బాబు మోసానికి బలైపోయాం.. 

Dwcra womens says their troubles in front of YS Jagan - Sakshi

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన డ్వాక్రా మహిళలు 

     రుణాలు మాఫీ చేస్తామంటే గద్దెనెక్కించాం 

     ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా నిండా ముంచారు 

     వడ్డీతో కలిపి అప్పులు తడిసి మోపెడయ్యాయి 

     ఉపాధి కూలి డబ్బులన్నీ అప్పులకే జమ 

     మీరు ముఖ్యమంత్రి అయితేనే మా కష్టాలు తీరతాయి 

     ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని వెల్లడి 

     అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచాడయ్యా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటే అందరం కట్టకట్టి ఆనాడు ఓట్లు వేశాం. బాబును గద్దెనెక్కించాం. ఇప్పుడా అప్పు మాఫీ కాకపోగా రెట్టింపు అయింది. ఉపాధి హామీ పని కూలి డబ్బులన్నీ దానికే జమ అవుతున్నాయి. ఈ బాబు పాలన వంచనకు పరాకాష్టయ్యా..’ అంటూ పలువురు మహిళలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 286వ రోజు సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని ఎస్‌.బూర్జవలస శివారు నుంచి ప్రారంభమై బొబ్బిలి నియోజకవర్గంలోని లక్ష్మీపురం క్రాస్‌ వద్ద ముగిసింది. ఇరు నియోజకవర్గాల సరిహద్దులో ప్రజలు జననేతకు ఇటు వీడ్కోలు, అటు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు, మేళతాళాలతో తమ గ్రామాల్లోకి ఆహ్వానించి నుదట తిలకం దిద్ది ఆశీర్వదించారు. అదే సమయంలో చంద్రబాబు నాలుగున్నర ఏళ్ల పాలనలో తాము పడుతున్న ఇక్కట్లనూ ఏకరవుపెట్టారు. అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.  

కూలి డబ్బులన్నీ అప్పుకే సరి 
పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే పిండ్రంగి వలస గ్రామానికి చెందిన రౌతు మల్లమ్మ ఆధ్వర్యంలో పలువురు మహిళలు  వైఎస్‌ జగన్‌ను కలిసి చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న హామీని నమ్మి తాను తీసుకున్న రూ.20 వేల రుణం బ్యాంకుకు చెల్లించలేదని మల్లమ్మ వివరిస్తూ.. ఇప్పుడా అప్పు రూ.57 వేలకు చేరిందని వాపోయింది. తాను సభ్యురాలిగా ఉన్న డ్వాక్రా గ్రూపు ఇచ్చిన రూ.15 వేల లోను, ఉపాధి హామీ పని కింద వారం వారం వచ్చే కూలి డబ్బులన్నీ డొంకినవలసలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు వాళ్లు అప్పు కింద జమ చేసుకుంటున్నారని కన్నీళ్ల పర్యంతమైంది. అయినా ఆ అప్పు తీరలేదని వాపోయింది. ఇటువంటి అన్యాయమే తమకూ జరిగిందని ఆమెతో పాటు వచ్చిన మహిళలు జగన్‌కు నివేదించారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే డ్వాక్రా మహిళా సంఘాలకు చేకూర్చే లబ్ధి గురించి వివరించారు. ఎన్నికల నాటికి అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల్లో ఎంత అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామని చెప్పారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేస్తూ.. ఆ మంచి రోజు కోసమే ఎదురు చూస్తున్నామని, మీరు తొందరగా సీఎం కావాలని ఆకాంక్షించారు.   
 
