కాంగ్రెస్‌ ‘ఉనికి’పాట్లు 

Elections 2019 Scenarios For BJP And Congress - Sakshi

కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీదీ అదే పరిస్థితి 

సాక్షి, అమరావతి: దేశాన్ని.. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన మర్రి చెట్టులాంటి కాంగ్రెస్‌ పార్టీ స్వీయ తప్పిదాలతో మరణ శాసనం రాసుకుంది. రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా కూలిపోయి నిస్సహాయంగా పడివుంది. మరోవైపు బీజేపీ సైతం అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. దేశంలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగినా.. రాష్ట్రంలో మాత్రం ఉనికి కోసం వెంపర్లాడుతోంది. 2019లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అవుతారా.. రాహుల్‌ అవుతారా అని దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కానీ.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీల తరఫున ఒక్కరైనా కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తారా అంటే ఎవరి పేరూ చెప్పలేని దుస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ దీనస్థితికి ఆ పార్టీల స్వయంకృతాపరాధమే కారణమన్నది నిర్వివాదాంశం. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన జాతీయ పార్టీలు రాష్ట్రంలో కొనసాగించిన ప్రస్థానాన్ని పరికిస్తే..  

గతమెంతో ఘనం.. భవిష్యత్‌ అగమ్యగోచరం 
గతమెంతో ఘనం.. వర్తమానం శూన్యం.. భవిష్యత్‌ అగమ్యగోచరం అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పాలించింది. ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం కళకళలాడిపోయేది. ఆశావహులతో కిక్కిరిసిపోయేది. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్, ఢిల్లీకి కూడా షటిల్‌ సర్వీస్‌ చేసేవారు. పైరవీలు నడిపేవారు. అప్పట్లో విమాన టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ఒకే నియోజకవర్గంలో టిక్కెట్ల కోసం పోటీపడే ఆశావహుల అనుచరులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకోవడమే కాదు.. దాడులకు సైతం తెగబడటంతో పార్టీ కార్యాలయం దద్దరిల్లిపోయేది.

టిక్కెట్ల ప్రకటన తరువాత అలకలు, బుజ్జగింపులు, తిరుగుబాటు అభ్యర్థులు.. ఓహో ఒకటేమిటి ఎన్నికల సందడి అంతా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్దే కనిపించేది. కానీ.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత అధిష్టానం స్వయంకృతాపరాధంతో రాష్ట్రంలో మరణ శాసనం రాసుకుంది. రాష్ట్ర విభజనతో మెడకు ఉరితాడు వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక.. నవ్యాంధ్ర ఏపీ శాసనసభలో తొలిసారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గడచిన ఐదేళ్లలో ఆ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. నామినేషన్ల ఘట్టం సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎలాంటి సందడీ లేదు. టిక్కెట్టు అడిగే సమర్థుడైన నాయకుడు ఒక్కడూ లేరు.

పిలిచి ఇచ్చినా తీసుకునే వారే కరువయ్యారు. కార్యకర్తల బలం లేని సీనియర్‌ నేతలు పలువురు మొన్నటివరకు పార్టీలో ఉంటూ వచ్చారు. కానీ రాహుల్‌ గాంధీతో చంద్రబాబు కుదుర్చుకున్న లోపాయికారీ ఎన్నికల పొత్తుతో కాంగ్రెస్‌ పార్టీకి మిగిలి ఉన్న కొనప్రాణం కూడా పోయింది. ఉన్న కొద్దిమంది పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2014 ఎన్నికల ఫలితాలకంటే మరింతగా ఆ పార్టీ దిగజారనుంది. ఒక్క సీటు గెలవడం కాదు కదా ఒక్క సీటులో డిపాజిట్టు కూడా దక్కే పరిస్థితి లేదనే విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. 

కమల వికాసాన్ని కమ్మేసిన టీడీపీ 
‘చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా’ అన్నమాట రాష్ట్ర బీజేపీకి సరిగ్గా వర్తిస్తుంది. రాష్ట్రంలో తృతీయ శక్తిగా ఎదిగేందుకు వచ్చిన అవకాశాలను ఆ పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ పెద్దలు  టీడీపీకి కోవర్టులుగా మారి.. చంద్రబాబు రాజకీయ లబ్ధికే ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారు. బీజేపీ సొంతంగా పోటీచేసి గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్న సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయింది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో టీడీపీ విడిచిపెట్టడంతో ఆ పార్టీ మోసపోయింది. 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఏపీలో సొంతంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా 19 శాతం ఓట్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరచింది.

దాంతో 1999 ఎన్నికలకు రాష్ట్రంలో తృతీయ శక్తిగా ఎదుగుతుందని అంతా భావించారు. కానీ.. రాష్ట్ర బీజేపీ పెద్దలను చంద్రబాబు మేనేజ్‌ చేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఫలితంగా సొంత కాళ్లపై ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో బీజేపీ కోలుకోలేకపోయింది. 2014 ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలో మోదీ అనుకూల పవనాలు వీచాయి. రాష్ట్రంలో సొంతగా పోటీచేస్తే కొన్ని సీట్లు గెలుచుకుని మళ్లీ సొంతంగా ఎదిగేందుకు అవకాశం కలిగింది. కానీ మరోసారి చంద్రబాబు మాయలో పడి టీడీపీతో పొత్తుపెట్టుకుని మోసపోయింది.

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వని అంశం బీజేపీకి ప్రతికూలంగా మారింది. అదే సమయంలో చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను తెలివిగా కేంద్రంపై నెట్టేసేందుకు యత్నిస్తున్న విషయాన్ని సకాలంలో గుర్తించి ఆ పార్టీ తగిన చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. ఆ పార్టీ తరపున టిక్కెట్ల కోసం పోటీపడే సమర్థులైన నేతలు దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా పోటీ చేయనున్న బీజేపీ ఉనికి కాపాడుకుంటే చాలన్న పరిస్థితిలో ఉంది.
-వడ్దాది శ్రీనివాస్  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top