సాగు సాగడం లేదన్నా.. 

Farmers with YS Jagan about their problems in TDP Govt - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన అన్నదాతలు 

సాగునీరు రాక ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన 

అరకొర పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని కన్నీటిపర్యంతం 

ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కష్టాలు ఏకరువు 

జన్మభూమి కమిటీలు మాఫియాగా మారాయని ఊరూరా జనం ఫిర్యాదు 

మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘అన్నా.. కరువు తాండవిస్తోంది. సాగునీరు లేక మూడేళ్లుగా పంటలు వేయడం లేదు. వర్షాధారంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. మా మండలం సీతానగరంలో 80 శాతం వరి పంట పోయింది. పెట్టుబడులు సైతం రాక వలస పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు’ అని పలువురు రైతులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 297వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూనే వారి కష్టాలూ చెప్పుకున్నారు. సీతానగరం మండలం అప్పయ్యపేట వద్ద పొలాల్లో పని చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు బురిడి సూర్యనారాయణ, పార్వతి, దినసరి కూలీలు మాట్లాడుతూ.. తమ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆదుకునే వారు లేరని వాపోయారు. ‘అన్నా.. ఎకరం పొలంలో వరి పండించేందుకు రూ.30 వేలు ఖర్చవుతుంది.

సాగునీరు సరిపడా లేక దిగుబడి తగ్గిపోయింది. దీంతో రూ.22 వేలు మాత్రమే చేతికందుతోంది. కొందరికి ఆ మేర కూడా పంట దిగుబడి రాలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జంఝావతి రబ్బర్‌ డ్యాం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ డ్యాం ద్వారా సీతానగరం మండలానికి సాగునీరు అందిస్తామని ఈ పాలకులు చెప్పినప్పటికీ అది నెరవేర లేదు. అసలు వరి నాట్లే పడని పొలాలు ఎన్నో ఉన్నాయి’ అని రైతులు, రైతు కూలీలు జననేతతో చెప్పుకున్నారు. సాగునీరు లేకున్నా ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా సోలార్‌ బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఆ లబ్ధి చేకూర్చారని వాపోయారు. తాము ఇప్పటికి నాలుగు మార్లు దరఖాస్తు చేసుకున్నా ఎన్టీఆర్‌ జలసిరి బోర్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కష్టాలు పడుతూ కూడా పంట పండిస్తే.. ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని కంట తడి పెట్టారు. పెట్టుబడులు కూడా రావడం లేదని, ఎరువులు, క్రిమి సంహారక ముందుల ధరలు వందల్లో పెరిగి పోతుంటే మద్దతు ధరలు మాత్రం కేవలం రూ.50 చొప్పున పెంచితే మా రెక్కల కష్టం ఏం కావాలని వారు ఆవేదన చెందారు.

 

జన్మభూమి కమిటీలు మాఫియాగా మారాయన్నా...
‘ఊళ్లల్లో జన్మభూమి కమిటీలు మాఫియాలుగా మారి పోయాయన్నా.. వాటి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నా..  గ్రామంలో ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులను కాదని అధికారాలన్నీ వీళ్లే చలాయిస్తున్నారన్నా.. వాళ్లతో విసిగి వేసారి పోతున్నాం..’ అని గెడ్డలుప్పి గ్రామానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష నేత జగన్‌ వద్ద వాపోయారు. ఏ పథకాలు కావాలన్నా కమిటీ మెంబర్లను కలవాల్సి వస్తోందని, ప్రతి పనికి వారు లంచం ఆశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అరాచకం భరించలేకే విసిగి వేసారి తామంతా టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నామని తెలిపారు. స్థానికంగా సువర్ణముఖి నదిపై బ్రిడ్జి లేకపోవడంతో 16 గ్రామాల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. చిన్న భోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, చిన్నరాయుడుపేటలో ప్రజలు పెద్ద సంఖ్యలో వారి కష్టాలు చెప్పుకున్నారు.  

హమ్మయ్యా.. జగనన్న బాగున్నాడు.. 
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగాక ఆయన ఎలా ఉన్నారో చూద్దామని వచ్చిన వారు ఆయన ఎదురు పడగానే జగనన్న బాగున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. తామరఖండి కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో జగన్‌ వద్దకు వచ్చారు. హత్యాయత్నం జరిగాక ఆయనకు ఏమైందోనని ఆందోళన చెందామని, ఇప్పుడాయన మునుపటిలా ఉత్సాహంగా ఉండటంతో తమ మనసు కుదుట పడిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నానికి చెందిన ఓ వృద్ధుడు రాజన్న బిడ్డను చూడాలని మధ్యాహ్నం శిబిరానికి చేరుకున్నాడు. జగన్‌ను చూడగానే విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడిన విషయం తల్చుకుని కంట తడి పెట్డాడు. ఇంత మంది అభిమానులున్న తనకేమీ కాదని, బాధపడొద్దని జగన్‌ ఆయన్ను ఓదార్చినపుడు అక్కడున్న వారందరి హృదయం ద్రవించింది. 
 

జయహో.. జగనన్నా..  
పాదయాత్రలో ముందుకు సాగుతున్న జగన్‌కు దారి పొడవునా ‘జయహో.. జగనన్నా..’ అంటూ జనం నీరాజనాలు పట్టారు. సీతానగరం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్దకు వచ్చేటప్పటికి జనం కిటకిటలాడారు. వంతెనమీద నడిచేటప్పుడు జనం ఆయన వెంట కదం తొక్కుతూ ‘జై జగన్‌..’ అంటూ నినాదాలు చేస్తూ నడిచారు. సీతానగరం బ్రిడ్జి ప్రారంభంలో నలువైపుల నుంచీ మహిళలు పోటెత్తారు. వారందరినీ జగన్‌ పలకరించడానికి చాలా సమయం పట్టింది. తామున్న చోటుకు జగన్‌ రావడానికి బాగా ఆలస్యం అవుతున్నా జనం గంటల తరబడి వేచి ఉన్నారు. ఓ అభిమాని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై దారి పొడవునా ప్రజా సంకల్ప యాత్ర దృశ్యాల చిత్ర మాలికను ఆకర్షణీయంగా అమర్చారు. జగన్‌ హైవే మీద నడుచుకుంటూ వెళుతున్నపుడు ఎదురొచ్చిన ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణీకులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. చేతులూపుతూ అభివాదం చేశారు.
 

రైతులకు అండగా నిలుస్తాం 
రైతుల కష్టాలపై జగన్‌ స్పందిస్తూ.. ‘రైతుల కష్టాలను చూస్తున్నాం. మీ బాధలు వర్ణనాతీతం. సాగునీరు అందక పెట్టు›బడులు పెరిగిపోయి అల్లాడిపోతున్నారు. మన ప్రభుత్వం రాగానే అన్నదాతలకు అండగా నిలుస్తాం. వారి సంక్షేమాన్ని దృష్టి›లో పెట్టుకుని ముందుకు వెళతాం. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నవరత్నాలతో అందరినీ ఆదుకుంటాం’ అని ధైర్యం చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top