బీజేపీ, జేడీయూ బంధం ఇక ముగిసినట్లేనా?

Is The End Of The Relation Between BJP And JDU In Bihar - Sakshi

చర్చనీయాంశంగా మారిన నితీష్‌ వ్యవహారశైలి

త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకమని తేల్చిన జేడీయూ

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అధికార జేడీయూ, మిత్రపక్షం బీజేపీ బంధం ఇక తెగిపోయినట్లేనా? అనే ప్రశ్న ఆ రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తరువాత జేడీయూ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, ఆర్జేడీతో మహాకూటమిగా పోటీచేసిన నితీష్‌.. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాల అనంతరం మహాకూటమికి గుడ్‌బై చెప్పి పాత స్నేహిం బీజేపీతో కలిసిన విషయం తెలసిందే. ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు కలిసే పోటీచేశాయి.

ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేం..
అయితే ఫలితాల అనంతరం.. మంత్రివర్గంలో నితీష్‌ ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని తీవ్ర అసహనానికి గురైంది జేడీయూ. మోదీ కేబినెట్‌లో జేడీయూకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించగా.. దీని పట్ల నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాము బిహార్‌లోనే బీజేపీతో పొత్తు కొనసాగిస్తామని, బయట మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కకపోయినప్పటికీ ఎన్డీయేలోనే చేరుతామని నితీష్‌ వివరణ ఇచ్చినప్పటికీ.. ఆపార్టీ నేతల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రానున్న రాజ్యసభ సమావేశాల్లో కీలకమైన త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని జేడీయూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

నితీష్‌కు రబ్రీ ఆహ్వానం..
దీనికి తోడు నితీశ్‌కుమార్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించడం మరింత దుమారం రేపింది.  కొత్తగా మరో 8మందికి తన కేబినెట్‌లో చోటు కల్పించగా.. విస్తరణలో బీజేపీ నుంచి ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా వచ్చే ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావించొచ్చు. అయితే లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి నితీష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్‌ కుమార్‌ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూలోని కొంతమంది నేతలు దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తొంది. ఇదే విషయాన్ని నితీష్‌ వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎడాదే సమయం ఉండడంతో రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top