బెంగాల్‌లో పంచ సూత్రాలతో బీజేపీ గెలుపు

Elections 2019 Five Reasons For The BJP Surge In West Bengal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 43 శాతం ఓట్లతో పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా, 40 శాతం ఓట్లతో బీజేపీ 18 సీట్లను గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం 39 శాతం ఓట్లతో తృణమూల్‌ కాంగ్రెస్‌ 34 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. గతంలోకన్నా ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ సీట్ల సంఖ్య ఎక్కువగా తగ్గడానికి ఆ స్థానంలో గతంలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ ఏకంగా 18 సీట్లు గెలుచుకోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి. 

హిందూత్వ వాదం
ఈసారి బీజేపీ ఈ వాదాన్ని బెంగాల్‌ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. శ్రీరామ నవమి పేరిట పలు ర్యాలీలు నిర్వహించింది. దుర్గా పూజా వేడుకలను మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించిందంటూ తప్పుడు ప్రచారం చేసింది. ముస్లింలను మెప్పించేందుకే కృషి చేస్తోందంటూ విమర్శలు కురిపించింది. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పట్టించుకోకుండా ముస్లిం శరణార్థులనే పట్టించుకుంటుందంటూ ఆరోపించింది. దాంతో ముస్లింల మెజారిటీ కలిగిన మాల్దా లోక్‌సభ నియోజకవర్గంలో 48 శాతం హిందువులు ఉండగా, వారిలో 36 శాతం హిందువుల ఓట్లతో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ముస్లిం ఓట్లు తృణమూల్, కాంగ్రెస్‌ మధ్య చీలిపోయాయి. 

కమ్యూనిస్టులు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం
జిల్లా స్థాయి కార్యదర్శి నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు సీపీఎం క్యాడర్‌ మొత్తం బీజేపీలో చేరిపోయింది. దాంతో సీపీఐ కార్యకర్తలు కూడా అదే బాట పట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బెదిరింపుల కారణంగా, పోలీసులు పెట్టిన అక్రమ కేసుల కారణంగా తాము సైద్ధాంతిక విభేదాలకు తిలోదకాలిచ్చి బీజేపీలో చేరిపోవాల్సి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉండడం, బీజేపీ పార్టీ వద్ద భారీగా డబ్బు ఉండడంతో బీజేపీలో చేరితేనే తమకు రక్షణ ఉంటుందని భావించామని వారు తెలిపారు. 

సామాజిక మీడియా
బీజేపీ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా విశేష  పాత్ర వహించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్‌ ద్వారా బీజేపీ విస్తత ప్రచారాన్ని సాగించింది. కుప్పలు తెప్పలుగా నకిలీ వార్తలను కూడా ప్రచారం చేసింది. ప్రజా ర్యాలీలు, బహిరంగ సభలకు పరిమితమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ కనీసం సోషల్‌ మీడియాను పట్టించుకోలేదు. కనీసం తప్పుడు వార్తలను ఖండించేందుకు కూడా సోషల్‌ మీడియాను ఉపయోగించలేక పోయింది. 

కులాల సమీకరణ
హిందూత్వ నినాదాన్ని అట్టడుగు వర్గాల్లోకి తీసుకెళ్లడం ద్వారా గత పదేళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆదివాసులను కూడా బీజేపీ సమీకరించింది. ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలను ద్వారా జార్ఖండ్‌ సరిహద్దుల్లోని దళితులను, ఆదివాసీలను ఆకట్టుకోగలిగింది. 

భారీగా నిధులు
రాష్ట్రంలోని అన్ని బీజేపీ కార్యాలయాలను రంగులతో తీర్చి దిద్దడంతోపాటు అనేక ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలను తెరిచింది. అన్ని కార్యాలయాల్లో టెలివిజన్లు, ఎయిర్‌ కూలర్లను ఏర్పాటు చేయడంతోపాటు కార్యకర్తలు తిరిగేందుకు పలు ఎస్‌యూవీలను సమకూర్చింది. ఎన్నికల ప్రచార సామాగ్రి కోసం విస్తతంగా డబ్బు ఖర్చు పెట్టింది. స్థానిక కేబుల్‌ టీవీల్లో విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని సాగించింది. పెయిడ్‌ కార్యకర్తలు కూడా పోలింగ్‌ రోజున చురుగ్గా పనిచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top