గులాబీ నేతల కదలికలపై నిఘా!

Focus on trs leaders - Sakshi

అసంతృప్తుల వివరాల సేకరణ

ఇతర పార్టీల నాయకులతో సంబంధాలపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో నేతల కదలికలపై నిఘా పెట్టారా? ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వేగంగా చోటుచేసు కుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? పార్టీ వర్గాల నుంచి ఇందుకు అవుననే సమాధానం వస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉండటం, వారిలో ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న వారే కావడంతో ఈ జాగ్రత్తలు అవ సరమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏడాదిన్నరలోగా జరగ నున్న ఎన్నికల్లో 100 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆ దిశగా వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల పనితీరుపై ఓ అంచనాకు వచ్చింది. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఇతర పార్టీల్లో పేరున్న నాయకులను ఆయా స్థానాల్లో పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో ఇప్పటికే పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి చోటుచేసుకుంటోంది. ఈ కారణంగా కొందరు నాయకులు ప్రత్యామ్నాయ ఆలోచనలూ చేసే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీంతో పార్టీ నేతల కదలిక లపై అధినాయకత్వం నిఘా పెట్టిందని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

నేతల మధ్య ఆధిపత్య పోరు...
మూడేళ్లుగా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయ కుల్లో వివిధ కారణాలతో అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. నామినేటెడ్‌ పదవుల మాటటుంచి కనీసం పార్టీపరంగా కూడా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న నాయ కులు పునరాలోచనలో కూడా ఉన్నారంటున్నారు. మరోవైపు ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య మెజారిటీ నియోజక వర్గాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో తమకు అవకాశం వస్తుందా రాదా అనే విషయంలో అనుమానం ఉన్న నేతలూ ఇతర ప్రయత్నాల్లో పడ్డారని అంటున్నారు. ఇలాంటి నాయకుల సమాచారం మొత్తాన్ని సేకరించడంలో, విశ్లేషించ డంలో టీఆర్‌ఎస్‌ తలమునకలై ఉందన్న అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఓ సీనియర్‌ నేత రెండేళ్ల కిందటే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పదవి దక్కినా తన మాజీ పార్టీలో ఉన్నంత గుర్తింపు ఇక్కడ దక్కలేదు. ఈ కారణంగానే తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకుని మంతనాలు జరి పారు. సమాచారం అందగానే పార్టీ నాయకత్వం ఆ నేత బయ టకు వెళ్లకుండా విజయవంతంగా నిలువరించగలిగింది.

పార్టీ నుంచి ఎవరూ జారకుండా...
ఇతర పార్టీలు, సంఘాలతో సంబంధాలు కొనసాగిస్తున్న పార్టీ నాయకుల సమాచారాన్ని కూడా టీఆర్‌ఎస్‌ ఎప్పటికప్పుడు సేకరిస్తోందని సమాచారం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకుంటున్న నాయకత్వం... తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా నిఘా సమా చారంపైనే ఆధారపడుతోందని విశ్లేషిస్తున్నారు. నియోజక వర్గాల్లో ఒకరంటే ఒకరికి పొసగని నేతల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారు. దీంతో వారు ఏ పార్టీ నేతలను కలుస్తున్నారు, ఎలాంటి చర్చలు చేస్తున్నారన్న సమాచారం కూడా సేకరించే పనిలో పడ్డారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్‌లో ఓ ఎమ్మెల్సీ బయటకు వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరిపారన్న వివరాలను తెలుసుకోగలిగారంటున్నా రు. తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే గందర గోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అభిప్రా యంతో అలాంటి వారి కదలికలపై నిఘా పెట్టారని విశ్లేషిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top