బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌: అమిత్‌ షా ప్రతీకారం!

Ex Minister P Chidambaram Faces Prospect Of Arrest - Sakshi

చిదంబరంను వెంటాడుతున్న ఐఎన్‌ఎక్స్‌ కేసు

ముందస్తు బెయిలు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

షా ప్రతీకార చర్య అంటున్న హస్తం నేతలు!

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసులో ఆయన్ని సీబీఐ, ఈడీ అధికారలు విచారించిన అనంతరం ఏక్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు.

అమిత్‌ షా ప్రతీకారం..!
చిదంబరంపై ఈడీ దాడుల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా పీ. చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేయించి.. జైల్లో వేయించారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో అమిత్‌ షా హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనమే. ఈ కేసులో అమిత్‌ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తరువాత ఆయనకు గుజరాత్‌ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు.

అరెస్ట్‌ తప్పదా..?
ఇదిలావుండగా గడిచిన పదేళ్లలో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్‌ షా నాడు గుజరాత్‌ హోంమంత్రిగా ఉండగా.. నేడు కేంద్ర హోంమంత్రిగా ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. నాడు కేంద్రంలో చక్రం తిప్పిన చిదంబరం నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతలపై ప్రతీకార్య చర్యలకు పాల్పడటం మన దేశంలో సర్వసాధారణమై పోయింది. ఈ నేపథ్యంలో తనను జైలుకు పంపిన చిదంబరంను ఎలాగైన కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని షా ప్రతీకార చర్యకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న చిదంబరంపై తాజాగా ఈడీ దాడికి దిగింది. అరెస్ట్‌ను ముందే పసిగట్టిన ఆయన ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిలును నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. చిదంబరం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైతే అరెస్ట్‌ చేయక తప్పదని ఈడీ వర్గాల సమాచారం. 

ఐఎన్‌ఎక్స్‌ కేసు ఇదీ..
2007– ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top