జగన్‌కు జై

Elections 2019 Many AP Leaders Joining In YSRCP In Presence Of YS JAgan - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి క్యూ కట్టిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అగ్రనేతలు

టీడీపీ టికెట్‌ ఇచ్చినా సరే వద్దనుకుని మరీ వైఎస్సార్‌సీపీలోకి చేరికలు 

పక్షం రోజుల్లో సీన్‌ రివర్స్‌..

పూర్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం 

కాంగ్రెస్, జనసేన నుంచీ కొనసాగుతున్న చేరికలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో ప్రజల మొగ్గు మార్పుకేనని పసిగట్టిన నేతలు జననేతకు జై కొడుతున్నారు. జనబలం ఎటువైపో గ్రహించిన నాయకులు తాము కూడా అదే బాట పడుతున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అగ్రనేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. టీడీపీ సీటిచ్చినా సరే నో అంటూ ఫ్యాన్‌ గాలి కిందకు చేరుతున్నారు. ప్రజల ఆకాంక్షల ముందు మార్పును అడ్డుకునే కుట్రల్ని పంటాపంచలు చేస్తూ ఈ చేరికలు సాగుతున్నాయి. తాజా పరిణామాలు రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. సామాజిక, రాజకీయ సమీకరణాలు సమూలంగా మారడంతో రాష్ట్రంలో మార్పు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 

చేరికలతో మారిన సమీకరణలు
పక్షం రోజుల్లో సీన్‌ మొత్తం రివర్సైంది. ఆయా సామాజిక వర్గాల్లో మంచి పట్టున్న, రాజకీయంగా బలమైన నాయకత్వం అన్ని జిల్లాల్లోను వైఎస్సార్‌సీపీలోకి తరలివస్తోంది. ఉత్తరాంధ్రలో కాళింగ, గవర, బ్రాహ్మణ వర్గాలు, ఉభయ గోదావరి జిల్లా ల్లో కాపు, క్షత్రియ వర్గాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గాలు, కర్నూలులో బీసీలు, అనంతపురంలో మైనార్టీలపై ఈ చేరికలు పెనుప్రభావం చూపనున్నాయి. మాగుంట, ఆదాల, అవంతి, దాడి, రఘురామకృష్ణంరాజు, తోట నరసింహం, కృపారాణి, ఆమంచి, వంగా గీత, దాసరి జైరమేష్‌ సోదరులు, పీవీపీ, మేడా, మోదుగుల,  దేవినేని, ద్రోణంరాజు, చల్లా, దగ్గుబాటి, లబ్బి వెంకటస్వామి, బ్రహ్మానందరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, పండుల, డాక్టర్‌ బాబ్జీ, తాడిశెట్టి, అబ్దుల్‌ ఘనీ ఇలా ఎంతోమంది సీనియర్ల చేరికలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఈ పాత కొత్తల మేలి కలయికతో పార్టీ మరింత బలోపేతమవుతోందని, వచ్చే ఎన్నికల్లో విజయానికి ఇదే నాందీవాచకమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
కాళింగుల్లో పట్టున్న కృపారాణి 
శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మాజీమంత్రి, కాం గ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, ఆమె అనుచరులంతా ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. కృపారాణి బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈమె వైఎస్సార్‌సీపీ లోకి రావడం టీడీపీకి నష్టం కలిగించేదేనని ఆ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.  

విశాఖలో టీడీపీకి సీనియర్ల ఝలక్‌..  
విశాఖ జిల్లాలో టీడీపీ నేత, అనకాపల్లి సిట్టింగ్‌ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పార్టీ అధిష్టానం తీరుతో విసిగిపోయి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ చేరిక విశాఖ గ్రామీణ ప్రాంతాలతోపాటు, సిటీపైనా ప్రభావం చూపనుంది. ప్రముఖ విద్యా సంస్థల అధిపతిగా, కాపు సామాజికవర్గ నేతగా అవంతి శ్రీనివాస్‌కు పేరుంది. ఆయన రాక ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గాల్లో పార్టీకి కొలిసొచ్చే అంశం. భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాస్‌ను ఈ ఎన్నికల్లో మట్టికరిపిస్తానని అవంతి శపథం చేశారు. భీమిలి నుంచి అవంతి పోటీచేస్తే తాను గెలుపొందడం అసాధ్యమని భావించిన మంత్రి గంటా చివరకు విశాఖపట్నం నార్త్‌కు వలసపోయారు. సీనియర్‌ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, తన కుమారులతో కలసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం మరో కీలక పరిణామం. గవర సామాజికవర్గానికి చెందిన దాడి వీరభద్రరావు అనకాపల్లితోపాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రముఖ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన రాక విశాఖలో పార్టీకి బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు.  

