వ్యవసాయాన్ని పండగ చేస్తాం..

Every farmer gets Rs 12,500 per year with raithu bharosa says YS Jagan - Sakshi

     రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

     రైతు భరోసా కింద ప్రతీ రైతుకు ఏటా రూ.12,500 

     ఉచితంగా బోర్లు.. ముందే గిట్టుబాటు ధర ప్రకటన 

     రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వ్యవసాయాన్ని పందుగ చేసి అన్నదాతల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా పాలన సాగిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సహకార రంగంలో మూత పడిన డెయిరీలన్నింటినీ రైతులకు మేలు చేసే విధంగా పునరుద్ధరిస్తామని, రైతుల కోసం ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 93వ రోజు ప్రకాశం జిల్లా కొండెపి శాసనసభా నియోజకవర్గంలోని తిమ్మపాలెం వద్ద రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యం 
‘‘వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆరాటంతో నవరత్నాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించాం. రైతులు వ్యవసాయాన్ని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బంది పడేది పెట్టుబడి కోసం. ఆ పెట్టుబడిని తగ్గిస్తే రైతులకు ఆదాయం ఎక్కువ అవుతుంది. పెట్టుబడి తగ్గించడం కోసం మొట్టమొదటిగా ప్రతి రైతుకు పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రెండో కార్యక్రమంగా రైతులు తీసుకునే పంట రుణాలపై వడ్డీ లేకుండా చేస్తాం. ప్రభుత్వమే బ్యాంకులకు ఆ వడ్డీ కడుతుంది. మూడో కార్యక్రమంగా...  మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇచ్చి వారికి తోడుగా ఉంటాం. దీంతో ఎకరం పొలం ఉన్న రైతన్నకు 85 నుంచి 90 శాతం ఖర్చులు దాదాపుగా వచ్చేసినట్లే. రెండెకరాలున్న ప్రతి రైతుకు ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది.

అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ మొత్తం కాస్తో కూస్తో ఉపయోగపడుతుంది. నాలుగో కార్యక్రమంగా రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా మన ప్రభుత్వమే బోర్లు వేయిస్తుంది. ప్రస్తుతం రైతులు సొంత ఖర్చులతో బోర్లమీద బోర్లు వేసుకుని వాటిలో నీళ్లు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను విముక్తి చేయడానికే ఉచితంగా బోర్లు వేయించే పథకాన్ని ప్రవేశ పెడతాం. శనగ, కంది, మినుము, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థ పడుతున్న పరిస్థితుల నుంచి ఆదుకుంటాం. రైతు పంట వేయడానికి ముందే వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించే విధంగా ఆ పంటను ఫలానా రేటుతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముందుగానే ప్రకటిస్తాం. దాని కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.  అకాల వర్షాలు, కరువు వచ్చినపుడు రైతులకు ఇపుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ లభించడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు రూ.4,000 కోట్ల(ఇందులో సగం కేంద్రం ఇస్తుంది)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం’’ అని జగన్‌ హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top