ఆర్టికల్‌ 370పై అపోహలు, అపార్థాలు

Facts and Myths About Article 370 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ గురించి ఎన్నో అపోహలు, అపర్థాలు ఉన్నాయని కొంత మంది రాజ్యాంగ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఈ అపోహలు ప్రజలకే కాదు, పాలకులకు కూడా ఉండడం విచారకరం. 370వ అధికరణ కింద భారత ప్రభుత్వం కశ్మీర్‌ రాష్ట్రానికి రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ల రంగంలో పూర్తి బాధ్యత వహిస్తోంది. మిగతా రంగాలకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవడం ఆ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం.

370వ అధికరణ కింద కశ్మీరులో ఇతరులెవరూ భూములు కొనడానికి వీల్లేదనుకోవడం, కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని చేసుకుంటే వారు కశ్మీర్‌లో భూమి హక్కులను కోల్పోతారని భావించడం పూర్తిగా పొరపాటు. కశ్మీర్‌లో భూములను ఇతరులు కొనరాదనే నిబంధన 370వ అధికరణం నుంచి రాలేదు. 1846, మార్చి 16వ తేదీన బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీతో డోగ్రా రాజ్‌పుత్‌లు చేసుకున్న ‘అమత్సర్‌ ఒప్పందం’ ద్వారా అమల్లోకి వచ్చింది. జమ్ము రాజు గులాబ్‌ సింగ్‌ మధ్యవర్తిత్వంలో డోగ్రాలు కశ్మీర్‌ ప్రాంతాన్ని కొనుగోలు చేసినప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కాలక్రమంలో అమలవుతూ వస్తోంది. దీన్ని జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగ అసెంబ్లీ కూడా ఆమోదించిందని కూడా చరిత్రకారలు చెబుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు ఇప్పటికీ హిమాచల్‌ ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్, నికోబార్‌ దీవుల్లో కూడా ఉన్నాయి.

కశ్మీర్‌లో అన్యులు భూమి కొనుగోలు చేయకుండా 370వ అధికరణ అడ్డుపడుతుందనడం అపోహ మాత్రమని 1963లో 370వ అధికరణపై పార్లమెంట్‌లో జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిస్తూ అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్పష్టం చేశారు. నూటా పాతిక సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ ఆంక్షలు కొనసాగడం మన మంచికేనని, లేకపోతే పేద కశ్మీర్‌ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి రియల్‌ ఎస్టేట్‌ భూ భకాసురులు అక్కడి భూములను కూడా భోంచేసే వారన్న వాదనలూ ఉన్నాయి. ఇక కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే వారు స్థానిక భూమి హక్కులు కోల్పోతారనడం అబద్ధమని, అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని 2000 సంవత్సరంలో కశ్మీర్‌ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.

ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, చరిత్రకారుడు ఏజీ నూరాని రాసిన ‘ఆర్టికల్‌ 370: ఏ కానిస్టిటూషనల్‌ హిస్టరీ ఆఫ్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్’ ప్రకారం ప్రముఖ కశ్మీరీ నాయకుడు షేక్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో జరిపిన చర్చల మేరకు నాడు కశ్మీర్‌ పాలకుడు హరిసింగ్‌  కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి 1947, అక్టోబర్‌ నెలలో అంగీకారానికి వచ్చారు. ఆ ఒప్పందంలో భాగంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల రంగాల్లో కశ్మీర్‌కు సహరించేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. హరిసింగ్‌ డిమాండ్‌ మేరకు మిగతా వ్యవహారాల్లో కశ్మీర్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేందుకు అంగీకరించింది.

కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వ 370 అధికరణను ఓ ఎరగా తీసుకరాగా చరిత్ర గమనంలో ఇప్పుడు దీని అర్థం పూర్తిగా మారిపోయింది. ఈ అధికరణ వల్ల మూడు రంగాల్లో మినహా అన్ని రంగాల్లో కశ్మీరుకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ అధికరణ భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేస్తోందని, కశ్మీర్‌ అభివద్దికి అడ్డుగోడలా తయారైందనే వాదనలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు 370 అధికరణం రద్దు చేసుకోవడం భారత్‌కే నష్టమని, కశ్మీర్‌పై నున్న కొన్ని హక్కులను కూడా కోల్పోవడమేనని ప్రముఖ కశ్మీర్‌ ఆర్థికవేత్త డాక్టర్‌ హసీబ్‌ ద్రాబు వ్యాఖ్యానించారు. 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా ఇక ఇప్పుడు భారత సైన్యం దురాక్రమణలో కశ్మీర్‌ ఉన్నట్లని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సలహాదారు రాణా జితేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top