రైతులంటే ఈ సర్కారుకు చిన్న చూపన్నా

Farmers worry in Front of YS Jagan Mohan Reddy  - Sakshi

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట అన్నదాతల ఆవేదన

     ఆదర్శ రైతుల వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం 

     కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదన్న దళితులు 

     హోదా కోసం జననేత వెంట నడుస్తామని విద్యార్థుల ప్రతిజ్ఞ 

     గిట్టుబాటు ధర లేదని తమలపాకు రైతుల ఆవేదన  

     అందరినీ ఆదుకుంటామని జననేత భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా చంద్రబాబు రావడంతోనే వ్యవసాయం నాశనమైందన్నా.. యాంత్రీకరణ పరికరాల సరఫరా లేదు. ఆదర్శ రైతుల వ్యవస్థ లేదు. అన్నిటికీ ఎమ్మెల్యే సిఫార్స్‌ అంటాడు. జన్మభూమి కమిటీ లేఖలంటాడు. మాకెందుకన్నా ఈ అవస్థ?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆదర్శ రైతులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్ర 193వ రోజు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో కొనసాగింది. జగన్‌ పర్యటించిన గ్రామాలన్నింటా పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు, మంగళ హారతులు, పుష్ప గుచ్ఛాలు, కోనసీమ పిండి వంటకాలతో జగన్‌కు పల్లె ప్రజలు సాదర స్వాగతం పలికారు. అన్నతో ఫొటో దిగామని ఒకరు, నా బిడ్డను ఆశీర్వదించారని మరొకరు, నా కొడుకుతో అక్షరాలు దిద్దించారని ఇంకొకరు, జగన్‌లో రాజశేఖరరెడ్డిని చూశామని మరికొందరు సంబరపడి పోయారు.

ఈ సందర్భంగా మొండెపులంక వద్ద ఆదర్శ రైతులు, వివిధ వర్గాల వారు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘ఆదర్శ రైతులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానస పుత్రులన్నా.. అటువంటి వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారన్నా..’ అని ఫిర్యాదు చేశారు. ‘ఈ ప్రభుత్వం కుల వృత్తుల నడ్డి విరిచింది. మా బతుకులు చిద్రమయ్యాయి. మీరొస్తేనే తిరిగి గాడిన పడతాయన్నా’ అని ఆకాంక్షించారు. రిలయన్స్, గెయిల్‌ గ్యాస్‌ కంపెనీల వల్ల సముద్ర జలాల్లో అంతరించిపోతున్న మత్స్య సంపదను కాపాడాలని పలువురు అగ్నికుల క్షత్రియులు వైఎస్‌ జగన్‌ను కోరారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. విద్య, గృహ, ఉద్యోగ, వైద్య అవకాశాలు కల్పించాలని ఆ సంఘం నాయకులు ఆదినారాయణ, సత్యనారాయణ, గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. 

అడుగడుగునా వినతులే.. 
‘సార్‌.. మా చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కనీస వేతనాలు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగులుగా మేము శాశ్వత ఉద్యోగుల కంటే ఎక్కువ సేవలందిస్తున్నాము. మాలో రూ.1500కు కూడా పని చేస్తున్న వారు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. మీరే ఆదుకోవాలి’ అని గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్‌ కార్మికులు జగన్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ రంగంలో మాదిరి ప్రైవేట్‌ సంస్థల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు దళితులు జగన్‌కు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నా దళితుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నది నామమాత్రమేనని వివరించారు. ఓఎన్‌జీసీలో స్థానికులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని దళితుల తరఫున చపల కనకాంబరం కోరారు.  

విశాఖపట్నం గీతం యూనివర్సిటీ, అమలాపురం ఎస్‌కెబీఆర్, ఆదిత్య కళాశాల, మిరియం విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అనేక మంది పాదయాత్రలో జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా సాధనలో మీ వెంటే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని దేశం నలుమూలలా చాటింది జగనొక్కరేనని ప్లకార్డులు పట్టుకుని జననేత వెంట నడిచారు. రెడ్డి కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, పార్టీ మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పొందు పరచాలని ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు జననేతకు విన్నవించారు. ‘ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు పేద రెడ్డి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పుస్తకాలు ఇవ్వాలి. ఏపీ రెసిడెన్షియల్, నవోదయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి. మెరిట్‌ ఆధారంగా ఉన్నత చదువుల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి అందరికీ 45 ఏళ్లు పెట్టాలి. సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవ్వాలి’ అని వినతిపత్రం అందజేశారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత.. మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  

బాబుపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం 
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు చిందులు వేయడాన్ని తప్పు పడుతూ పలువురు నాయీ బ్రాహ్మణులు నాగుల్లంక సమీపంలో జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ‘ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని మేము కోరటం తప్పా సార్‌’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తుల వారంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనని మరోసారి రుజువైందని వాపోయారు. 50 ఏళ్ల క్రితం నుంచి ఇస్తున్న కమీషన్‌ను మాత్రమే ఇస్తున్నారని,  దీంతో కనీస వేతనం కూడా రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. దీనిపై న్యాయం చేయాలని అడగడానికి వెళ్తే పెద్ద దిక్కుగా ఉండాల్సిన సీఎం చంద్రబాబు.. తోక కత్తిరిస్తా అంటూ అవహేళనచేస్తూ మా జాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ స్పందిస్తూ నాయీ బ్రాహ్మణుల ఆందోళనకు తాను ఇప్పటికే మద్దతు తెలిపానని, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. జగన్‌ను కలిసిన వారిలో సంఘం నాయకులు గాడుల్లి నాగ వెంకట రామమూర్తి, కాగితాలపల్లి రామాంజనేయులు, జి.కె రావు, కె శ్రీను, పాలవరం నాగేశ్వరావు ఉన్నారు.  

మేము రైతులం కాదాన్నా..?
‘తమలపాకు వేసుకున్న వారి నోరైతే పండుతుంది కానీ, మా జీవితాలు మాత్రం ఎండుతున్నాయి. మేమూ రైతులమే.. కానీ ఈ ప్రభుత్వం దృష్టిలో మేము కర్షకుల్లా కనిపించడం లేదన్నా..’ అని తమలపాకు రైతులు జగన్‌ ఎదుట వాపోయారు. నాగుల్లంక వద్ద జగన్‌ను కలిసిన వందలాది మంది తమలపాకు రైతులు తమ ఇక్కట్లను ఏకరువు పెట్టారు. ఎకరాకు నాలుగు లక్షలు ఖర్చుపెట్టి ఆకు తోటలు సాగు చేస్తుంటే చేతికి మూడు లక్షలు కూడా రావడం లేదని వాపోయారు. స్థానికంగా తమలపాకు కట్టను రూ.15కు కూడా కొనేవారు లేరన్నారు. మహారాష్ట్రకు ఎగుమతి చేస్తే రూ.25 వస్తున్నా పన్నుల రూపంలో రూ.5 నుంచి రూ.10 వరకు చెల్లించాల్సి వస్తుందన్నారు. కనీసం కట్టకు రూ.35 వస్తే తప్ప గిట్టుబాటు కాదని వివరించారు. లంక ప్రాంతాల గ్రామాల్లో సుమారు రెండు లక్షల మంది కౌలు రైతులు, కూలీలు తమలపాకు సాగులో ఉన్నారన్నారు. కౌలు రైతులే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top