అసంతృప్తే ఆయుధం!

Fine balancing act in anti-TRS alliance's seat-sharing formula - Sakshi

కూటమిని దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహం

అభ్యర్థులను ప్రకటించగానే అమలు

అసంతృప్తులపై ఆకర్షణ రాజకీయం

నియోజకవర్గాలవారీగా చేరికలకు ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్న కూటమి ఏర్పాటు అంశాన్నే ఎన్నికల్లో గెలుపు కోసం వినియోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. పొత్తులతో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న కూటమిలోని అసంతృప్తినే ఆయుధంగా చేసుకుని దెబ్బకొట్టడానికి సిద్ధమైంది. ప్రత్యర్థి పార్టీలు కలసి ఏర్పడిన కూటమినే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఆకర్షణ వ్యూహం సిద్ధం చేసింది.

టికెట్ల ప్రకటన తర్వాత మహాకూటమిలోని పార్టీలలో నెలకొనే అసంతృప్తులను ఎన్నికల్లో గెలుపు కోసం వినియోగించుకోవాలని నిర్ణయించింది. మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య సర్దుబాటుతో పోటీ చేసే అవకాశం రాని ఆయా పార్టీ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమైంది. మహాకూటమి అభ్యర్థులు ఖరారు కాగానే, అవకాశం రాని నేతలను వెంటనే టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది.

నియోజకవర్గాలవారీగా ఆకర్‌‡్ష ప్రణాళికను రూపొందించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ముఖ్య నేతలు జె.సంతోష్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వీరితోపాటు పలువురు లోక్‌సభ సభ్యులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఆకర్‌‡్ష వ్యూహాన్ని అమలు చేసేలా టీఆర్‌ఎస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. కూటమి అభ్యర్థుల ప్రకటన కోసం వీరంతా వేచి చూస్తున్నారు.

ప్రచారంతోపాటే చేరికలు..
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన జారీ చేయనుంది. అదేరోజు నుంచి టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం మొదలుపెట్టనుంది. నాలుగేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించేలా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచారం మొదలుకానుంది.

దీనితోపాటే నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలవారీగా ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్త నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రక్రియను ఆరంభించే అవకాశముంది. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొంటారు. ఇదే సమయంలో వారివారి స్థాయిని బట్టి ప్రత్యర్థి పార్టీల్లోని నేతల చేరికలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గస్థాయి నేతలైతే హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో చేరిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

అన్ని జిల్లాల్లో....
కూటమి ఏర్పాటు వల్ల పోటీ చేసే అవకాశంరాని నేతలు అన్ని జిల్లాల్లో ఉండే అవకాశముంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌కి 94, టీడీపీ 14, టీజేఎస్‌ 8, సీపీఐ 3 స్థానాలతో పొత్తులకు సిద్ధమయ్యాయని సమాచారం. ఇదే జరిగితే నాలుగు పార్టీల్లోనూ పోటీ చేసే అవకాశం రాని వారి సంఖ్య భారీగానే ఉంటుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అవకాశం రాని వారు సహజంగానే అసంతృప్తితో ఉంటారని, సరిగ్గా దీన్నే ఆయుధంగా మార్చుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యర్థి పార్టీల్లోని ముఖ్యనేతలను చేర్చుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. దీని వల్ల కీలకమైన ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టవచ్చని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ ఏర్పాటవుతుందని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయనే భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధమైంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top