వైఎస్‌ను ఎట్టా మరుస్తామయ్యా.. 
‘అయ్యా.. నాపేరు బుగత ఈశ్వరరావు. మాది రామభద్రాపురం మండలం ఆరికతోట. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నాకు లక్ష రూపాయల రుణం మాఫీ అయింది. ఇప్పుడు మాదిరిగా ఆవేళ ఏళ్లకు ఏళ్లు తిప్పలేదు. ఏకమొత్తంగా ఒకేసారి లోన్‌ రద్దయింది. ఆ డబ్బు నా పిల్లల చదువుకు ఉపయోగపడింది. అటువంటి నాయకుడిని నా జీవితంలో చూడలేదయ్యా.. ఆయన నిజంగా దేవుడయ్యా.. వైఎస్‌ చేసిన మేలుకు కృతజ్ఞత చెబుదామనే వచ్చా.. మిమ్మల్ని కలిశా. సంతోషంగా ఉంది. వైఎస్‌ చేసిన మేలుకు గుర్తుగా ఈ నాగలి మీకు బహూకరిస్తున్నా (నాగలిని అందజేశారు). వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద మీరు ప్రకటించిన పథకాలన్నీ సక్రమంగా అమలైతే అన్నదాతకు ఎటువంటి ఢోకా ఉండదు. అందుకే రైతులందరూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి కావాలి. నా తోటి రైతుల్ని ఆదుకోవాలి’ అని జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘సార్‌.. ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తమైంది. 108 కుయ్‌ కుయ్‌ మోత లేదు. ఏ జబ్బు వచ్చినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది’ అని కృష్ణాపురం గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు జగన్‌ ఎదుట వాపోయారు. మీరు చెబుతున్నట్లు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తే మా లాంటి పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని సారిక సత్యవతి అనే మహిళ జననేతతో చెప్పింది.   
 
మాకిస్తే ఖజానా కరిగిపోతుందా? 
దివ్యాంగులకు, అవ్వాతాతలకు నెలనెలా పింఛన్‌ ఇస్తే ప్రభుత్వ ఖజానా ఏమైనా కరిగిపోతుందా? అని పలువురు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వానికి అసలు దయ లేదయ్యా.. అంటూ మండిపడ్డారు. తన విదేశీ పర్యటనలకు, ప్రత్యేక విమానాలకు పెట్టిన ఖర్చుతో పోలిస్తే మాకిచ్చేది ఎంతయ్యా.. అంటూ గజపతినగరం, బాడంగి మండలాలకు చెందిన బి.కన్నదొర, వి.తాలమ్మ, పెంటమ్మ, గేదెల సత్యవతి తదితరులు వాపోయారు. వీరసాగరం నుంచి పి.లింగాల వలస వరకు రహదారి లేదని, నడిచి పోవాలంటే నరకం కనిపిస్తోందని దత్తిరాజేరు మండల వాసులు అనేక మంది జగన్‌ను కలిసి విన్నవించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వచ్చిన రాజానగరం మండలం పుణ్యక్షేత్రం ఎంపీటీసీ సభ్యుడు కందుల శ్రీనాథ్, మాజీ సర్పంచ్‌ పి.ఈశ్వరరావులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. సిరిపురపు వీరవెంకటసత్యనారాయణ, పి.రాంబాబు, ఎల్‌.వీరబాబు, వై.శ్రీను, డి.వీరవెంకటరావు, వై.రాంబాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  
  
నువ్వు ముఖ్యమంత్రివి కావాలయ్యా.. 
ప్రజా సంకల్పయాత్ర చౌదంతి వలస గ్రామంలోకి ప్రవేశించింది. అడుగో జగన్‌.. ఇడుగో జగన్‌.. అంటూ జనం కేరింతలు కొడుతున్నారు. మేళతాళాలు, తప్పెట్లు, తీన్‌మార్లు, మైకుల హోరు. ఈ గొడవలో తనను ఎవరు చూడనిస్తారనుకుంటూనే కొత్తపల్లి సీతాలక్ష్మి అనే 80 ఏళ్ల ఓ అవ్వ.. జననేతకు హారతి ఇచ్చి ఆశీర్వదిద్దామని బయలుదేరింది. తన శక్తినంతా కూడదీసుకుని హారతి పళ్లెంతో తన ఇంటి ముంగిట నిలబడింది. ఇంతలో పాదయాత్రగా వచ్చిన జననేత ఆమె ఇంటిని దాటబోతున్నారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న ఆమె ఆ జనంలో ముందుకు కదల్లేక.. వెనక్కు వెళ్లలేక హారతి పళ్లెం పైకెత్తి చూపింది. అంతమంది మధ్యలో ఉన్నా.. తన కోసం ఆ అవ్వ పడుతున్న ఇబ్బందిని గమనించి జగన్‌ స్వయంగా ఆమె ఇంటి ముందుకు వెళ్లారు. ఆ ఇంటి గడపకున్న నాలుగు మెట్లు ఎక్కి ఆమెను పలకరించారు. దాంతో ఉబ్బితబ్బివ్వడం ఆమె వంతయింది. తీవ్ర భావోద్వేగానికి లోనయింది. మాటల కోసం వెతుకులాడుకుంది. జగనే తన ముందుకు రావడంతో ఏమి చేయాలో పాలుపోక లిప్తకాలం పాటు అట్టే చూస్తూండిపోయింది. తర్వాత తేరుకుని నుదుట తిలకం దిద్ది.. నీవు చల్లంగుండాలయ్యా.. ముఖ్యమంత్రివి కావాలయ్యా.. అంటూ ఆశీర్వదించింది. తన భర్త నరసింహశాస్త్రి మంచం మీద కదల్లేని స్థితిలో ఉన్నాడని, తన కుటుంబం మొత్తానికి జగన్‌ అంటే అభిమానం అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. జగన్‌ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అనుకుందట.. ఆయన్ను చూడాలని, ఆ బిడ్డను ఆశీర్వదించాలని.. ఇప్పటికి తన కల నెరవేరిందంటూ సంబరపడింది. ఆ తర్వాత ఆమె అందరినీ పిలిచి జగన్‌ తన వద్దకు వచ్చారని చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో కనిపించిన సంతోషం వర్ణించనలివి కానిది.  

ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా చెత్త బుట్టపాలే  
అయ్యా.. పింఛన్‌ పొందడానికి అన్ని అర్హతలున్నా మంజూరు చేయడం లేదు. మా గ్రామానికి ఏ అధికారి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మా సమస్య చెప్పుకుంటున్నాం. పింఛన్‌ కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నాం. అవన్నీ చెత్త బుట్టలపాలయ్యాయి. వేరే పార్టీ అంటూ వివక్ష చూపించి పింఛన్‌ మంజూరు చేయడం లేదు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో పింఛన్‌ సక్రమంగా అందేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. మీరు సీఎం కాగానే న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. 
– సన్యాసమ్మ, కండిపల్లి ఈశ్వరమ్మ, ఏడేకుల ఎర్రమ్మ, చౌదంతివలస

అంగన్‌వాడీలకు వేసవి సెలవులిప్పించండి.. 
అన్నా.. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ.. ఆట పాటలతో వారికి విద్యా బుద్ధులు నేర్పించడంలో కీలకంగా పనిచేస్తున్నారు. వేసవి కాలంలో కూడా మాకు విశ్రాంతి దొరకడం లేదు. సెలవులు మంజూరు చేయడం లేదు. ప్రతి ఉద్యోగికి అన్ని రకాల సెలవులతో పాటు పండగ సెలవులు కూడా ఉంటున్నాయి. మేము మాత్రం వేసవిలోనూ పనిచేయాల్సి వస్తోంది. వేసవిలో పిల్లలకు ఇవ్వాల్సిన ఫీడింగ్‌ ఒకేసారి వారికి ఇచ్చేసి మాకు కూడా సెలవులు మంజూరు చేస్తే బాగుంటుంది. మా నెలవారీ వేతనాలు ప్రతి నెల మొదటి వారంలోనే అందేట్టు చేస్తే బాగుంటుందన్నా.  
– టి.సూర్య సింహాచలం, అంగన్‌వాడీ కార్యకర్త, చౌదంతివలస 

వైఎస్‌ దయతోనే మా పాపకు మాటలొచ్చాయి.. 
‘అన్నా.. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన మా కుమార్తెకు నాన్నగారి దయతోనే మాటలు వచ్చాయి. ఇప్పుడు అందరిలాగానే మాట్లాడుతోంది. చదువుకుంటోంది. నాన్నగారి రుణం తీర్చుకోలేం’ అని బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగికి చెందిన నాగేశ్వరరావు, కళ్యాణి దంపతులు వారి కుమార్తెతో కలిసి వచ్చి వై.ఎస్‌.జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘మా కుమార్తె విజయలక్ష్మి పుట్టుకతోనే చెవిటి, మూగ కావడంతో మాట రావాలంటే శస్త్ర చికిత్స చేయించేందుకు లక్షలాది రూపాయలు అవసరమవుతాయని వైద్యులు చెప్పారు. మాకు అంత శక్తి లేకపోవడంతో 2008 మార్చిలో మహానేత రాజశేఖరరెడ్డి గారి దగ్గరకు వెళ్లి కష్టాన్ని చెప్పుకున్నాము. అదే రోజు సాయంత్రమే ఆ మహానేత రూ.6 లక్షలు మంజూరు చేశారు. వెంటనే అపోలో ఆస్పత్రి నుంచి మాకు సమాచారం వచ్చింది. వెళ్లి జాయిన్‌ కాగానే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు మా పాప పదో తరగతి చదువుతోంది. ఆ మహానేత రుణం తీర్చుకోలేనిది’ అని కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top