహుల్‌గాంధీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అందరం కలసికట్టుగా పనిచేసి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో నేతలు తమ పార్టీలో చేరుతున్నట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పేర్కొన్నారు. 
 
కుటుంబ పాలన అంతమే లక్ష్యం 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు రేవంత్‌రెడ్డి వెంట వచ్చిన నేతలు పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పాలనను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీయే సరైన వేదిక అన్నారు. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అనంతరం మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, బాబూరావు, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఆకాంక్షతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ కేసీఆర్‌ తన కుటుంబ సంక్షేమానికి వినియోగించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.  

ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధన, పేదలకు న్యాయం కోసం కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మేం టీడీపీని వదిలేసి కాంగ్రెస్‌లో చేరాం.    – రేవంత్‌రెడ్డి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top