ఎన్నికల ఫలితాలు అర్థం కాలేదు 

Election results are not understood says Chandrababu - Sakshi

మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు 

కుప్పం నియోజకవర్గంలో పర్యటన 

కుప్పం (చిత్తూరు జిల్లా): ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఎలా వచ్చాయో తనకు అర్థం కాలేదని, వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటే పార్టీలో విభేదాలు పెరగడం తప్ప ఫలితం ఉండదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొట్ట మొదటిసారిగా బయటకు వచ్చి కుప్పం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నానన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తనకు కొత్తేమీ కాదన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 37 ఏళ్లలో 9 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు అధికారంలోకి వచ్చామని, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. గత ఐదేళ్ల తమ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేటట్లు పనిచేశామన్నారు. అయినా ఏ కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది, ఎవరు తప్పు చేశారు వంటి వాటిపై సమీక్షించి సరిదిద్దుకునే పనిలో ఉన్నామని తెలిపారు. బూత్‌ల వారీగా ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఓట్ల శాతాలు వంటి వాటిని వదిలిపెట్టి, విభేదాలకు తావివ్వకుండా కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  

కార్యకర్తలకు అండగా ఉంటా..: టీడీపీకి ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు మంది కార్యకర్తలు చనిపోయారని, ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరికీ తాను అండగా ఉంటానని అన్నారు. కార్యకర్తల అభిమానం తెలుగుదేశం పార్టీపై శాశ్వతంగా ఉండాలని పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం 30 అంశాలపై విచారణ జరిపిస్తామని చెబుతోందని, 37 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కుప్పంకు నీరు తీసుకువచ్చేందుకు తాను తీవ్రంగా కష్టపడినా కొన్ని చిన్నపాటి లోపాల వల్ల సకాలంలో తీసుకురాలేకపోయామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం కుప్పంకు నీరు తీసుకురావాలని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top