మార్పు దిశగా ‘తూర్పు’
కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా వేధించడం, కాపు ఉద్యమాన్ని అణచివేసి అన్యాయంగా కేసులు పెట్టడం వంటి అరాచకాల్ని టీడీపీ కొనసాగించింది. దీంతో  ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గ ప్రజలు టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారని వాపోయిన టీడీపీ ఎంపీ తోట నరసింహం వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. ఈ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలపై పడనుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత శనివారం వైఎస్సార్‌ సీపీ చేరారు. గతంలో టీడీపీలో, ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర పోషించారు. కాపుసామాజిక వర్గానికి చెందిన ఆమె చేరిక ఉభయగోదావరి జిల్లాల్లో గట్టి ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఎస్సీల్లో వైఎస్సార్‌సీపీ పట్టును మరింత పెంచింది. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం చేరడం పార్టీకి కలిసొచ్చే పరిణామం. తనకు జరుగుతున్న అన్యాయంపై కన్నీళ్లు పెట్టుకున్న అదే నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీ్టకి పెద్ద షాక్‌.  

చేరికలతో పశ్చిమలో ప్రభంజనం 
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా భావించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు టీడీపీని వీడి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్నారు. కీలకమైన క్షత్రియ సామాజికవర్గ ఓటర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ కూడా పార్టీలో చేరడం అత్యంత సానుకూలాంశం. మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు వంటి సీనియర్‌ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఏలూరు మేయర్‌ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబులు కూడా టీడీపీని వీడారు. 

కృష్ణా చూపు వైఎస్సార్‌ సీపీ వైపే.. 
కృష్ణా జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కీలక నేత దాసరి జై రమేష్, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరారు. బలమైన  కమ్మ సామాజిక వర్గానికి చెందిన వీరి రాకతో కృష్ణా, గుంటూరు జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ రాక పార్టీకి మరింత బలం చేకూర్చింది. జిల్లాకు చెందిన యలమంచిలి రవి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత సోదరుడు దేవినేని చంద్రశేఖర్, విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరడం పార్టీని బలోపేతం చేసింది. 

గుంటూరులో మోదుగుల, మురళి 
గుంటూరులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి  ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌ వైపు రావడంతో గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావం చూపనుంది. ఈ రెండుచోట్లా  మోదుగుల వర్గం చాలా బలంగా ఉంది. బీసీ వర్గానికి చెందిన తాడిశెట్టి మురళి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ వర్గాల్లో పార్టీ బలం పెరిగింది.  

ప్రకాశంలో కాపు, కమ్మలపై ప్రభావం 
ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్‌ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ్టలో చేరారు. జిల్లాలోని ఆయన సామాజిక వర్గంతోపాటు, ఎన్టీఆర్‌ అభిమానులు కూడా వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే, కాపునేత ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. మాగుంటకు ఒంగోలు లోక్‌సభతోపాటు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ మంచి పట్టుంది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా టీడీపీని వీడి ఫ్యాన్‌కు జై కొట్టారు.  

నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ 
నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినా.. మార్పునకే జై కొట్టారు. ఆదాల పార్టీని వీడకుండా ఆ పార్టీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నెల్లూరు పార్లమెంటు స్థానంపై ఆదాల అత్యధిక ప్రభావం చూపగలిగే బలమైన నేత కావడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పూర్తి సానుకూలాంశం.  వైఎస్సార్‌ జిల్లా రాజంపేటకు చెందిన టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ.   

కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్‌ సీపీలోకి రావడంతో ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ పట్టు మరింత బలపడిందని చెబుతున్నారు.  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇదివరకే పార్టీలో చేరారు.  కర్నూలు ఎంపీగా గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన బుట్టారేణుక శనివారం మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరారు. బీసీ వర్గానికి(చేనేత) చెందిన మహిళగా ఆమె ప్రభావం జిల్లాలోని పలు నియోజకవర్గాలపై ఉంది. మంత్రి అఖిలప్రియ మేనమామ జగన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రాక వైఎస్సార్‌సీపీ పట్టును మరింత పెంచింది.  

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీలో చేరారు. రాయదుర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ మెట్టు గోవిందరెడ్డి రాక పార్టీకి మరింత ఊపుతెస్తోంది. హిందూపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ పార్టీ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీలో చేరారు. హిందూపురంలో అత్యధికంగా ఉన్న మైనార్టీ ఓట్లపై ఘనీ చేరిక ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.  

