రైతు క‘రుణ’ ఎవరిపై?

Farmer support for whom TRS or Congress? - Sakshi

     చర్చనీయాంశమైన టీఆర్‌ఎస్‌ రూ.లక్ష మాఫీ, కాంగ్రెస్‌ రూ.2 లక్షల మాఫీ 

     గత రుణమాఫీలో రూ.లక్షలోపు రుణమున్న రైతులు 93 శాతం 

     రూ.60 వేలు, అంతకంటే తక్కువ రుణమున్నవారు 60 శాతం 

     2014లో రుణమాఫీ లబ్ధిదారులు 35.29 లక్షల మంది 

     2017–18లో రుణాలు తీసుకున్నవారు 39.11 లక్షలు... ఈ ఖరీఫ్‌లో 21.27 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: రైతురుణం తీర్చుకోవడానికి పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే, రైతు ఎవరిపై కరుణ చూపుతారనేది చర్చనీయాంశమైంది. మరోసారి అధికారంలోకి వస్తే మళ్లీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ వాగ్దానం చేయగా, రూ. రెండు లక్షలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ రుణమాఫీ చర్చనీయాంశంగా మారింది. 2014లో అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014 మార్చి నాటికి రైతులకున్న రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీ చేసింది. నాలుగు విడతలుగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. అందుకు రూ.16,250 కోట్లు ఖర్చు చేసింది. లక్ష అని ఒక పార్టీ, రెండు లక్షలు అని మరో పార్టీ వాగ్దానాలు చేసిన నేపథ్యంలో అసలు ఎంతమందికి ఎంతెంత రుణం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించి వ్యవసాయశాఖ, బ్యాంకు వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం... 

నాడు 38 లక్షలమందిలో 35.29 లక్షల మందికి మాఫీ 
2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ ప్రకటించింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2013–14లో దాదాపు 36 లక్షల మంది రైతులు రూ.14,897 కోట్లు తీసుకున్నారు. పాత బకాయిలున్న రైతులు మరో 2 లక్షల మంది ఉంటారని అంచనా. 2014 మార్చి నాటికి మొత్తం 38 లక్షల మంది రైతుల్లో రూ.లక్షలోపు రుణాలున్నవారు 35.29 లక్షల మంది ఉన్నట్లు లెక్కగట్టారు. వీరిలో 92.83 శాతం మందికి మాఫీ జరగటం గమనార్హం. అందులో 60 శాతం మంది రైతులకు రూ.60 వేల లోపు రుణాలున్నాయని బ్యాంకులు తేల్చాయి. రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు రుణాలున్న రైతులు ఏడు శాతమేనని అధికారులు అంటున్నారు. వారిలో చాలామంది ధనిక రైతులు, పదుల ఎకరాలు కలిగినవారేనని అంటున్నారు.  

లక్ష అయితే ఎలా? రెండు లక్షలైతే ఎలా? 
ఈసారి టీఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు రూ.లక్ష రుణమాఫీ చేస్తే ఎంతమందికి లబ్ధి జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. గత లెక్కల ప్రకారమే 93 శాతం మంది రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారున్నారనుకుంటే, 36.37 లక్షల మందికి రుణమాఫీ జరిగే అవకాశముంది. అంటే రూ.లక్షకుపైగా రుణం తీసుకున్న వారిలో 2.74 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాదన్నమాట. వీరంతా ధనిక రైతులని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. అదే కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రెండు లక్షల రుణమాఫీ జరిగితే దాదాపు 99 శాతం మందికి రుణమాఫీ జరుగుతుంది. ఒక శాతం మంది రెండు లక్షలకుపైగా రుణం తీసుకొని ఉంటారని అంటున్నారు. కాబట్టి వారికి మాఫీ ఉండదు. టీఆర్‌ఎస్‌ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తే దాదాపు రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంటున్నారు. అదే కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే రూ. 25 వేల కోట్ల వరకు ఖర్చు కానుందని అంటున్నారు. అయితే, లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎవరికి ఓటు వేయాలా అన్నదాంట్లో ప్రత్యేకంగా తేల్చుకోవాల్సిన అవసరముండదు. వారు ఇతర విధానాలను, ప్రస్తుత ప్రభుత్వంపై వారికున్న అభిప్రాయాలే నిర్ణయాత్మకం అవుతాయి. ఇక రెండు లక్షల రుణమాఫీ విషయంపైనా ప్రభావితం అయ్యేవారు తక్కువమంది ఉన్నా వారు దీన్నే ప్రామాణికం తీసుకుంటారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ఏదిఏమైనా రాష్ట్రంలో లక్ష, రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఆయా పార్టీలపై ఉండే ప్రభావం చాలా స్వల్పమేనని, ఇతర విధానాలే నిర్ణయాక పా త్ర పోషిస్తాయని పలువురు రైతులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top