రేవంత్‌కు రాహుల్‌ స్వీట్.. తేడా కొట్టింది!

Facebook Comments on Revanth Reddy Photo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. పార్టీ కండువా వేశారు. తర్వాత ఆయనకు స్వీట్‌ తినిపించారు. ఈ ఫొటోలను రేవంత్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రాహుల్‌ స్వీట్‌ తినిపించిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎందుకంటే రాహుల్‌ ఎడమ చేతితో రేవంత్‌కు స్వీట్‌ తినిపించినట్టు ఫొటోలో కనబడటంతో నెటిజనులు పలురకాల కామెంట్లు పెట్టారు. రేవంత్ వ్యతిరేకులు, టీడీపీ అభిమానులు దూషణలకు దిగారు.

‘కుడి ఎడమైతే పొరపాటేనోయి. ఇంత కష్టపడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఏం బహుమతి ఇచ్చాడో మీరే చూడండి’ అంటూ రవితేజ రెడ్డి కామెంట్ చేశారు. ఎడమ చేతితో స్వీట్‌ ఇచ్చారంటే అది విషం అని అర్థం. రేవంత్‌ చేరికను రాహుల్‌ పూర్తిగా అంగీకరించినట్టు లేదని రామకృష్ణ అనే నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ఎడమ చేత్తో స్వీట్‌ పెడుతున్నారంటే హ్యాండిచ్చినటేనని నరసింహారావు అనే యూజర్ కామెంట్ చేశారు. కుడి చేతికి ఏమైందని మరొకరు ప్రశ్నించారు. ఎడమచేతితో స్వీట్ తినడానికి కాంగ్రెస్‌లో చేరినట్లు ఉందని ఇంకొరు అన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీ కండువా భుజాన వేసుకున్న రేవంత్‌కు తగిన శాస్తి జరిగిందని టీడీపీ అభిమానులు తిట్టిపోశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top