సినీ నటుల చేరికతో ప్రచారంలో జోష్‌ 
అలాగే సినీరంగం నుంచి కూడా వైఎస్సార్‌సీపీకి మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రముఖ నటులంతా ఆ పార్టీలో చేరుతూ ప్రచారానికి జోష్‌ తీసుకొస్తున్నారు.  సీనియర్‌ నటులుæ జయసుధ, ఆలీతో పాటు రాజారవీంద్ర, ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్‌కుమార్‌ కూడా ఇటీవలే వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  

ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖులు 
శ్రీకాకుళం: కిల్లి కృపారాణి (కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి) 
విశాఖపట్నం: అవంతి శ్రీనివాస్‌(టీడీపీ ఎంపీ), దాడి వీరభద్రరావు(టీడీపీ నేత, మాజీ మంత్రి), దాడి రత్నాకర్, ద్రోణంరాజు శ్రీనివాస్‌(కాంగ్రెస్‌), గేదెల శ్రీనుబాబు(జనసేన), కొణతాల రామకృష్ణ (మాజీ మంత్రి, నేడు చేరనున్నారు)
తూర్పు గోదావరి: తోట నరసింహం(టీడీపీ ఎంపీ), తోట వాణి, పండుల రవీంద్రబాబు(టీడీపీ ఎంపీ), వంగా గీత (మాజీ ఎంపీ), పర్వత బాపనమ్మ(టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే), పర్వత రాజబాబు(టీడీపీ నేత) 
పశ్చిమ గోదావరి: రఘురామకృష్ణంరాజు(టీడీపీ నేత), డాక్టర్‌ బాబ్జీ(మాజీ ఎమ్మెల్యే), నూర్జహాన్‌(ఏలూరు మేయర్, టీడీపీ నాయకురాలు), ఎస్‌ఎంఆర్‌ పెదబాబు(టీడీపీ నేత, కోఆప్షన్‌ సభ్యుడు) 
కృష్ణా: దాసరి జై రమేష్‌(టీడీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త), దాసరి బాలవర్ధనరావు(టీడీపీ మాజీ ఎమ్మెల్యే), పొట్లూరి వరప్రసాద్‌(ప్రముఖ పారిశ్రామికవేత్త), యలమంచిలి రవి(టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే), దేవినేని చంద్రశేఖర్‌(మంత్రి దేవినేని సోదరుడు), రత్నబిందు(విజయవాడ మాజీ మేయర్‌)  
గుంటూరు: మోదుగుల వేణుగోపాలరెడ్డి (టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే), తాడిశెట్టి మురళి 
ప్రకాశం: మాగుంట శ్రీనివాసులు రెడ్డి(టీడీపీ ఎమ్మెల్సీ, ప్రముఖ పారిశ్రామికవేత్త), దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్‌ (దగ్గుబాటి కుమారుడు), ఆమంచి కృష్ణమోహన్‌(చీరాల టీడీపీ ఎమ్మెల్యే), అన్నా రాంబాబు (మాజీ ఎమ్మెల్యే) 
నెల్లూరు: ఆదాల ప్రభాకర్‌రెడ్డి(టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి), మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్‌రావు
వైఎస్సార్‌: మేడా మల్లికార్జునరెడ్డి(టీడీపీ ఎమ్మెల్యే) 
కర్నూలు: చల్లా రామకృష్ణారెడ్డి (టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే), బుట్టా రేణుక(ఎంపీ), పోచ బ్రహ్మానందరెడ్డి(పారిశ్రామికవేత్త), లబ్బి వెంకటస్వామి(మాజీ ఎమ్మెల్యే),నీరజారెడ్డి(మాజీ ఎమ్మెల్యే), ఎస్వీ జగన్‌రెడ్డి(అఖిలప్రియ మేనమామ) 
అనంతపురం: గురునాథ్‌ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), అబ్దుల్‌ ఘనీ(టీడీపీ మాజీ ఎమ్మెల్యే), మెట్టు గోవిందరెడ్డి(మాజీ ఎమ్మెల్సీ)

వైఎస్సార్‌ సీపీలో చేరిన అనంతరం నాయకుల అభిప్రాయాలు
ఇన్ని రోజులు ఎందుకు వైఎస్సార్‌ సీపీలో చేరలేదా? అనుకుంటున్నాను – ఆదాల ప్రభాకరరెడ్డి

రాజన్న ఆశయాల కోసం.. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం- మాగుంట శ్రీనివాసులురెడ్డి 

‘గౌరవం లేని పార్టీలో చేరి పొరపాటు చేశా. శిక్ష అనుభవించా’  - బుట్టా రేణుక 

ఐదేళ్లలో ఏమీ జరగలేదు. అభివృద్ధి జరగాలంటే జగనన్నే రావాలి -వంగా గీత 

రాష్ట్రానికి జగన్‌ నాయకత్వం కావాలి. - ద్రోణంరాజు శ్రీనివాస్‌ 

-సి.శ్రీనివాసరావు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top